కొత్త శిఖరానికి సెన్సెక్స్‌

1 Nov, 2019 05:59 IST|Sakshi

ఐదో రోజూ లాభాల్లోనే... 

77 పాయింట్ల లాభంతో 40,129కు సెన్సెక్స్‌

33 పాయింట్లు పెరిగి 11,877కు నిఫ్టీ  

స్టాక్‌ మార్కెట్లో లాభాలు కొనసాగుతున్నాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాలకు ఐటీ, బ్యాంక్, ప్రభుత్వ రంగ షేర్ల జోరు తోడవడంతో గురువారం స్టాక్‌ మార్కెట్‌ లాభాల్లో ముగిసింది. సెన్సెక్స్, నిఫ్టీలు లాభపడటం ఇది వరుసగా ఐదో రోజు. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ సరికొత్త జీవిత కాల గరిష్ట స్థాయి, 40,392 పాయింట్లను తాకింది. అక్టోబర్‌ నెల డెరివేటివ్స్‌ కాంట్రాక్టుల ముగింపు రోజు కావడంతో చివరి గంటలో స్టాక్‌ సూచీలు ఒడిదుడుకులకు గురయ్యాయి. ఐదు రోజుల లాభాల కారణంగా పై స్థాయిలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. దీంతో లాభాలు తగ్గాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 12 పైసలు తగ్గి 71.02కు చేరినా మన మార్కెట్‌ ముందుకే దూసుకుపోయింది. సెన్సెక్స్‌ 77 పాయింట్ల లాభంతో 40,129 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 33 పాయింట్లు పెరిగి 11,877 పాయింట్ల వద్ద ముగిశాయి.  

ఇంట్రాడేలో 11,900పైకి నిఫ్టీ  
కంపెనీల ఫలితాలు అంచనాలను మించి ఉండటం, విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు కొనసాగుతుండటం, మరిన్ని ఉద్దీపన చర్యలకు కేంద్ర ప్రభుత్వం సిద్దమవుతుండటం... ఇవన్నీ సెంటిమెంట్‌కు జోష్‌నిస్తున్నాయని నిపుణులంటున్నారు. అమెరికా ఫెఢ్‌ రిజర్వ్‌ వరుసగా మూడో సారి రేట్లను తగ్గించడం కలసివచి్చంది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 340 పాయింట్ల లాభంతో కొత్త ఆల్‌టైమ్‌ హై, 40,392 పాయింట్లను తాకగా, నిఫ్టీ 11,900 పాయింట్లపైకి ఎగబాకింది. 

►దిగ్గజ విదేశీ ఇన్వెస్టర్‌ ఒకరు రూ.8,500 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రానున్నారన్న వార్తల కారణంగా యెస్‌ బ్యాంక్‌ షేర్‌ 24 శాతం లాభంతో రూ.70.45 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ షేర్‌ 35 శాతం మేర లాభపడి రూ.76.65ను తాకింది. సెన్సెక్స్‌లో బాగా పెరిగిన షేర్‌ ఇదే.  

మరిన్ని వార్తలు