కొనసాగుతున్న క్లోజింగ్‌ రికార్డ్‌లు

29 May, 2019 04:48 IST|Sakshi

మూడోరోజూ గరిష్ట స్థాయికి(క్లోజింగ్‌) సెన్సెక్స్, నిఫ్టీలు

అంతంత మాత్రంగానే అంతర్జాతీయ సంకేతాలు

లాభ, నష్టాల మధ్య స్టాక్‌ సూచీల దోబూచులాట

66 పాయింట్ల లాభంతో 39,750కు సెన్సెక్స్‌ 

4 పాయింట్లు పెరిగి 11,929కు నిఫ్టీ

సెన్సెక్స్, నిఫ్టీల క్లోజింగ్‌ రికార్డ్‌లు కొనసాగుతున్నాయి. ఎన్‌డీఏ భారీ మెజారిటీ సాధించడంతో మరిన్ని సంస్కరణలు వస్తాయనే అంచనాలతో కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీలు వరుసగా మూడో రోజూ జీవిత కాల గరిష్ట స్థాయిల వద్ద ముగిశాయి. అయితే అంతర్జాతీయ సంకేతాలు అంతంతమాత్రంగానే ఉండటం, డాలర్‌తో రూపాయి మారకం బలహీనపడటం, ముడి చమురు ధరలు భగ్గుమనడం వంటి కారణాల వల్ల స్టాక్‌ మార్కెట్‌ తీవ్రమైన ఒడిదుడుకులకు గురైంది.

బ్యాంక్, టెలికం, వాహన, క్యాపిటల్‌ గూడ్స్, కన్సూమర్‌ డ్యూరబుల్స్‌ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకున్నా, చివరి అరగంటలో కొనుగోళ్లు వెల్లువెత్తాయి. రోజంతా 330 పాయింట్ల రేంజ్‌లో కదలాడిన  సెన్సెక్స్‌ చివరకు 66 పాయింట్లు లాభపడి 39,750 పాయింట్లు, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 4 పాయింట్లు పెరిగి 11,929 పాయింట్ల వద్ద ముగిశాయి. ఇవి రెండూ స్టాక్‌ సూచీలకు జీవిత కాల గరిష్ట ముగింపులు. విదేశీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లు కొనసాగడం సానుకూల ప్రభావం చూపుతోంది. ఐటీ, లోహ, ఇంధన, ఆయిల్, గ్యాస్‌ షేర్లు నష్టపోయాయి.  

330 పాయింట్ల రేంజ్‌లో  సెన్సెక్స్‌.....
అమెరికా–చైనాల వాణిజ్య యుద్ధం వంటి అంతర్జాతీయ అంశాలు, ఈ నెల 31న వెలువడనున్న జీడీపీ, తదితర గణాంకాలు, వర్షపాతం తదితర దేశీయ అంశాలపై ఇక ఇన్వెస్టర్లు దృష్టి సారిస్తారని నిపుణులంటున్నారు. సెన్సెక్స్‌ లాభాల్లోనే ఆరంభమైంది. ఆ తర్వాత లాభ, నష్టాల మధ్య దోబూచులాడింది. ఒక దశలో 184 పాయింట్ల వరకూ పతనమైన సెన్సెక్స్‌ మరో దశలో 146 పాయింట్లు లాభపడింది. మొత్తం మీద రోజంతా 330 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. ఆసియా మార్కెట్లు లాభాల్లో, యూరప్‌ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగిశాయి.  
యస్‌ బ్యాంక్‌  4%లాభంతో రూ.153 వద్ద  ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్‌ ఇదే.

ఫండమెంటల్స్‌ బాగున్న కంపెనీల్లోనే ర్యాలీ..!
 ఎన్‌ఎస్‌ఈ హెడ్‌ విక్రమ్‌ లిమాయే వ్యాఖ్య: కొత్త ప్రభుత్వంపై ఇన్వెస్టర్లు కొండంత నమ్మకంతో ఉన్నారు. ఈ కారణంగానే ఎన్నికల ఫలితాల అనంతరం దేశీ స్టాక్‌ మార్కెట్లో ఉత్సాహభరిత ర్యాలీ కొనసాగుతోంది. ఈ అంశం తరువాత వృద్ధిరేటు వంటి మార్కెట్‌ కీలక చోదకాలపైనే గమనం ఆధారపడి ఉంటుందని నేషనల్‌ స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ) హెడ్‌ విక్రమ్‌ లిమాయే వ్యాఖ్యానించారు. ‘ప్రస్తుత ఎన్నికల ర్యాలీ తరువాత.. ఫండమెంటల్స్‌ బాగున్న కంపెనీల్లోనే ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను కొనసాగిస్తారని భావిస్తున్నాం. ఆర్థిక వృద్ధి పరంగా కొంత వరకు అంచనాలకు అనుగుణంగానే ఉండే అవకాశం ఉంది. నూతన ప్రభుత్వ హయాంలో సంస్కరణలు కొనసాగి వృద్ధి బలపడేందుకు ఆస్కారం ఉంది’ అని అన్నారు.]

వచ్చే మార్చికి 43,300కు సెన్సెక్స్‌!
ఆర్‌బీఐ పాలసీ, బడ్జెట్‌లు సమీప భవిష్యత్తులో మార్కెట్‌పై ప్రభావం చూపుతాయని కోటక్‌ సెక్యూరిటీస్‌ భావిస్తోంది. ఎన్నికల యుఫోరియా సద్దుమణగగానే అమెరికా–చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు, ఆర్థిక వ్యవస్థను పీడిస్తున్న సమస్యలపై మార్కెట్‌ దృష్టి ఉంటుందని పేర్కొంది.  మార్చి నాటికి సెన్సెక్స్‌ 42,000–43,300, నిఫ్టీ 12,500–13,000 పాయింట్ల రేంజ్‌కు చేరుతుందని భావిస్తోంది.

ఐపీవోకి ఎయిర్‌టెల్‌ ఆఫ్రికా
ఎయిర్‌టెల్‌కి చెందిన ఆఫ్రికా విభాగం రుణభారం తగ్గించుకునే దిశగా ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా పబ్లిక్‌ ఇష్యూకి రానుంది. ఐపీవో ద్వారా  1 బిలియన్‌ డాలర్లు సమీకరించుకోవచ్చని వార్తల సారాంశం.

మరిన్ని వార్తలు