ఐదో రోజూ రయ్‌!

8 Jul, 2020 06:52 IST|Sakshi

బలహీనంగా ప్రపంచ మార్కెట్లు 

పతనమైన రూపాయి  

అయినా మన మార్కెట్‌ ముందుకే...

187 పాయింట్ల లాభంతో 36,675కు సెన్సెక్స్‌  

36 పాయింట్లు పెరిగి 10,800కు నిఫ్టీ

రోజంతా ఒడిదుడుకులమయంగా సాగిన మంగళవారం నాటి ట్రేడింగ్‌లో స్టాక్‌ మార్కెట్‌ చివరకు స్వల్ప లాభాలతో గట్టెక్కింది. ఆసియా, యూరప్‌ మార్కెట్లు బలహీనంగా ఉన్నా, డాలర్‌తో రూపాయి మారకం విలువ 25 పైసలు పతనమై 74.93కు చేరినా మన మార్కెట్‌ మాత్రం లాభపడింది.  కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్నా, వర్షాలు విస్తారంగా కురిసి ఆర్థిక వ్యవస్థ పుంజుకోగలదన్న అంచనాలు కలసివచ్చాయి. బ్యాంక్‌ల మారటోరియం రుణాలు తగ్గడంతో  ఆర్థిక రంగ షేర్లలో జోరుగా కొనుగోళ్లు సాగాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 187 పాయింట్ల లాభంతో 36,675 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ  నిఫ్టీ 36 పాయింట్లు పెరిగి 10.800 పాయింట్ల వద్ద ముగిశాయి. 

ఐదో రోజూ లాభాలే..
ఆసియా మార్కెట్లు బలహీనంగా ఉన్నా, మన మార్కెట్‌ లాభాల్లోనే మొదలైంది. సెన్సెక్స్, నిఫ్టీలు మధ్యాహ్నం రెండు గంటల వరకూ లాభనష్టాల మధ్య దోబూచులాడాయి. ఆ తర్వాత లాభాలు స్థిరంగా కొనసాగాయి. ఒక దశలో 216 పాయింట్లు పతనమైన సెన్సెక్స్, మరో దశలో 236 పాయింట్లు లాభపడింది. మొత్తం మీద రోజంతా 452 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. సెన్సెక్స్, నిఫ్టీలు  వరుసగా ఐదో రోజూ లాభపడ్డాయి. ఈ సూచీలు వరుసగా ఇన్నేసి రోజులు లాభపడడం గత నెల రోజుల కాలంలో ఇదే మొదటిసారి.  

మూడో రోజూ ‘విదేశీ’ కొనుగోళ్లు..
ఉద్రిక్తతలకు కారణమైన గల్వాన్‌ లోయ నుంచి చైనా బలగాలు వెనక్కి వెళ్లడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు జోష్‌నిచ్చింది. విదేశీ ఇన్వెస్టర్లు గత మూడు రోజులుగా నికర కొనుగోళ్లు జరపడం, ముడిచమురు ధరలు 1 శాతం మేర తగ్గడం  సానుకూల ప్రభావం చూపించాయి. షాంఘై మినహా మిగిలిన అన్ని ఆసియా మార్కెట్లు 1 శాతం మేర నష్టపోయాయి. యూరప్‌ మార్కెట్లు కూడా ఇదే రేంజ్‌ నష్టాల్లో ముగిశాయి.  

  •  ఏప్రిల్‌లో 27 శాతంగా ఉన్న మారటోరియం రుణాలు జూన్‌లో 16 శాతానికి తగ్గడంతో బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్‌ 8 శాతం లాభంతో రూ.3,353  వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్‌ ఇదే.  
  •  దాదాపు 120 పైగా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలను తాకాయి. టీసీఎస్, రిలయన్స్‌ ఇండస్ట్రీస్, ఆర్తి డ్రగ్స్, ఐడీబీఐ బ్యాంక్, ఎస్కార్ట్స్‌ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. 
  •  ఈ గురువారం టీసీఎస్‌ కంపెనీ  ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1 ఫలితాలను వెల్లడించనుండటంతో ఐటీ షేర్లు లాభపడ్డాయి.  
  •  దాదాపు 370 షేర్లు అప్పర్‌ సర్క్యూట్లను తాకాయి. ఆపిల్‌ ఇండియా, ఇండియాబుల్స్‌ రియల్‌ ఎస్టేట్, లెమన్‌ ట్రీ హోటల్స్‌ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.

రూపాయి 25 పైసలు పతనం 
ముంబై: డాలర్‌తో రూపాయి మారకం విలువ మంగళవారం మరింత క్షీణించింది. ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో 74.93 వద్ద ముగిసింది. అంతక్రితం (సోమవారం) ముగింపు రేటు 74.68తో పోల్చితే 25 పైసలు నష్టపోయింది. దీంతో వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిసింది. విదేశీ బ్యాంకులు అమెరికా డాలర్ల కోసం పోటెత్తిన కారణంగా ఒక దశలో 74.97 వద్దకు క్షీణించి.. 75 వద్దకు సమీపించింది. స్టాక్‌ మార్కెట్‌ బలహీనంగా ఉండడం కూడా రూపాయి నష్టాలకు కారణమని ఎల్‌కేపీ సెక్యూరిటీస్‌ సీనియర్‌ రీసెర్చ్‌ అనలిస్ట్‌  జతీన్‌ త్రివేది విశ్లేషించారు.  కరోనా కేసులు పెరుగుతుండడం, బంగారం ధరలు కొండెక్కడం వంటి ప్రతికూల అంశాలు రూపాయి విలువను కుంగదీస్తున్నాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ హెడ్‌ అడ్వైజరీ (పీసీజీ) దేవర్స్‌ వకిల్‌ అన్నారు. 

మరిన్ని వార్తలు