బ్యాంక్, లోహ షేర్ల జోరు

22 Dec, 2015 01:16 IST|Sakshi
బ్యాంక్, లోహ షేర్ల జోరు

217 పాయింట్ల లాభంతో  25,736 పాయింట్లకు సెన్సెక్స్
 పటిష్టమైన అంతర్జాతీయం సంకేతాలతో, బ్యాంక్, లోహ షేర్ల ర్యాలీతో సోమవారం స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 7,800 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 217 పాయింట్లు లాభపడి 25,736 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 73 పాయింట్ల లాభంతో 7,834 పాయింట్ల వద్ద ముగిశాయి. బ్యాంక్, లోహ, ఎఫ్‌ఎంసీజీ షేర్లు పెరిగాయి.  నష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ లాభాల స్వీకరణ, జీఎస్‌టీ బిల్లుపై అనిశ్చితి  కారణంగా మరింత నష్టాల్లోకి జారిపోయింది.

ఆ తర్వాత అమ్మకాలు పుంజుకోవడంతో  కోలుకొని 217 పాయింట్ల లాభంతో 25,736 పాయింట్ల వద్ద ముగిసింది. ఆసియా మార్కెట్లు లాభాల్లో కొనసాగుతుండడం, యూరోప్ మార్కెట్లు లాభాలతో ప్రారంభం కావడం, దివాలా బిల్లును ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టడంతో మరిన్ని  సంస్కరణలు వస్తాయన్న అంచనాలు,  ఇతర పలు కీలక బిల్లులు పార్లమెంట్ ఆమోదం పొందగలవన్న ఆశలు, రూపాయి వరుసగా ఐదో ట్రేడింగ్ సెషన్‌లోనూ బలపడడం.. ఫెడ్ నిర్ణయంపై తొలగిన అనిశ్చితి ఇవన్నీ  సెంటిమెంట్‌కు ఊపునిచ్చాయి.
 
నారాయణ హృదయాలయ ఐపీఓకు 8 రెట్లు ఓవర్ సబ్‌స్క్రిప్షన్..

 ఆరోగ్య సేవలందించే నారాయణ హృదయాలయ కంపెనీ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) 8.67 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయింది. ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.613 కోట్లు సమీకరించనున్నది. 1.71 కోట్ల ఈక్విటీ షేర్లకు గాను 14 కోట్లకు బిడ్‌లు వచ్చాయి. క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్స్(క్విబ్స్) కేటాయించినవాటా 24 రెట్లు, హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్(హెచ్‌ఎన్‌ఐలు)కు కేటాయించిన వాటా 3.6 రెట్ల చొప్పున సబ్‌స్క్రైబ్ అయింది.

అయితే రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించిన వాటా1.7 రెట్లు మాత్రమే ఓవర్ సబ్‌స్క్రైబ్ అయింది. కాగా 15 మంది యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.184 కోట్లు సమీకరించింది. ఈ ఐపీఓ ప్రైస్‌బాండ్ రూ.245-250గా ఉంది. ఈ ఐపీఓకు యాక్సిస్ క్యాపిటల్, ఐడీఎఫ్‌సీ సెక్యూరిటీస్, జెఫరీస్ ఇండియాలు లీడ్‌మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి.

మరిన్ని వార్తలు