ర్యాలీ కొనసాగేనా!

23 Sep, 2019 02:15 IST|Sakshi

సెప్టెంబర్‌ సిరీస్‌ ఎఫ్‌ అండ్‌ ఓ ముగింపు ఈవారంలోనే..

అమెరికా–చైనా వాణిజ్య చర్చలపై ఇన్వెస్టర్ల దృష్టి

గురువారం అమెరికా క్యూ2 జీడీపీ గణాంకాలు వెల్లడి

ముంబై: దేశీ కార్పొరేట్‌ రంగ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయే స్థాయి నిర్ణయాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గత వారాంతాన ప్రకటించిన నేపథ్యంలో సెన్సెక్స్‌ 1,921 పాయింట్లు, నిఫ్టీ 569 పాయింట్లు లాభపడ్డాయి. గడిచిన పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 2,285 పాయింట్లు, నిఫ్టీ 677 పాయింట్లు పెరిగాయి. కార్పొరేట్‌ రంగాన్ని సంభ్రమాశ్చర్యంలో పడేస్తూ శుక్రవారం ఆర్థిక మంత్రి భారీ పన్ను కోతను ప్రకటించారు. దేశీ కంపెనీలపై కార్పొరేట్‌ పన్నును 30 శాతం నుంచి ఒక్కసారిగా 22 శాతానికి తగ్గించారు. సెస్సులతో కలుపుకుని 35 శాతం వరకు ఉన్న పన్ను రేటు ఏకంగా 25.17 శాతానికి దిగొస్తుందన్న వార్తలు వెలువడిన నిమిషాల వ్యవధిలోనే శుక్రవారం దేశీ ప్రధాన స్టాక్‌ సూచీలు తారా జువ్వలా దూసుకుపోయాయి.

పన్ను భారం తగ్గినందున లాభాలు పెరుగుతాయని భావించిన ఇన్వెస్టర్లు రెట్టించిన ఉత్సాహంతో కొనుగోళ్లకు దిగారు. దీనికి షార్ట్‌ కవరింగ్‌ జత అయి లాభాలు మరింత పెరిగిపోయాయి. సూచీలు బలమైన ర్యాలీని నమోదుచేసినందున ఇదే ఉత్సాహం ఈ వారంలో కూడా కొనసాగేందుకు అవకాశం ఉందని దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మోదీ ప్రభుత్వం తాజాగా ప్రకటించిన ఉత్సాహభరిత అంశాలు నెమ్మదించిన దేశ ఆర్థిక వ్యవస్థకు నూతన ఉత్సాహాన్ని ఇచ్చాయని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ పరిశోధన విభాగం హెడ్‌ వినోద్‌ నాయర్‌ అన్నారు. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) మళ్లీ భారత్‌ వైపు చూసే అవకాశం ఉందని విశ్లేషించారు.  

11,500 పాయింట్లకు నిఫ్టీ..!
ఆటో, రియల్టీ, ఫైనాన్స్, బ్యాంకింగ్‌ రంగాల షేర్లలో కొనుగోళ్లు ఊపందుకుని ఈ వారంలో నిఫ్టీ 11,500 పాయింట్ల స్థాయికి చేరుకునే అవకాశం ఉందని కాపిటల్‌ఎయిమ్‌ రీసెర్చ్‌ హెడ్‌ రోమేష్‌ తివారీ అంచనావేశారు. సోమవారం నూతన లాంగ్స్‌ పెరిగి, షార్ట్‌ కవరింగ్‌ కొనసాగి నిఫ్టీ ఈ స్థాయికి చేరుకుంటుందని తాను భావిస్తున్నట్లు వెల్లడించారు. పన్ను రేటు తగ్గినందున కంపెనీల జూన్‌–సెప్టెంబర్‌ త్రైమాసిక ఫలితాలు మెరుగ్గా ఉంటాయని సామ్కో సెక్యూరిటీస్‌ సీఈఓ జిమిత్‌ మోదీ విశ్లేషించారు. లాభాల్లో కనీసం 10–15 శాతం పెరుగుదల ఉంటుందన్నారు. శుక్రవారం మార్కెట్‌ భారీ ర్యాలీని నమోదుచేసినందున ఈ స్థాయిల వద్ద నిలబడుతుందా లేదా అనే అంశానికి ఎఫ్‌పీఐ పెట్టుబడులు కీలకంగా మారాయని సామ్కో సెక్యూరిటీస్‌ సీఈఓ జిమిత్‌ మోదీ విశ్లేషించారు. మరోవైపు శుక్రవారం జీఎస్‌టీ కౌన్సిల్‌ హోటల్‌ ట్యారిఫ్‌లపై పన్ను రేట్లను తగ్గించడంతో ఈ రంగ షేర్లలో కొనుగోలుకు అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఇక సెప్టెంబర్‌ సిరీస్‌ ఫ్యూచర్‌ అండ్‌ ఆప్షన్‌ (ఎఫ్‌అండ్‌ఓ) డెరివేటివ్‌ల ముగింపు ఈ వారంలోనే ఉంది. గురువారం ఎఫ్‌అండ్‌ఓ ముగింపు, అమెరికా క్యూ2 జీడీపీ గణాంకాలు వెల్లడి మార్కెట్‌పై ప్రభావం చూపనున్నాయని అంచనా వేస్తున్నారు.

సెప్టెంబర్‌లో రూ.4,193 కోట్లు ఉపసంహరణ...
విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐ) సెప్టెంబర్‌ 3–20 కాలానికి ఈక్విటీ మార్కెట్‌ నుంచి రూ.5,578 కోట్లను ఉపసంహరించుకున్నట్లు డిపాజిటరీల డేటా ద్వారా వెల్లడయింది. అయితే, డెట్‌ మార్కెట్‌లో వీరు రూ. 1,384 కోట్లను పెట్టుబడి పెట్టారు. దీంతో క్యాపిటల్‌ మార్కెట్లో వీరి నికర పెట్టుబడి ఉపసంహరణ ఈనెల్లో ఇప్పటివరకు రూ.4,193 కోట్లకు పరిమితమైంది. కార్పొరేట్‌ పన్ను రేట్లు భారీగా తగ్గడంతో వీరి పెట్టుబడులు మళ్లీ పెరిగేందుకు ఆస్కారం ఉందని భావిస్తున్నట్లు ఐసీఐసీఐ సెక్యూరిటీ ఎండీ, సీఈఓ విజయ్‌ చందోక్‌ అన్నారు. తాజా పరిణామాలతో ఎఫ్‌పీఐ పెట్టుబడులు పెరిగేందుకు అవకాశం ఉందని వి.కే విజయ్‌కుమార్‌ విశ్లేషించారు. 

మరిన్ని వార్తలు