సంవత్‌ 2075 శుభారంభం: నేడు మార్కెట్లకు సెలవు

8 Nov, 2018 09:06 IST|Sakshi

సాక్షి, ముంబై: సంవత్‌ 2075  జోరుగా హుషారుగా ప్రారంభమైంది. ఈ కొత్త ఏడాది భారీ లాభాలతో దేశీ స్టాక్‌ మార్కెట్‌ ఇన్వెస్టర్ల ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది.  దివాలీ సందర్భంగా  బుధవారం సాయంత్రం గంటపాటు నిర్వహించిన ముహూరత్‌ ట్రేడింగ్‌ లాభాల  పంట పండించింది.  దీపావళి మతాబుల పువ్వులు పూయించింది.  ట్రేడింగ్‌ ప్రారంభం నుంచీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో సెన్సెక్స్‌ లాభాల డబుల్‌ సెంచరీ సాధించగా, నిఫ్టీ హాఫ్‌ సెంచరీ చేసింది. దాదాపు అన్ని సెక్టార్లలో లాభాల మెరుపులు మెరిశాయి.  ఆటో, ఎఫ్‌ఎంసీజీ, ఎనర్జీ షేర్ల లాభాలు బాగా ఊతమిచ్చాయి. దీంతో కీలక సూచీలు కీలక మద్దతుస్థాయిలను అధిగమించాయి. 

చివరికి సెన్సెక్స్ 246 పాయింట్లు ఎగసి 35,238 వద్ద స్థిరపడింది. తద్వారా  35,000 పాయింట్ల మైలురాయికి ఎగువన నిలిచింది. నిఫ్టీ సైతం 68 పాయింట్లు పెరిగి 10,598 వద్ద  ముగిసింది. ఎం అండ్‌ ఎం, ఇన్ఫోసిస్‌, హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌ టాప్‌ విన్నర్స్‌గా  నిలిచాయి.  మధ్యంతర ఎన్నికల నేపథ్యంలోనూ యూఎస్‌ స్టాక్‌ మార్కెట్లు లాభపడటంతో సెంటిమెంటుకు బలమొచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు.

మరోవైపు దివాలీ బలిప్రతిపాద సందర్భంగా ఈ రోజు మార్కెట్లకు  సెలవు. శుక్రవారం యథావిధిగా 9.15 నిమిషాలకు కీలక సూచీలు ట్రేడింగ్‌ను ఆరంభిస్తాయి.

మరిన్ని వార్తలు