సెన్సెక్స్‌ కీలక మద్దతు 30,750

18 May, 2020 06:26 IST|Sakshi

మార్కెట్‌ పంచాంగం

కేంద్ర ప్రభుత్వం రూ. 20 లక్షల కోట్ల భారీ ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించినప్పటికీ, ప్యాకేజీ వివరాలు మార్కెట్‌ వర్గాలను సంతృప్తిపర్చకపోవడంతోపాటు అంతర్జాతీయ మార్కెట్లలో తిరిగి అమ్మకాలు తలెత్తడంతో మన స్టాక్‌ సూచీల్లో ప్యాకేజీ పాజిటివ్‌ ఎఫెక్ట్‌ లేకుండా పోయింది. పైగా సూచీల్లో అధిక వెయిటేజి కలిగిన బ్యాంకింగ్‌ షేర్లు ఏ రోజుకారోజు క్షీణిస్తూపోవడం ఆందోళనకారకం. విదేశీ ఇన్వెస్టర్లు ఎక్కువమక్కువ చూపే బ్యాంకింగ్‌ షేర్లలో భారీ రికవరీ వచ్చేంతవరకూ మన మార్కెట్‌ దిగువ స్థాయిలోనే కదలవచ్చు.  ఇక మన సూచీల స్వల్పకాలిక సాంకేతికాలు ఇలా వున్నాయి...

సెన్సెక్స్‌ సాంకేతికాంశాలు...
మే 15తో ముగిసినవారంలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 32,845 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరిన తర్వాత  30,770 పాయింట్ల కనిష్టస్థాయికి పడిపోయింది.  చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 545 పాయింట్ల నష్టంతో 31,098 పాయింట్ల వద్ద ముగిసింది. ఏప్రిల్‌ నెలలో 38.2 శాతం రిట్రేస్‌మెంట్‌ స్థాయిగా గత వారం కాలమ్‌లో ప్రస్తావించిన 30,750 పాయింట్ల సమీపంలోనే గత శుక్రవారం సెన్సెక్స్‌ మద్దతు పొందగలిగినందున, ఈ వారం అదేస్థాయి వద్ద లభించబోయే మద్దతు కీలకం. ఈ మద్దతును కోల్పోతే వేగంగా 30,350 పాయింట్ల వద్దకు తగ్గవచ్చు. ఈ లోపున 29,900–29,500 పాయింట్ల శ్రేణి వరకూ పతనం కొనసాగవచ్చు. ఈ సోమవారం 30,750 పాయింట్ల మద్దతుస్థాయిని పరిరక్షించుకున్నా, లేక 31,300 పాయింట్లపైన గ్యాప్‌అప్‌తో మొదలైనా 31,630 పాయింట్ల వద్దకు చేరవచ్చు. అటుపైన 32,365 పాయింట్ల వరకూ పెరగవచ్చు. ఈ స్థాయిని కూడా అధిగమిస్తే తిరిగి 32,845 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు.   

నిఫ్టీ కీలక మద్దతు 8,980...
గతవారం ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 9,584 పాయింట్ల గరిష్టస్థాయికి చేరిన తర్వాత 9,050 పాయింట్ల కనిష్టస్థాయికి తగ్గింది. చివరకు అంతక్రితంవారంతో పో లిస్తే 115 పాయింట్ల నష్టంతో 9,137 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం నిఫ్టీకి 8,980 పాయింట్ల స్థా యి కీలకమైనది. ఏప్రిల్‌లో జరిగిన ర్యాలీకి 38.2% రిట్రేస్‌మెంట్‌ స్థాయి అయిన ఈ స్థాయిని కోల్పోతే వేగంగా 8,920 పాయింట్ల వద్దకు పడిపోవొచ్చు. ఈ లోపున 8,815 పాయింట్ల వరకూ పతనం కొనసాగవచ్చు. ఈ వారం 8,980 పాయింట్ల మద్దతును పరిరక్షించుకున్నా, 9,185 పాయింట్లపైన గ్యాప్‌అప్‌తో మొదలైనా 9,280 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. ఈ స్థాయిని దాటితే 9,350 పాయింట్ల వద్దకు చేరవచ్చు. అటుపైన స్థిరపడితే తిరిగి 9,580 పాయింట్ల వద్దకు పెరగవచ్చు.

– పి. సత్యప్రసాద్‌

>
మరిన్ని వార్తలు