లాభాల స్వీకరణతో మార్కెట్‌ పతనం

21 Jan, 2020 05:59 IST|Sakshi

ముడి చమురు ధరలు భగ్గు

మెప్పించని కీలక కంపెనీల ఫలితాలు

సూచీల ఆల్‌టైమ్‌ హైల నేపథ్యంలో లాభాల స్వీకరణ

416 పాయింట్ల నష్టంతో 41,529కు సెన్సెక్స్‌

128 పాయింట్లు పతనమై 12,225కు నిఫ్టీ

సెన్సెక్స్, నిఫ్టీలు జీవిత కాల గరిష్ట స్థాయిలకు చేరిన నేపథ్యంలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. సూచీల్లో వెయిటేజీ అధికంగా ఉన్న  కంపెనీల క్యూ3 ఫలితాలు అంతంతమాత్రంగానే ఉండటం, ముడి చమురు ధరలు భగ్గుమనడంతో సోమవారం స్టాక్‌ మార్కెట్‌ భారీగా పతనమైంది. సెన్సెక్స్‌ 41,550 పాయింట్లు, నిఫ్టీ 12,250 పాయింట్ల దిగువకు పతనమయ్యాయి. ఆసియా మార్కెట్లు లాభపడినా, యూరప్‌ మార్కెట్లు బలహీనంగా ఆరంభం కావడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ 5 పైసలు తగ్గి 71.13కు చేరడం (ఇంట్రాడే) ప్రతికూల ప్రభావం చూపాయి. ఆరంభంలోనే సెన్సెక్స్, నిఫ్టీలు జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకాయి. ఈ లాభాలన్నింటినీ కోల్పోయి చివరకు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌416 పాయింట్లు పతనమై 41,529 పాయింట్ల వద్ద, నిఫ్టీ 128 పాయింట్లు నష్టపోయి 12,225 పాయింట్ల వద్ద ముగిశాయి.  

771 పాయింట్ల రేంజ్‌లో సెన్సెక్స్‌: ఆసియా మార్కెట్ల జోరుతో, ఆరంభ కొనుగోళ్ల దన్నుతో సెన్సెక్స్, నిఫ్టీలు భారీ లాభాలతో ఆరంభమయ్యాయి. వెంటనే జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకాయి. సెన్సెక్స్‌ 42,274 పాయింట్ల వద్ద, నిఫ్టీ 12,430 పాయింట్ల వద్ద ఆల్‌టైమ్‌ హైలకు ఎగిశాయి.  ఒక దశలో 329 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్, మరో దశలో 442 పాయింట్లు పతనమైంది. రోజంతా 771 పాయింట్ల రేంజ్‌లో కదిలింది. హాంకాంగ్‌ మినహా ఇతర ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి.
 

శ్రీ భజరంగ్‌ పవర్‌ ఐపీఓకు సెబీ ఓకే
శ్రీ భజరంగ్‌ పవర్‌ కంపెనీ ఐపీఓకు సెబీ ఆమోదం తెలిపింది. ఐపీఓ ద్వారా రూ.500 కోట్లు సమీకరించనున్నది.

ఈ నెల 24 నుంచి ఐటీఐ ఎఫ్‌పీఓ
ప్రభుత్వ రంగ ఇండియన్‌ టెలిఫోన్‌ ఇండస్ట్రీస్‌(ఐటీఐ) కంపెనీ ఎఫ్‌పీఓ(ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌) ఈ నెల 24 నుంచి మొదలు కానున్నది. ఈ నెల 28న ముగిసే ఈ ఎఫ్‌పీఓ ద్వారా ఈ కంపెనీ రూ.1,600 కోట్లు సమీకరించనున్నది. ప్రైస్‌బ్యాండ్‌ను రేపు(ఈ నెల 22–బుధవారం) వెల్లడించనున్నది. ఈ నిధులను రుణాల చెల్లింపునకు, సాధారణ వ్యాపార కార్యకలాపాలకు వినియోగించుకోవాలని కంపెనీ యోచిస్తోంది.  బీఎస్‌ఈలో షేర్‌ స్వల్పంగా నష్టపోయి రూ.103 వద్ద ముగిసింది. 

మరిన్ని వార్తలు