రెండో రోజూ నష్టాలే...

1 Mar, 2017 01:08 IST|Sakshi

జీడీపీ గణాంకాలు,ట్రంప్‌ ప్రసంగంపై జాగరూకత
లాభాల స్వీకరణతో స్టాక్‌ సూచీల పతనం
70 పాయింట్ల నష్టంతో 28,743కు సెన్సెక్స్‌
17 పాయింట్ల నష్టంతో 8,880కు నిఫ్టీ


జీడీపీ గణాంకాల విడుదల నేపథ్యంలో మార్కెట్లో అప్రమత్తత నెలకొనడంతో మంగళవారం స్టాక్‌ మార్కెట్‌ నష్టాల్లో ముగిసింది. కొన్ని ప్రైవేట్‌ బ్యాంక్, వాహన, ఎఫ్‌ఎంసీజీ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో రెండో రోజూ స్టాక్‌ సూచీలు నష్టాలపాలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 70 పాయింట్లు క్షీణించి 28,743 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 17 పాయంట్లు నష్టపోయి 8,880 పాయింట్ల వద్ద ముగిశాయి. గత ఏడాది నవంబర్‌లో పెద్ద కరెన్సీ నోట్లను కేంద్రం రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో  డిసెంబర్‌ క్వార్టర్లో   డిమాండ్‌ను ప్రతిఫలించే జీడీపీ గణాంకాలు మంగళవారం మార్కెట్‌ ముగిసిన తర్వాత వెలువడుతుండటంతో ఇన్వెస్టర్లలో అప్రమత్తత నెలకొన్నది.

మంగళవారం రాత్రి అమెరికా కాంగ్రెస్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌ ప్రసంగించనున్న సందర్భంగా పన్ను రాయితీలు, మౌలిక రంగంపై వ్యయాల విషయమై ఆయన ఏమైనా ప్రకటనలు చేస్తారేమోనని ఇన్వెస్టర్లు వేచి చూస్తున్నారని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ చీఫ్‌ మార్కెట్‌ స్ట్రాటజిస్ట్‌ ఆనంద్‌ జేమ్స్‌ వ్యాఖ్యానించారు. లాభాల్లోనే ప్రారంభమైన సెన్సెక్స్‌ ఆ తర్వాత లాభాల స్వీకరణతో నష్టాల్లోకి జారిపోయింది. సోమవారం ముగింపుతో పోల్చితే సెన్సెక్స్‌ ఒక దశలో 64 పాయింట్లు లాభపడగా, మరొక దశలో 92 పాయింట్లు నష్టపోయింది. చివరకు 70 పాయింట్ల పతనంతో 28,743 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు