కొనసాగుతున్న రికార్డులు

22 Aug, 2018 00:44 IST|Sakshi

ఆరంభంలో ఆల్‌టైమ్‌ హైకి స్టాక్‌ సూచీలు

బ్లూచిప్‌ షేర్లలో లాభాల స్వీకరణ

నష్టాల నుంచి  రికవరీ

జీవిత కాల గరిష్ట స్థాయిల వద్ద ముగిసిన సూచీలు

7 పాయింట్లు పెరిగి 38,286కు సెన్సెక్స్‌

19 పాయింట్ల లాభంతో 11,571కు నిఫ్టీ

స్టాక్‌ మార్కెట్‌ మంగళవారం స్వల్ప లాభాలతో ముగిసింది. వరుసగా మూడో రోజు స్టాక్‌ సూచీలు లాభపడ్డాయి. ఆరంభంలోనే జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకిన సెన్సెక్స్, నిఫ్టీలు చివరకు స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి. రోజంతా పరిమితి శ్రేణిలో కదలాడినప్పటికీ, ఇంట్రాడేతో పాటు ముగింపులోనూ స్టాక్‌ సూచీలు కొత్త రికార్డ్‌లను సృష్టించాయి. అమెరికా–చైనా దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతల విషయమై ఆశావహ వాతావరణం నేపథ్యంలో ఫార్మా, ఐటీ షేర్లలో జోరుగా కొనుగోళ్లు జరగడం కలసివచ్చింది.

ప్రపంచ మార్కెట్లలో సానుకూల పవనాలు వీయడం, దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్ల కొనుగోళ్ల జోరు కొనసాగడం సానుకూల ప్రభావం చూపించాయి. అయితే బ్యాంక్‌ షేర్లలో అమ్మకాలు జరగడం, ఎఫ్‌ఎమ్‌సీజీ, లోహ షేర్లు బలహీనపడటం  ఆరంభ లాభాలను ఆవిరి చేసింది. రూపాయి పతనం ఐటీ షేర్లను లాభాల బాట పట్టించింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 7 పాయింట్ల లాభంతో 38,286 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 19 పాయింట్ల లాభంతో 11,571 పాయింట్ల వద్ద ముగిశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 38,403 పాయింట్ల వద్ద, నిఫ్టీ 11,582 పాయింట్ల వద్ద జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకాయి.

189 పాయింట్ల రేంజ్‌లో సెన్సెక్స్‌...
స్టాక్‌ సూచీలు లాభాల్లోనే ఆరంభమయ్యాయి. ఆరంభ కొనుగోళ్ల జోరుతో ఇంట్రాడేలో సెన్సెక్స్, నిఫ్టీలు జీవిత కాల గరిష్ట స్థాయిలకు చేరాయి. సెన్సెక్స్‌ 124 పాయింట్ల లాభంతో 38,403 పాయింట్ల వద్ద జీవిత కాల గరిష్ట స్థాయిని తాకింది. ఆ తర్వాత ఇటీవల పెరిగిన కొన్ని షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. దీంతో నష్టాల్లోకి జారిపోయింది.

ఒక దశలో 65 పాయింట్లు నష్టపోయింది. రోజంతా పరిమిత శ్రేణిలో కదలాడి ఒకింత రికవరీ అయి స్వల్ప లాభాలతో గట్టెక్కింది. మొత్తం మీద రోజంతా 189 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. మరోవైపు నిఫ్టీ ఒక దశలో 30 పాయింట్లు పెరగ్గా, మరో దశలో 12 పాయింట్లు నష్టపోయింది. ఆసియా, యూరప్‌ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి.

వర్షాకాలం అనంతరం నిర్మాణ కార్యకలాపాలు జోరుగా పెరుగుతాయనే అంచనాలతో సిమెంట్‌ షేర్లు పెరిగాయి. అంబుజా సిమెంట్స్, ఏసీసీ, దాల్మియా భారత్, ఇండియా సిమెంట్స్, మంగళం సిమెంట్, ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌ షేర్లు 1–4 శాతం రేంజ్‌లో పెరిగాయి.
   స్టాక్‌ సూచీలు పరిమిత శ్రేణిలో కదలాడినప్పటికీ, పలు షేర్లు ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్, బాటా ఇండియా, బెర్జర్‌ పెయింట్స్, బ్రిటానియా ఇండస్ట్రీస్, డాబర్‌ ఇండియా, హావెల్స్‌ ఇండియా, ఎల్‌ అండ్‌ టీ ఇన్ఫోటెక్, పేజ్‌ ఇండస్ట్రీస్, ఆర్‌బీఎల్‌ బ్యాంక్, వరుణ్‌ బేవరేజేస్‌ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.
   కోల్‌ ఇండియాలో కొంత వాటాను ప్రభుత్వం విక్రయించనున్నదన్న వార్తల కారణంగా ఈ షేర్‌ 2.5 శాతం లాభంతో రూ.292 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా పెరిగిన షేర్‌ ఇదే.
 చర్మ వ్యాధుల చికిత్సలో ఉపయోగించే ఔషధానికి అమెరికా ఎఫ్‌డీఏ ఆమోదం తెలపడంతో లుపిన్‌ షేర్‌  2.2% లాభంతో రూ.889 వద్ద ముగిసింది.
 షేర్ల బైబ్యాక్‌కు వాటాదారులు ఆమోదం తెలపడంతో హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ షేర్‌ 1 శాతం పెరిగి రూ.1,004 వద్దకు చేరింది.
 బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా మెరిల్‌ లించ్‌ సంస్థ రేటింగ్‌ అప్‌గ్రేడ్‌తో టెక్‌ మహీంద్రా షేర్‌ 3% పెరిగింది.

మరిన్ని వార్తలు