కరోనా కాటుపై సుంకాల పోటు!

5 May, 2020 01:21 IST|Sakshi

అమెరికా–చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు !

ప్రపంచ మార్కెట్లు క్రాష్‌..

లాక్‌డౌన్‌ పొడిగింపుతో దెబ్బతిన్న దేశీ సెంటిమెంట్‌ 

జీవిత కాల కనిష్టానికి తయారీ రంగ పీఎమ్‌ఐ 

2,002 పాయింట్ల పతనంతో సెన్సెక్స్‌ 31,715 వద్ద క్లోజ్‌

566 పాయింట్ల నష్టంతో నిఫ్టీ 9,294 వద్ద ముగింపు  

అమెరికా–చైనాల మధ్య మళ్లీ వాణిజ్య ఉద్రిక్తతలు తలెత్తనుండటంతో సోమవారం ప్రపంచ మార్కెట్లతో పాటే మన మార్కెట్‌ కూడా భారీగా నష్టపోయింది. దీంతో స్టాక్‌ మార్కెట్‌ నాలుగు రోజుల లాభాలకు బ్రేక్‌ పడింది. లాక్‌డౌన్‌ను మరో రెండు వారాల పాటు పొడిగించడం, గత నెలలో తయారీ రంగ పీఎమ్‌ఐ జీవిత కాల కనిష్ట స్థాయికి పడిపోవడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ దెబ్బతిన్నది.  సెన్సెక్స్‌ 32,000 పాయింట్లు, నిఫ్టీ 9,300 పాయింట్ల దిగువకు పడిపోయాయి. కంపెనీల క్యూ4 ఫలితాలు ప్రోత్సాహకరంగా లేకపోవడం, గత వారంలో స్టాక్‌ సూచీలు 7 శాతం మేర లాభపడిన నేపథ్యంలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడం ప్రతికూల ప్రభావం చూపించాయి. సెన్సెక్స్‌ 2,002 పాయింట్ల పతనంతో 31,715 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 566 పాయింట్లు నష్టపోయి 9,294 పాయింట్ల వద్ద ముగిశాయి. శాతం పరంగా చూస్తే, సెన్సెక్స్‌ 5.9%, నిఫ్టీ 5.7%  క్షీణించాయి. సెన్సెక్స్‌కు ఇది నాలుగో అతి పెద్ద పతనం.  

భారీ నష్టాలతో...
సెన్సెక్స్, నిఫ్టీలు భారీ నష్టాల్లో మొదలయ్యాయి. సెన్సెక్స్‌ 970 పాయింట్లు, నిఫ్టీ 326 పాయింట్ల నష్టాలతో ట్రేడింగ్‌ను ఆరంభించాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 2,086 పాయింట్లు, నిఫ్టీ 593 పాయింట్ల మేర పతనమయ్యాయి. ఫార్మా, టెలికం రంగ సూచీలు మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. ఫైనాన్స్, బ్యాంక్, లోహ, కన్సూమర్‌ డ్యూరబుల్స్, రియల్టీ షేర్లు బాగా పతనమయ్యాయి.  

మరిన్ని విశేషాలు...
► ఐసీఐసీఐ బ్యాంక్‌షేర్‌ 11% నష్టంతో రూ.338 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్‌ ఇదే. నేడు ఈ బ్యాంక్‌ ఫలితాలు వెల్లడి కానున్నాయి.  

► గత క్యూ4లో లాభం తగ్గడంతో రిలయన్స్‌ షేర్‌ 2% నష్టంతో రూ.1,435 వద్ద ముగిసింది.  

► 30 సెన్సెక్స్‌ షేర్లలో భారతీ ఎయిర్‌టెల్, సన్‌ ఫార్మా ఈ రెండు షేర్లు మాత్రమే లాభపడ్డాయి. మిగిలిన 28 షేర్లు నష్టాల్లో ముగిశాయి.  

► గత నెలలో దేశీయంగా ఎలాంటి వాహన విక్రయాలు చోటు చేసుకోకపోవడంతో వాహన షేర్లు 12 శాతం మేర నష్టపోయాయి.  

రూ.5.8 లక్షల కోట్ల సంపద ఆవిరి
స్టాక్‌ మార్కెట్‌ భారీ నష్టాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.5.82 లక్షల కోట్ల మేర ఆవిరైంది.   బీఎస్‌ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్‌ క్యాప్‌ రూ.5,82,696 కోట్లు ఆవిరై రూ.123.58 లక్షల కోట్లకు పడిపోయింది.

నష్టాలకు కారణాలివే..
► మళ్లీ వాణిజ్య ఉద్రిక్తతలు...: కరోనా వైరస్‌ చైనా సృష్టేనని, దీనికి ప్రతిగా చైనా వస్తువుల దిగుమతులపై వాణిజ్య ఆంక్షలు విధిస్తామని అమెరికా హెచ్చరించింది. చైనా ల్యాబ్‌ నుంచే కరోనా వైరస్‌ లీక్‌ అయిందనడానికి సాక్ష్యాలున్నాయని   అమెరికా వెల్లడించింది. దీంతో ఇరు దేశాల మధ్య మళ్లీ వాణిజ్య ఉద్రిక్తతలు చెలరేగుతాయనే ఆందోళన నెలకొన్నది.  

► లాక్‌డౌన్‌ 3.0...: లాక్‌డౌన్‌ మరో రెండు వారాలు కొనసాగించడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి చాలా కాలం పడుతుంద న్న భయాలతో అమ్మకాలు వెల్లువెత్తాయి.  

► తయారీ రంగం ఢమాల్‌...
తయారీ రంగం దారుణంగా దెబ్బతింది. మార్చిలో 51.8గా ఉన్న మాన్యుఫాక్చరింగ్‌ పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌(పీఎమ్‌ఐ) ఏప్రిల్‌లో 27.4కు పడిపోయింది.  

► ప్రపంచ మార్కెట్ల పతనం...: అమెరికా, చైనాల మధ్య మళ్లీ వాణిజ్య యుద్ధం చోటు చేసుకుంటుందేమోనన్న భయాలతో ప్రపంచ మార్కెట్లు పతనమయ్యాయి. హాంగ్‌కాంగ్, సియోల్‌ సూచీలు 4% మేర నష్టపోయాయి. యూరప్‌ మార్కెట్లు భారీ నష్టాల్లో ఆరంభమయ్యాయి. చివరకు 4% నష్టాల్లో ముగిశాయి. సెలవుల కారణంగా చైనా, జపాన్‌ మార్కెట్లు పనిచేయలేదు.

► రూపాయి పతనం..: డాలర్‌తో రూపాయి మారకం విలువ  64 పైసలు నష్టపోయి 75.73ను తాకింది.  

► నిరాశపరిచిన ఫలితాలు...: ఇప్పటివరకూ వెల్లడైన కంపెనీల ఆర్థిక ఫలితాలు నిరాశపరిచాయి. రిలయన్స్, టెక్‌ మహీంద్రా, హెచ్‌యూఎల్‌ ఫలితాలు అంచనాలను అందుకోలేకపోయాయి.  

► లాభాల స్వీకరణ...
గత నాలుగు ట్రేడింగ్‌ సెషన్లలో సెన్సెక్స్, నిఫ్టీలు చెరో 8 శాతం మేర లాభపడిన నేపథ్యంలో లాభాల స్వీకరణ చోటు చేసుకుం దని కొందరు నిపుణులంటున్నారు.  

► జీరో అమ్మకాలు  
గత నెలలో దేశీయంగా ఎలాంటి వాహన విక్రయాలు చోటు చేసుకోలేదు. దేశ చరిత్రలో ఇలాంటి పరిస్థితి ఇదే మొదటిసారి.  

► కొనసాగుతున్న కరోనా కల్లోలం...
అంతర్జాతీయంగా, దేశీయంగా కరోనా కల్లోలం కొనసాగుతోంది. భారత్‌లో కరో నా బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది.

మరిన్ని వార్తలు