స్పీడ్‌- 34,000-10,000 దాటేశాయ్‌

18 Jun, 2020 15:59 IST|Sakshi

తొలుత డీలా- తదుపరి జోరు

సెన్సెక్స్‌ 700 పాయింట్ల హైజంప్‌

211 పాయింట్లు జమ చేసుకున్న నిఫ్టీ

ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలకూ లాభాలే

బ్యాంకింగ్‌, మెటల్‌ రంగాల దూకుడు

కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ.. చైనాతో సరిహద్దు వద్ద సైనిక వివాదం తలెత్తినప్పటికీ దేశీ స్టాక్‌ మార్కెట్లు జోరందుకున్నాయి. ఆటుపోట్ల మధ్య ప్రారంభమైనప్పటికీ తదుపరి ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో సమయం గడిచేకొద్దీ స్పీడందుకున్నాయి. వెరసి సెన్సెక్స్‌ 34,000 పాయింట్లు, నిఫ్టీ 10,000 పాయింట్ల కీలక స్థాయిలను అధిగమించి ముగిశాయి. సెన్సెక్స్‌ 700 పాయింట్లు జంప్‌చేసి 34,208 వద్ద నిలవగా.. నిఫ్టీ 211 పాయింట్లు జమ చేసుకుని 10,92 వద్ద స్థిరపడింది. అయితే తొలుత సెన్సెక్స్‌  33,372 దిగువన కనిష్టాన్ని తాకగా.. చివర్లో 34,276కు చేరింది. ఇక నిఫ్టీ సైతం 10,111- 9,845 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. చివరకు ఇంట్రాడే గరిష్టాలవద్ద మార్కెట్లు ముగియడం గమనార్హమని విశ్లేషకులు పేర్కొన్నారు. 

మీడియా సైతం
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ లాభపడగా.. బ్యాంకింగ్‌, మెటల్‌, మీడియా 3.6-1.8 శాతం మధ్య ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, కోల్‌ ఇండియా, బజాజ్‌ ఫైనాన్స్‌, జీ, వేదాంతా, కొటక్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, పవర్‌గ్రిడ్‌, యాక్సిస్‌ 8-4 శాతం మధ్య జంప్‌చేశాయి. బ్లూచిప్స్‌లో కేవలం టీసీఎస్‌, హెచ్‌యూఎల్‌, ఎయిర్‌టెల్‌ ప్రస్తావించదగ్గ స్థాయిలో 0.5 శాతం వెనకడుగు వేశాయి.

భెల్‌ జోరు
డెరివేటివ్‌ కౌంటర్లలో బీహెచ్‌ఈఎల్‌, ముత్తూట్‌ ఫైనాన్స్‌ 16 శాతం చొప్పున దూసుకెళ్లగా.. బీఈఎల్‌, చోళమండలం, ఎన్‌సీసీ 7.5-5 శాతం మధ్య ఎగశాయి. అయితే మరోపక్క ఇంద్రప్రస్థ, కమిన్స్‌, ఎన్‌ఎండీసీ, ఎల్‌ఐసీ హౌసింగ్‌, పిడిలైట్‌, నౌకరీ, జస్ట్‌డయల్‌, ఎస్కార్ట్స్‌, పిరమల్‌, హావెల్స్‌ 5.2-1.2 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 1-1.5 శాతం చొప్పున బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 2749 లాభపడగా.. 1887 నష్టపోయాయి.

ఎఫ్‌పీఐల అమ్మకాలు
నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 487 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 168 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి. మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 1479 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా..  డీఐఐలు రూ. 1162 కోట్లను ఇన్వెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు