కర్ణాటక ఎఫెక్ట్‌ : రెండో రోజు నష్టాలే

16 May, 2018 16:09 IST|Sakshi

ముంబై : కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకి మెజార్టీ రాకుండా.. ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన నెలకొనడంతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు కూడా ఆటుపోట్లను ఎదుర్కొంటున్నాయి. ప్రారంభం నుంచి నష్టాలు పాలైన బుధవారం నాటి దేశీయ మార్కెట్లు, చివరికి కూడా కోలుకోలేకపోయాయి. సెన్సెక్స్‌ 156 పాయింట్లు కిందకి పడిపోయి 35,388 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 61 పాయింట్లు దిగజారి 10,800 మార్కుకు కింద 10,741 వద్ద స్థిరపడింది.  కన్నడ నాట ప్రభుత్వం ఏర్పాటుపై నెలకొన్న అనిశ్చితి  కారణంగా ఇన్వెస్టర్లు ఆచితూచి  వ్యవహరించారని మార్కెట్‌ విశ్లేషకులు చెప్పారు. ఆ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు తీవ్ర ఉత్కంఠను రేపుతుండటం మార్కెట్లను మరింత ప్రభావం చేస్తోంది. 

నేటి ట్రేడింగ్‌లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఐసీఐసీఐ బ్యాంకు, సిప్లా, గెయిల్‌, హెచ్‌పీసీఎల్‌, హిందాల్కోలు ఒత్తిడిని ఎదుర్కొనగా.. ఐటీసీ, హెచ్‌యూఎల్‌, విప్రో, టీసీఎస్‌లు 4 శాతం మేర లాభాలు పొందాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 14 పాయింట్లు డౌనయింది. పీఎన్‌బీ, సిండికేట్‌ బ్యాంకు, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, అదానీ ట్రాన్స్‌మిషన్‌, రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌, శక్తి పంప్స్‌ 16 శాతం మేర క్షీణించాయి. చివరిలో ఎఫ్‌ఎంసీజీ, ఎంపిక చేసిన టెక్నాలజీ స్టాక్స్‌లో నెలకొన్న కొనుగోళ్లు, బ్యాంకులు, రూపాయి విలువ రికవరీ, ఆయిల్‌ ధరలు తగ్గడం వంటి వాటితో మార్కెట్లు తన నష్టాలను కొంత మేర తగ్గించుకున్నప్పటికీ,  చివరికి మళ్లీ నష్టాల్లోనే ముగిశాయి. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 28 పైసల లాభంలో 67.82 వద్ద నమోదైంది.
 

మరిన్ని వార్తలు