సెన్సెక్స్ 247 పాయింట్లు డౌన్

29 Sep, 2015 01:09 IST|Sakshi
సెన్సెక్స్ 247 పాయింట్లు డౌన్

- 25,617 పాయింట్ల వద్ద ముగింపు
- 73 పాయింట్ల నష్టంతో 7,796కు నిఫ్టీ

ఆర్‌బీఐ పాలసీ నేపథ్యంలో స్టాక్ మార్కెట్ సోమవారం నష్టాల్లో ముగిసింది. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగియడం, యూరోప్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభం కావడం ప్రభావం చూపాయి. చివరి గంటన్నరలో అమ్మకాలు పోటెత్తాయి. నిఫ్టీ 7,800 పాయింట్ల దిగువకు పడిపోయింది. అక్టోబర్ సిరీస్ తొలిరోజున బీఎస్‌ఈ సెన్సెక్స్ 247 పాయింట్లు నష్టపోయి 25,617 పాయింట్లు, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 73 పాయింట్ల నష్టంతో 7,796 పాయింట్ల వద్ద ముగిశాయి.

ఒక దశలో 25,937 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకిన సెన్సెక్స్ లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో 247 పాయింట్ల నష్టపోయింది. కాగా ఐడీబీఐ బ్యాంక్‌లో ప్రభుత్వ వాటా 49 శాతానికి తగ్గనుందన్న వార్తల నేపథ్యంలో ఐడీబీఐ బ్యాంక్ షేర్ గత ఐదు ట్రేడింగ్ సెషన్లలో 30 శాతం వరకూ పెరిగింది. 7శాతం లాభంతో రూ.79 వద్ద ముగిసింది. ఆసిడిటీ చికిత్సలో ఉపయోగపడే ఆస్ట్రాజెనెకా నెక్సియమ్‌కు జనరిక్ ఔషధాన్ని అమెరికా మార్కెట్లో ప్రవేశపెట్టడంతో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ షేర్ బీఎస్‌ఈలో 5.3 శాతం పెరిగి రూ.4,185 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు