10 రోజుల ర్యాలీకి బ్రేక్...

4 Apr, 2014 02:51 IST|Sakshi
10 రోజుల ర్యాలీకి బ్రేక్...

వరుసగా పది రోజులపాటు లాభపడుతూ వచ్చిన స్టాక్ మార్కెట్లు ఎట్టకేలకు వెనకడుగు వేశాయి. సెన్సెక్స్ 42 పాయింట్లు తగ్గి 22,509 వద్ద ముగియగా, నిఫ్టీ కూడా 16 పాయింట్ల నష్టంతో 6,736 వద్ద నిలిచింది. అయితే తొలుత సెన్సెక్స్ గరిష్టంగా 22,621ను చేరగా, నిఫ్టీ సైతం 6,777కు చేరింది. ఇవి సరికొత్త రికార్డులుకాగా, ఆపై అమ్మకాలు పెరగడంతో లాభాలు పోగొట్టుకుని నష్టాల బాటపట్టాయి. ఒక దశలో సెన్సెక్స్ 22,369 వరకూ పతనంకాగా, నిఫ్టీ 6,697 వద్ద కనిష్టాన్ని తాకింది. గత మూడు రోజుల్లో రూ. 1,924 కోట్లను ఇన్వెస్ట్‌చేసిన ఎఫ్‌ఐఐలు గురువారం మరో రూ. 717 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. దేశీయ ఫండ్స్ యథావిధిగా రూ. 717 కోట్ల అమ్మకాలను చేపట్టాయి. గత పది రోజుల్లో సెన్సెక్స్ 811 పాయింట్లు ఎగసిన సంగతి తెలిసిందే.

 ఫైనాన్స్ షేర్లు డీలా: బ్యాంకింగ్ లెసైన్స్‌లపై అంచనాలతో ఇటీవల లాభపడుతూ వచ్చిన పలు షేర్లలో ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగడంతో భారీగా నష్టపోయాయి. నీరసించిన సెంటిమెంట్‌కు అనుగుణంగా ట్రేడైన షేర్లలో 1,511 నష్టపోతే 1,277 లాభపడ్డాయి. జేఎం ఫైనాన్షియల్, శ్రేయీ ఇన్‌ఫ్రా, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్, ఐఎఫ్‌సీఐ, మ్యాగ్మా ఫిన్‌కార్ప్, ముత్తూట్ ఫైనాన్స్, ఐఐఎఫ్‌ఎల్ హోల్డింగ్స్, రిలయన్స్ క్యాపిటల్ 8-5% మధ్య పతనమయ్యాయి. అయితే ఎడిల్‌వీస్ క్యాపిటల్ దాదాపు 6% ఎగసింది. ఇక బ్యాంక్ లెసైన్స్ పొందిన ఐడీఎఫ్‌సీ సైతం 2.5% క్షీణించడం గమనార్హం.

మరిన్ని వార్తలు