మందకొడిగా ట్రేడింగ్..

7 May, 2016 01:08 IST|Sakshi
మందకొడిగా ట్రేడింగ్..

స్వల్పంగా తగ్గిన సూచీలు

 ముంబై: అంతర్జాతీయ ట్రెండ్‌ను అనుసరిస్తూ శుక్రవారం రోజంతా మందకొడిగా ట్రేడింగ్ కొనసాగింది. చైనా షాంఘై సూచి భారీగా 3 శాతం పతనంకావడంతో ట్రేడింగ్ ప్రారంభంలో భారత్ సూచీలు కూడా అరశాతంపైగా తగ్గినప్పటికీ, కనిష్టస్థాయిలో కొద్దిపాటి కొనుగోలు మద్దతు లభించడం, వారాంతపు షార్ట్ కవరింగ్ జరగడంతో ట్రేడింగ్ ముగింపులో కాస్త కోలుకున్నాయి. 25,058-25,260 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులకు లోనైన బీఎస్‌ఈ సెన్సెక్స్ చివరకు 34 పాయింట్ల నష్టంతో 25,228 పాయింట్ల వద్ద ముగిసింది.నిఫ్టీ 2 పాయింట్ల స్వల్పనష్టంతో 7,733 పాయింట్ల వద్ద క్లోజయ్యింది.

 ఇటీవల చైనా నుంచి వెలువడిన తయారీ రంగ గణాంకాలతో ప్రపంచ ఆర్థికాభివృద్ధి పట్ల సందేహాలు ఏర్పడి, ఈక్విటీ ఇన్వెస్టర్ల ఆసక్తి సన్నగిల్లిందని, దాంతో మార్కెట్ కార్యకలాపాలు మందకొడిగా వున్నాయని జియోజిత్ బీఎన్‌పీ పారిబాస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు.

గెయిల్ జోరు...
సెన్సెక్స్ షేర్లలో అన్నింటికంటే ఎక్కువగా ప్రభుత్వ రంగ సంస్థ గెయిల్ 4.99 శాతం ఎగిసింది. బీహెచ్‌ఈఎల్ 3.17 శాతం పెరగ్గా, ఆసియన్ పెయింట్స్, ఎస్‌బీఐ, టాటా మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్‌లు 1-2.3 శాతం మధ్య పెరిగాయి. డాక్టర్ రెడ్డీస్ లాబ్, విప్రో, ఆదాని పోర్ట్స్, ఓఎన్‌జీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎల్ అండ్ టీలు 1-2 శాతం మధ్య క్షీణించాయి.

 వరుసగా రెండోవారమూ డౌన్...
స్టాక్ సూచీలు వరుసగా రెండోవారమూ తగ్గాయి. సెన్సెక్స్ అంతక్రితంవారంతో పోలిస్తే 378 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ 116 పాయింట్లు క్షీణించింది.

>
మరిన్ని వార్తలు