స్వల్ప లాభాలతో వారం ముగింపు

15 Jun, 2018 16:07 IST|Sakshi

ముంబై : దేశీయ స్టాక్‌ మార్కెట్లు వారం ముగింపులో స్వల్ప లాభాలతో స్థిరపడ్డాయి. సెన్సెక్స్‌ 22 పాయింట్ల లాభంలో 35,622 వద్ద స్థిరపడగా.. నిఫ్టీ 10 పాయింట్ల లాభంలో 10,818 వద్ద క్లోజైంది. టెక్నాలజీ, ఫార్మా స్టాక్స్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ నేడు మార్కెట్లకు సహకరించాయి. మే నెలలో వాణిజ్య లోటు దాదాపు 15 బిలియన్‌ డాలర్లకు చేరడంతో అటు రూపాయి పతనంకాగా.. ఇటు స్టాక్స్‌లోనూ అమ్మకాలు ఊపందుకున్నాయి. దీంతో మిడ్‌ సెషన్‌కల్లా రూపాయి 68 దిగువకు చేరగా.. సెన్సెక్స్‌ 200 పాయింట్ల మేర క్షీణించింది. అయితే చివర్లో టీసీఎస్‌ బైబ్యాక్‌ ప్రకటించడంతో ఐటీ స్టాక్స్‌ అండతో మార్కెట్లు రికవరీ అయ్యాయి. ఈక్విటీ షేర్‌ క్యాపిటల్‌లో 1.99 శాతం అంటే రూ.16 వేల కోట్ల షేర్‌ బైబ్యాక్‌ను టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌(టీసీఎస్‌) ప్రకటించింది. దీంతో ఈ కంపెనీ షేర్లు సుమారు 3 శాతం మేర పైకి జంప్‌ చేశాయి. ఒక్కో ఈక్విటీ షేరుపై 2100 రూపాయల విలువైన షేర్‌ బైబ్యాక్‌ను చేపడుతోంది.

సెన్సెక్స్‌లో టాప్‌ గెయినర్లుగా డాక్టర్‌ రెడ్డీస్‌, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, సన్‌ ఫార్మా, రిలయన్స్‌, హిందూస్తాన్‌ యూనిలివర్‌ ఉండగా.. టాప్‌ లూజర్లుగా యస్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, ఓఎన్‌జీసీ, కోల్‌ ఇండియా, మహింద్రా అండ్‌ మహింద్రా, ఎన్‌టీపీసీలు ఉన్నాయి. నిఫ్టీలో టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, రిలయన్స్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ లీడింగ్‌ గెయినర్లుగా ఉన్నాయి. నిఫ్టీ ఎక్కువగా నష్టపోయింది రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌, పీఎన్‌బీ, ఐసీఐసీఐ బ్యాంకు, జేపీ అసోసియేట్స్‌. వరుసగా ఎనిమిదో రోజు ఫార్మా షేర్లు లాభాలు పండించడంతో ఎన్‌ఎస్‌ఈ ఫార్మా ఇంఎక్స్‌ 2.3 శాతం పెరిగింది. ఎన్‌ఎస్‌ఈలో టాప్‌ గెయినర్‌గా ఉన్న డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ 4.3 శాతం మేర పైకి జంప్‌ చేసింది. 

మరిన్ని వార్తలు