తీవ్ర హెచ్చుతగ్గుల్లో సూచీలు

25 Oct, 2018 02:11 IST|Sakshi

దిగివచ్చిన ముడి చమురు ధరలు

పుంజుకున్న రూపాయి

బేర్‌ ఆపరేటర్ల షార్ట్‌ కవరింగ్‌ కొనుగోళ్లు

187 పాయింట్లు పెరిగి 34,034కు సెన్సెక్స్‌

78 పాయింట్ల లాభంతో 10,225కు నిఫ్టీ

ముడి చమురు ధరలు తగ్గడం, రూపాయి బలపడటంతో బుధవారం స్టాక్‌ మార్కెట్‌ లాభాల్లో ముగిసింది. ఆద్యంతం తీవ్రమైన ఒడిదుకుల మధ్య సాగిన ట్రేడింగ్‌ చివర్లో షార్ట్‌ కవరింగ్‌ కొనుగోళ్లు జరిగాయి. దీంతో నాలుగు రోజుల వరుస నష్టాలకు బ్రేక్‌ పడింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ మళ్లీ 34,000, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీలు 10,200 పాయింట్ల పైకి ఎగబాకాయి. బ్యాంక్, ఆర్థిక, లోహ, మౌలిక రంగ షేర్లు లాభపడ్డాయి. ఐటీ, ఫార్మా షేర్ల నష్టాలు కొనసాగడంతో లాభాలు పరిమితమయ్యాయి. సెన్సెక్స్‌ 187 పాయింట్ల లాభంతో 34,034 పాయింట్ల వద్ద, నిఫ్టీ 78 పాయింట్లు పెరిగి 10,225 పాయింట్ల వద్ద ముగిశాయి. ఫార్మా మినహా అన్ని రంగాల సూచీలు లాభపడ్డాయి.  

షార్ట్‌ కవరింగ్‌ కొనుగోళ్లు... 
అక్టోబర్‌ నెల డెరివేటివ్స్‌ కాంట్రాక్టులు మరొక్క రోజులో ముగియనుండటంతో బేర్‌ ఆపరేటర్లు షార్ట్‌ కవరింగ్‌ కొనుగోళ్లకు దిగారని, దీంతో స్టాక్‌ మార్కెట్‌కు లాభాలు వచ్చాయని విశ్లేషకులు  పేర్కొన్నారు.డాలర్‌తో రూపాయి మారకం ఇంట్రాడేలో 42 పైసలు బలపడి 73.15కు (ఇది మూడు వారాల గరిష్ట స్థాయి) చేరడం సానుకూల ప్రభావాన్ని చూపించింది. మరోవైపు ముడి చమురు ధరలు దిగివచ్చాయి.ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నేపథ్యంలో చమురు సరఫరాలు తగిన స్థాయిలో ఉండేలా చూస్తామని సౌదీ అరేబియా హామీనివ్వటం దీనికో కారణం. ఒక బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ధర 4.3 శాతం పతనమై 76.24 డాలర్లకు పడిపోయింది.  బ్రెంట్‌ క్రూడ్‌ ధర ఒక్క రోజులో ఈ స్థాయిలో తగ్గడం గత మూడు నెలల్లో ఇదే మొదటిసారి.  

575 పాయింట్ల రేంజ్‌లో సెన్సెక్స్‌... 
ఆసియా మార్కెట్ల జోరుతో సెన్సెక్స్‌ లాభాల్లోనే ఆరంభమైంది. ఆరంభ కొనుగోళ్ల జోరుతో త్వరితంగానే 34,000 పాయింట్ల మార్క్‌ను దాటేసింది. ముడి చమురు ధరలు దిగిరావడం, రూపాయి బలపడటం వంటి సానుకూలతల నేపథ్యంలో 454 పాయింట్ల లాభంతో 34,301 పాయింట్ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఆ తర్వాత అమ్మకాలు జోరుగా పెరగడంతో నష్టాల్లోకి జారిపోయింది. ఇంట్రాడేలో 121 పాయింట్ల నష్టంతో 33,726 పాయింట్ల వద్ద కనిష్ట స్థాయిని తాకింది. మొత్తం మీద రోజంతా 575 పాయింట్ల రేజ్‌లో కదలాడింది. ఇక నిఫ్టీ ఒక దశలో 144 పాయింట్లు లాభపడగా, మరో దశలో 20 పాయింట్ల వరకూ నష్టపోయింది.  

ఆర్‌బీఐ నుంచి మరిన్ని నిధులు  
స్టాక్‌సూచీల్లోని కొన్ని కంపెనీల ఆర్థిక ఫలితాలు నిరాశపరచడంతో సెన్సెక్స్‌ ఆరంభ లాభాలను కోల్పోయిందని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ చెప్పారు. ముడి చమురు ధరలు భారీగా తగ్గడం, బేర్‌ ఆపరేటర్ల షార్ట్‌ కవరింగ్‌ కొనుగోళ్ల ద్వారా నష్టాలు రివకరీ అయ్యాయని వివరించారు. రూపాయి రికవరీ , బహిరంగ మార్కెట్‌ కార్యకలాపాల ద్వారా మరిన్ని నిధులను ఆర్‌బీఐ అందుబాటులోకి తేనుండడం సానుకూల ప్రభావం చూపించాయని పేర్కొన్నారు.  

రూ లక్ష కోట్లకు పైగా పెరిగిన ఇన్వెస్టర్ల సంపద 
సెన్సెక్స్‌ లాభపడటంతో ఇన్వెస్టర్ల సంపద రూ. లక్ష కోట్లకు పైగా పెరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో లిస్టైన కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.1.05 లక్షల కోట్లు పెరిగి  రూ.1.35,24,629 కోట్లకు చేరింది. కాగా ఎయిర్‌టెల్‌ ఆఫ్రికాలో వార్‌బర్గ్‌ పింకస్, టిమసెక్, సాఫ్ట్‌బ్యాంక్‌ తదితర ఆరు అంతర్జాతీయ దిగ్గజ సంస్తలు 125 కోట్ల డాలర్ల మేర పెట్టుబడులు పెట్టనుండటతో భారతీ ఎయిర్‌టెల్‌ షేర్‌ 10.7 శాతం ఎగసి రూ.317 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్‌ ఇదే.  చమురు ధరలు చల్లబడటంతో ప్రభుత్వ రంగ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు 6 శాతం వరకూ లాభపడ్డాయి.  

నవంబర్‌ 5న గోల్డ్‌ ఈటీఎఫ్‌ ట్రేడింగ్‌ వేళల పెంపు
ధన్‌తేరాస్‌ సందర్భంగా నవంబర్‌ 5న గోల్డ్‌ ఈటీఎఫ్‌లు, సార్వభౌమ బంగారం బాండ్లలో ట్రేడింగ్‌ వేళలను సాయంత్రం 7 గంటల వరకు పెంచుతున్నట్టు దేశీ స్టాక్‌ ఎక్సే్ఛంజీలు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ ప్రకటించాయి.3.30 గంటలకు మార్కెట్లు యథావిధిగా క్లోజవుతాయని... తిరిగి సాయంత్రం 4.30 గంటల నుంచి 7 గంటల వరకు గోల్డ్‌ ఈటీఎఫ్, సార్వభౌమ బంగారం బాండ్లలో ట్రేడింగ్‌ ఉంటుందని తెలిపాయి. దీపావళికి ముందు వచ్చే త్రయోదశి రోజును ధన్‌తేరాస్‌గా పరిగణిస్తారు. ఆ రోజున బంగారం కొనుగోలు చేస్తే కలిసొస్తుందని హిందువుల నమ్మకం. గోల్డ్‌ ఈటీఎఫ్‌లు ఒక గ్రాము బంగారానికి డిజిటల్‌ రూపంలో ఎక్సేంజ్‌ల్లో ట్రేడవుతాయి. సార్వభౌమ బంగారం బాండ్లు సైతం ఒక గ్రాము బంగారానికి సమాన విలువను కలిగి ఉంటాయి. ఇక దీపావళి లక్ష్మీ పూజను పురస్కరించుకుని నవంబర్‌ 7వ తేదీన సాయంత్రం 5.30 గంటల నుంచి 6.30 గంటల వరకు గంటపాటు ఇరు ఎక్సేంజ్‌ల్లో మూరత్‌ ట్రేడింగ్‌ ఉంటుంది. ఈ మేరకు ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈ వేర్వేగా ప్రకటనలు జారీ చేశాయి. 

మరిన్ని వార్తలు