2019.. బోణీ బాగుంది!

2 Jan, 2019 01:51 IST|Sakshi

మధ్యాహ్నం తర్వాత కొనుగోళ్లు

బ్యాంకింగ్‌ షేర్ల ముందంజ

సెన్సెక్స్‌కు 186 పాయింట్ల లాభం

నిఫ్టీ 47 పాయింట్ల పెరుగుదల

10900పైన ముగింపు  

దేశీ స్టాక్‌ మార్కెట్లు 2019వ సంవత్సరాన్ని లాభాలతో ఆరంభించాయి. ఉదయం స్వల్ప లాభాలతోనే ప్రారంభమైన ప్రధాన సూచీలు ఆ తర్వాత నష్టాల్లోకి వెళ్లాయి. కానీ, మధ్యాహ్నం తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్, పలు ఇతర రంగాల స్టాక్స్‌లో కొనుగోళ్లతో సూచీలు లాభాల బాట పట్టాయి. నిఫ్టీ 47 పాయింట్లకు పైగా లాభంతో 10,910 వద్ద ముగిసింది. అటు బీఎస్‌ఈ సెన్సెక్స్‌ సైతం 186 పాయింట్లతో 36,254 వద్ద క్లోజయింది. బ్యాంకింగ్‌ రంగం కోలుకునే దశలో ఉందని, ఎన్‌పీఏలు తగ్గుముఖం పడుతున్నాయంటూ ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ చేసిన వ్యాఖ్యలు సానుకూల ప్రభావాన్ని చూపించాయి. అంతర్జాతీయ మార్కెట్లకు సెలవు కావటంతో అక్కడి నుంచి ప్రతికూల సంకేతాలు లేకపోవడం, రూపాయి బలపడడం అనుకూలించాయి. బ్యాంకింగ్‌ రంగం స్థూల ఎన్‌పీఏల రేషియో మార్చి త్రైమాసికానికి 11.5 శాతంగా ఉంటే, సెప్టెంబర్‌ త్రైమాసికానికి 10.8 శాతానికి తగ్గినట్టు ఆర్‌బీఐ తన ఆర్థిక స్థిరత్వ నివేదికలో పేర్కొనటం తెలిసిందే.

‘‘సెషన్‌ ఆరంభంలో నష్టాలతో బుల్స్‌ మరోసారి తమ బలాన్ని చూపించారు. ఫైనాన్షియల్‌ స్టాక్స్‌ అండతో నిఫ్టీ కీలకమైన 10,900 పాయింట్ల పైన క్లోజయింది. డిసెంబర్‌ నెలకు సంబంధించి ఇప్పటి వరకు వెలువడిన ఆటోమొబైల్‌ కంపెనీల విక్రయ గణాంకాలు మిశ్రమంగా ఉన్నాయి. కార్పొరేట్‌ కంపెనీల ఫలితాలు వచ్చే వారం ఆరంభమవుతాయి. లిక్విడిటీ (నిధుల ప్రవాహం), సెంటిమెంట్‌ మార్కెట్‌ను స్వల్ప కాలంలో నడిపిస్తాయి’’ అని షేర్‌ఖాన్‌ అడ్వైజరీ హెడ్‌ హేమంగ్‌జాని తెలిపారు. వాణిజ్య యుద్ధ ఆందోళనలు, అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి మందగమనం, చమురు ధరలపై అనిశ్చితితో 2019లోనూ అస్థిరతలు కొనసాగుతాయని అంచనా వేశారు. ‘‘కొత్త కేలండర్‌ సంవత్సరంలో ఆరంభం గట్టిగానే ఉంది. నిఫ్టీ బుధవారం ఉదయం అప్‌సైడ్‌ గ్యాప్‌ అప్‌తో నిరోధక స్థాయి 10,924కు పైన ఆరంభమైనా ఆశ్చర్యపోనవసరం లేదు. గత కొన్ని రోజులుగా చెబుతున్నట్టే ర్యాలీ 11050–11200 స్థాయిల వరకు కొనసాగుతుంది. దిగువ వైపున 10,840–10800 బలమైన మద్దతు స్థాయిలు’’ అని ఏంజెల్‌ బ్రోకింగ్‌ చీఫ్‌ అనలిస్ట్‌ సమీత్‌ చావన్‌ తెలిపారు. 

వీటికి లాభాలు  
సెన్సెక్స్‌లో భారతీ ఎయిర్‌టెల్‌ షేరు అత్యధికంగా 2.76 శాతం పెరిగింది. హెచ్‌డీఎఫ్‌సీ 2 శాతం, యస్‌ బ్యాంకు ఒకటిన్నర శాతం మేర లాభపడ్డాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఎస్‌బీఐ, యాక్సిస్‌ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, ఇన్ఫోసిస్, హీరో మోటోకార్ప్, టాటా మోటార్స్, సన్‌ఫార్మా, బజాజ్‌ ఫైనాన్స్,  మారుతి, కోల్‌ ఇండియా లాభాల్లో ముగిశాయి. 

పీఎస్‌యూ బ్యాంకు స్టాక్స్‌ ర్యాలీ 
ప్రభుత్వరంగ బ్యాంకుల షేర్లు కొన్ని మంగళవారం భారీ లాభాలను ఆర్జించాయి.ప్రభుత్వరంగ బ్యాంకులకు నిధుల సాయానికి కేంద్రం నిర్ణయం తీసుకోవడం, ఆర్‌బీఐ గవర్నర్‌ చేసిన వ్యాఖ్యలే లాభాలకు కారణమని విశ్లేషకులు తెలిపారు.   

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా