నెల గరిష్టానికి సెన్సెక్స్‌

17 Nov, 2018 01:00 IST|Sakshi

సానుకూలంగా అంతర్జాతీయ సంకేతాలు

మరింత బలపడ్డ రూపాయి

రెండో రోజూ కొనసాగిన లాభాలు

197 పాయింట్లు పెరిగి 35,457కు సెన్సెక్స్‌

66 పాయింట్ల లాభంతో 10,682కి నిఫ్టీ

సానుకూల అంతర్జాతీయ సంకేతాలకు తోడు ఇటీవల క్షీణించిన షేర్లలో వేల్యూ బయింగ్‌ జరగడంతో  శుక్రవారం స్టాక్‌ మార్కెట్‌ లాభాల్లో ముగిసింది. వరుసగా రెండో రోజూ స్టాక్‌ సూచీలు లాభపడ్డాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం వంటి బ్లూ చిప్‌ కంపెనీలు జోరుగా పెరగడం కలసి వచ్చింది.  బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 197 పాయింట్లు పెరిగి 35,457 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 66 పాయింట్ల లాభంతో 10,682 పాయింట్ల వద్ద ముగిశాయి. స్టాక్‌ సూచీలకు ఇది నెల గరిష్ట స్థాయి.  ఇక వారం పరంగా చూస్తే సెన్సెక్స్‌ 299 పాయింట్లు, నిఫ్టీ 97 పాయింట్లు చొప్పున పెరిగాయి.  

ఇంట్రాడే లాభం 285 పాయింట్లు....
సెన్సెక్స్‌ లాభాల్లోనే ఆరంభమైంది. కొనుగోళ్ల జోరుతో మరింతగా లాభపడింది. గత నెలలో విక్రయాలు జరిపిన విదేశీ ఇన్వెస్టర్లు జోరుగా కొనుగోళ్లు జరపడం,  డాలర్‌తో రూపాయి మారకం బలపడటం, ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగియడం, యూరప్‌ మార్కెట్లు లాభాల్లో ఆరంభం కావడం సానుకూల ప్రభావం చూపించాయి. సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 285 పాయింట్ల లాభంతో 35,546 పాయింట్ల వద్ద గరిష్ట స్థాయిని తాకింది. చివర్లో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో ఈ లాభాలు కొంత ఆవిరయ్యాయి.  

టెలికం, బ్యాంక్‌  షేర్ల జోరు...
 వొడాఫోన్‌ ఐడియాకు చెందిన ఫైబర్‌ వ్యాపారాన్ని ఎయిర్‌టెల్‌కు చెందిన భారతీ ఇన్‌ఫ్రాటెల్‌ కొనుగోలు చేయనున్నదని వార్తలు వచ్చాయి. దీనికి తోడు రిలయన్స్‌ జియో చౌక టారిఫ్‌లకు స్వస్తి పలకనున్నదనే వార్తలూ హల్‌చల్‌ చేశాయి. దీంతో టెలికం షేర్లు జోరుగా పెరిగాయి. భారతీ ఎయిర్‌టెల్‌ 10 శాతం పెరిగి రూ.334 వద్ద ముగిసింది.

సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్‌ ఇదే. ఐడియా సెల్యులర్‌ 16 శాతం పెరిగి రూ.43 వద్ద ముగియగా, టాటా కమ్యూనికేషన్స్‌6 శాతం పెరిగింది. ఇక ఈ ఏడాదిలోనే ఎస్సార్‌ స్టీల్‌కు ఇచ్చిన రూ.11,000 కోట్ల బ్యాంక్‌ రుణాలు రికవరీ కానున్నాయన్న వార్తల కారణంగా బ్యాంక్‌ షేర్లు లాభపడ్డాయి. ఎస్‌బీఐ, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఓబీసీ, కెనరా బ్యాంక్,పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలు 3–5 శాతం రేంజ్‌లో పెరిగాయి.  

మళ్లీ మొదటి స్థానానికి రిలయన్స్‌  
మార్కెట్‌ క్యాప్‌ పరంగా అతి పెద్ద కంపెనీగా మళ్లీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అగ్రస్థానంలో నిలిచింది. ఇప్పటిదాకా మొదటి స్థానంలో ఉన్న టీసీఎస్‌ రెండో స్థానానికి పడిపోగా, రెండో స్థానంలో ఉన్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మొదటి స్థానానికి ఎగబాకింది. రిలయన్స్‌ షేర్‌ 2.7 శాతం లాభంతో రూ.1,128 వద్ద ముగిసింది. దీంతో ఈ కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రూ.7,14,669 కోట్లకు పెరిగింది. టీసీఎస్‌ షేర్‌ 1 శా తం లాభంతో రూ.1,129 వద్ద ముగిసింది. ఈ కం పెనీ మార్కెట్‌ క్యాప్‌ రూ.7,06,293 కోట్లుగా ఉంది.  

టాప్‌ 10లో కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌  
మార్కెట్‌ క్యాప్‌ పరంగా టాప్‌ 10 కంపెనీల జాబితాలో కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ చేరింది. కోటక్‌ బ్యాంక్‌ షేర్‌ 0.9 శాతం లాభపడి రూ.1,168 వద్ద ముగిసింది. దీంతో ఈ బ్యాంక్‌ మార్కెట్‌ క్యాప్‌ రూ.2,22,656 కోట్లకు ఎగసింది. మారుతీ సుజుకీని తోసిరాజని పదవ అతి పెద్ద కంపెనీగా అవతరించింది. మార్కెట్‌ క్యాప్‌ పరంగా దేశంలో నాలుగో అతి పెద్ద బ్యాంక్‌గా నిలిచింది. మొదటి మూడు స్థానాల్లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌లు ఉన్నాయి.  
æ    జెట్‌ ఎయిర్‌వేస్‌ లాభాలు రెండో రోజూ కొనసాగాయి. ఈ కంపెనీలో మెజార్టీ వాటాను టాటా గ్రూప్‌ కొనుగోలు చేయనున్నదన్న వార్తలతో గత రెండు రోజులుగా ఈ షేర్‌ లాభపడుతోంది. గురువారం 26 శాతం ఎగసిన జెట్‌ ఎయిర్‌వేస్‌ షేర్‌ శుక్రవారం మరో 8 శాతం పెరిగి రూ.347 వద్ద ముగిసింది. 

మరిన్ని వార్తలు