తగ్గిన లాభాలు

17 Jun, 2020 06:15 IST|Sakshi

భారీగా ఫెడ్‌ తాజా ప్యాకేజీ

లాభాల్లో ప్రపంచ మార్కెట్లు 

మన లాభాలకు సరిహద్దు ఉద్రిక్తతల గండి

ఆరంభ లాభాలు ఆవిరి

376 పాయింట్ల లాభంతో 33,605కు సెన్సెక్స్‌

100 పాయింట్లు ఎగసి 9,914కు నిఫ్టీ  

ప్రపంచ మార్కెట్ల  జోరుతో మన మార్కెట్‌ కూడా మంగళవారం లాభాల్లోనే ముగిసింది. చైనాతో సరిహద్దు  ఉద్రిక్తతలు మరింత ముదరడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ  ఉదయం లాభాలను పోగొట్టుకొని 17 పైసల నష్టంతో 76.20కు చేరడం.... ప్రతికూల ప్రభావం చూపించాయి. దీంతో  ఆరంభ లాభాలు ఆవిరయ్యాయి. రోజంతా 1,069 పాయింట్ల రేంజ్‌లో కదలాడిన సెన్సెక్స్‌ చివరకు 376 పాయింట్ల లాభంతో 33,605 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 232 పాయింట్లు ఎగసిన  ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 100 పాయింట్లు పెరిగి 9,914 పాయింట్ల  వద్దకు చేరింది.  

అమెరికా ‘మెయిన్‌స్ట్రీట్‌ ప్యాకేజీ’....
కరోనా వైరస్‌ కల్లోలంతో కుదేలవుతున్న ఆర్థిక వ్యవస్థను ఆదుకునే చర్యల్లో భాగంగా అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ భారీ ఉద్దీపన ప్యాకేజీని మెయిన్‌ స్ట్రీట్‌  లెండింగ్‌ ప్రోగ్రామ్‌ పేరుతో సోమవారం  ప్రకటించింది. అంతే కాకుండా 75,000 కోట్ల డాలర్ల (రూ.57 లక్షల కోట్ల)విలువైన కార్పొరేట్‌ బాండ్లను కొనుగోలు చేస్తామని అభయం ఇచ్చింది. దీంతో ప్రపంచ మార్కెట్లు లాభపడ్డాయి. ఇదే జోష్‌తో మన మార్కెట్‌ కూడా భారీ లాభాల్లో మొదలైంది.  

అరగంట ఒడిదుడుకులు...
సెన్సెక్స్‌ 625 పాయింట్లు, నిఫ్టీ 201 పాయింట్ల లాభాలతో మొదలయ్యాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 793 పాయింట్లకు, నిఫ్టీ 232 పాయింట్ల లాభాల స్థాయిలకు ఎగబాకాయి. అయితే తూర్పు లదాఖ్‌లోని గాల్వన్‌ లోయ సమీపంలో  మనదేశానికి, చైనాకి మధ్య ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయన్న వార్తలతో మధ్యాహ్నం తర్వాత ఆకస్మాత్తుగా సెన్సెక్స్, నిఫ్టీలు నష్టాల్లోకి జారిపోయాయి. సెన్సెక్స్‌ 276 పాయింట్లు, నిఫ్టీ 85 పాయింట్ల మేర నష్టపోయాయి. ఒక అరగంట పాటు తీవ్రమైన హెచ్చుతగ్గులకు గురైనసూచీలు ఆ తర్వాత మళ్లీ లాభాల బాట పట్టాయి.  ఆసియా మార్కెట్లు 5 శాతం,   యూరప్‌ మార్కెట్లు 4 శాతం లాభాల్లో ముగిశాయి.  

► హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 4 శాతం లాభంతో రూ.990 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్‌ ఇదే.  
► రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్‌ మంగళవారం కూడా జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.1,648ను తాకింది. చివరకు స్వల్ప లాభంతో రూ.1,617 వద్ద ముగిసింది.  
► వందకు పైగా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలను తాకాయి. అలెంబిక్‌ ఫార్మా, బేయర్‌ క్రాప్‌సైన్స్, రుచి సోయా, పీఐ ఇండస్ట్రీస్‌ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.  
► క్యూ4లో రూ.9,894 కోట్ల మేర నష్టాలు రావడంతో టాటా మోటార్స్‌ షేర్‌ 6% నష్టంతో రూ.95 వద్ద ముగిసింది.  
► రూపాయి బలహీనపడటంతో ఐటీ షేర్లు లాభపడ్డాయి.

రూపాయి 17 పైసలు పతనం  
ముంబై: భారత్‌–చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతల ప్రభావం రూపాయి విలువపై చూపింది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ మంగళవారం 17 పైసలు క్షీణించి 76.20 వద్ద ముగిసింది. ఇధి ఆరు వారాల కనిష్ట స్థాయి కావడం గమనార్హం.

మరిన్ని వార్తలు