స్వల్ప లాభాలతో సరి!

12 Dec, 2016 14:46 IST|Sakshi
స్వల్ప లాభాలతో సరి!
ఆర్‌బీఐ పాలసీ నేపథ్యంలో అప్రమత్తత
 44 పాయింట్ల లాభంతో 26,393 పాయింట్లకు సెన్సెక్స్
 14 పాయింట్ల లాభంతో 8,143కు నిఫ్టీ 
 
   ఆర్‌బీఐ రేట్ల కోత అంచనాలతో స్టాక్ మార్కెట్ మంగళవారం లాభాల్లో ముగిసింది. స్టాక్ సూచీలు వరుసగా రెండో రోజూ లాభపడ్డాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 44 పాయింట్ల లాభంతో 26,393 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 14 పాయింట్ల లాభంతో 8,143 పాయింట్ల వద్ద ముగిశాయి. ట్రేడింగ్ చివర్లో ప్రైవేట్ బ్యాంక్, ఆర్థిక రంగ, వాహన షేర్లలో అమ్మకాలు చోటుచేసుకున్నాయి. 
 
 పై స్థాయిల్లో లాభాల స్వీకరణ
 సోమవారం అమెరికా స్టాక్ సూచీలు రికార్డ్ స్థాయిల్లో ముగియడం, ఆసియా మార్కెట్లు సానుకూలంగా ఉండడం,   రూపాయి 31 పైసలు లాభపడడం మంగళవారం నాడు మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపించాయి. ఆర్‌బీఐ కీలక రేట్లను తగ్గిస్తుందనే అంచనాలతో కొందరు ఇన్వెస్టర్లు తమ పొజిషన్లు పెంచుకున్నారని, స్టాక్ మార్కెట్ లాభపడటానికి ఇదీ ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు. ఆర్‌బీఐపాలసీ నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచి, తూచి వ్యవహరించారు. సెన్సెక్స్ లాభాల్లోనే ప్రారంభమైంది.
 
  సోమవారం నాటి ముగింపుతో పోలిస్తే ఇంట్రాడేలో ఒక దశలో 153 పాయింట్లు లాభపడింది. పై స్థాయిల్లో లాభాల స్వీకరణ కారణంగా ఈ లాభాలను నిలుపులేకపోయింది. చివరకు 44 పాయింట్ల లాభంతో 26,393 పాయింట్ల వద్ద  ముగిసింది. ఈ రెండు రోజుల్లో సెన్సెక్స్ 118 పాయింట్లు లాభపడింది. పావు శాతం రేట్ల కోత ఉంటుందని మార్కెట్ ఇప్పటికే అంచనా వేస్తోందని, ఒకవేళ ఆర్‌బీఐ ఆశ్చర్యకరంగా 50 శాతం కోత విధిస్తే మార్కెట్ మరింత పెరుగుతుందని జియోజిత్ బీఎన్‌పీ పారిబా ఫైనాన్షియల్  సర్వీసెస్ హెడ్(రీసెర్చ్) వినోద్  నాయర్ చెప్పారు. 
 
  స్టాక్ మార్కెట్ డేటా...
 టర్నోవర్ (రూ. కోట్లలో)
 బీఎస్‌ఈ 2,202
 ఎన్‌ఎస్‌ఈ (ఈక్విటీ విభాగం) 13,676
 ఎన్‌ఎస్‌ఈ (డెరివేటివ్స్) 1,93,271
 ఎఫ్‌ఐఐ 162
 డీఐఐ 165
 

 

>
మరిన్ని వార్తలు