షార్ట్‌ కవరింగ్‌తో భారీ లాభాలు

25 Apr, 2019 01:24 IST|Sakshi

మూడు రోజుల నష్టాలకు బ్రేక్‌ 

రూపాయి పడ్డా, పెరిగిన స్టాక్‌ మార్కెట్‌ 

39,000 పాయింట్లపైకి సెన్సెక్స్‌

490 పాయింట్ల లాభంతో 39,055 వద్ద ముగింపు 

11,700 పాయింట్లపైకి నిఫ్టీ

150 పాయింట్లు పెరిగి 11,726కు నిఫ్టీ  

ఏప్రిల్‌ డెరివేటివ్స్‌ కాంట్రాక్టులు మరో రోజులో ముగియనుండటంతో భారీగా షార్ట్‌కవరింగ్‌ కొనుగోళ్లు చోటు చేసుకున్నాయి. అంతర్జాతీయ సంకేతాలు అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ, ట్రేడింగ్‌ చివరి గంటలో ఆర్థిక, ఇంధన, ఐటీ షేర్లలో షార్ట్‌ కవరింగ్‌  కొనుగోళ్ల జోరుగా సాగాయి. దీంతో మూడు రోజుల వరుస నష్టాలకు బ్రేక్‌ పడి  స్టాక్‌ మార్కెట్‌ బుధవారం భారీగా లాభపడింది. సెన్సెక్స్‌ 39,000 పాయింట్లు, నిఫ్టీ 11,700 పాయింట్ల పైకి ఎగబాకాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 21 పైసలు పడిపోయినా, ముడి చమురు ధరలు దిగిరావడంతో  స్టాక్‌ సూచీలు ముందుకే దూసుకుపోయాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 490 పాయింట్లు లాభపడి 39,055 పాయింట్లు, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 150 పాయింట్లు పెరిగి 11,726 పాయింట్ల వద్ద ముగిశాయి. ఒక్క వాహన రంగ సూచీ మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు లాభాల్లోనే ముగిశాయి. 

మధ్యాహ్నం వరకూ మందకొడిగానే..
సెన్సెక్స్‌ లాభాల్లోనే ఆరంభమైంది. మధ్యాహ్నం వరకూ ట్రేడింగ్‌ మందకొడిగా సాగింది. చివరి గంటలో ఆర్థిక, ఇంధన, ఐటీ రంగ షేర్లలో షార్ట్‌ కవరింగ్‌  కొనుగోళ్లు జోరుగా సాగాయి. ఒక దశలో సెన్సెక్స్‌  530 పాయింట్లు, నిఫ్టీ 165 పాయింట్ల వరకూ లాభపడ్డాయి. సెన్సెక్స్‌ మొత్తం లాభంలో  రిలయన్స్‌ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌.. ఈ మూడు షేర్ల వాటాయే దాదాపు సగంగా ఉంది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వాటా 85 పాయింట్లు, హెచ్‌డీఎఫ్‌సీ వాటా 73 పాయింట్లు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ వాటా 71 పాయింట్లుగా ఉన్నాయి. అంతర్జాతీయ సంకేతాలు అంతంతమాత్రంగానే ఉండటం, దేశీయంగా వృద్ధిపై ఆందోళన, ఎన్నికల కారణంగా అనిశ్చితి వంటి ప్రతికూల పరిస్థితులున్నప్పటికీ, స్టాక్‌ మార్కెట్‌ భారీగా లాభపడిందని శాంక్టమ్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీసర్‌ సునీల్‌శర్మ పేర్కొన్నారు.  ఇక మంగళవారం అమెరికా ప్రధాన స్టాక్‌ సూచీలు రికార్డ్‌స్థాయిల్లో ముగియడం సానుకూల ప్రభావం చూపించింది. అయితే బుధవారం ఆసియా, యూరప్‌ మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి.  

దిగివచ్చిన చమురు ధరలు... 
చమురు మార్కెట్లో తగినంతగా సరఫరాలు ఉన్నాయని అంతర్జాతీయ ఇంధన ఏజెన్సీ(ఐఈఏ) తాజా నివేదిక వెల్లడించడంతో చమురు ధరల పెరుగుదులకు బ్రేక్‌పడినట్లేనన్న అంచనాలు నెలకొన్నాయి. ఈ నివేదిక వెల్లడైన తర్వాత చమురు ధరలు పడిపోయాయి. మరోవైపు భారత్‌లో చాలా చోట్ల సాధారణ స్థాయిలోనే వర్షాలు కురుస్తాయని సౌత్‌ఏషియన్‌ క్లైమేట్‌ అవుట్‌లుక్‌ ఫోరమ్‌ పేర్కొనడం కూడా  మన మార్కెట్‌పై సానుకూల ప్రభావం చూపించాయి.  

అప్పటి వరకూ వేచి చూడండి...! 
నిఫ్టీ సూచీ 11,856 పాయింట్లకు చేరేవరకూ వేచి చూడాలని, అప్పటివరకూ ఎలాంటి తాజా పొజిషన్లు తీసుకోవద్దని  నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని  లార్జ్, మిడ్‌ క్యాప్‌ షేర్లను కొనచ్చని సూచన.
►స్టాక్‌ మార్కెట్‌ భారీ లాభాల కారణంగా ఒక్క బుధవారం రోజే ఇన్వెస్టర్ల సంపద రూ.1.42 లక్షల కోట్లు పెరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్‌క్యాప్‌ రూ.1.42 లక్షల కోట్లు పెరిగి రూ.1,53,17,138 కోట్లకు చేరింది.  
► హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ 3.4 శాతం లాభంతో రూ.1,140 వద్ద ముగిసింది.సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్‌ ఇదే.  
►  సిమెంట్‌ కంపెనీ ఏసీసీ ఫలితాలు బలహీనంగా ఉన్నప్పటికీ, మరో సిమెంట్‌ దిగ్గజం ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌ ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. 
►    వాహన దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా షేర్‌ వరుసగా నాలుగో రోజూ నష్టపోయి 3 వారాల కనిష్టానికి, రూ.7,024 పతనమైంది. నేడు (గురువారం) ఈ కంపెనీ ఆర్థిక ఫలితాలు వెలువడనున్నాయి. 
►  ఇండియాబుల్స్‌ రియల్‌ ఎస్టేట్‌ షేర్‌ 10 శాతం లాభంతో రూ.116 వద్ద చేరింది. లండన్‌ ప్రాపర్టీని రూ.1,800 కోట్లకు ప్రమోటర్లకు విక్రయించనున్నదన్న వార్తల కారణంగా ఈ షేర్‌ ఈ స్థాయిలో లాభపడింది.  
► ఈ క్యూ4లో మంచి ఫలితాలు ఉండొచ్చన్న అంచనాలతో ఓఎన్‌జీసీ షేర్‌ ఇంట్రాడేలో 4 శాతం వరకూ ఎగసి, ఆరు నెలల గరిష్ట స్థాయి, రూ.170ను తాకింది. చివరకు 2.8 శాతం లాభంతో రూ.168 వద్ద ముగిసింది.   

>
మరిన్ని వార్తలు