మార్కెట్లో ఆర్‌బీఐ ర్యాలీ

1 Nov, 2018 01:03 IST|Sakshi

ఆరంభంలో నష్టాలు 

ఆర్‌బీఐకి కేంద్రం అభయంతో ర్యాలీ

కలిసొచ్చిన అంతర్జాతీయ సంకేతాలు; రూపాయి

551 పాయింట్ల లాభంతో 34,442కు సెన్సెక్స్‌

188 పాయింట్లు పెరిగి 10,387కు నిఫ్టీ  

ఆర్‌బీఐ స్వయం ప్రతిపత్తిని గౌరవిస్తామన్న ప్రభుత్వం ప్రకటనను మార్కెట్‌ గౌరవించింది. దీంతో బుధవారం స్టాక్‌ మార్కెట్‌ భారీ లాభాల్లో ముగిసింది. ప్రపంచ మార్కెట్లు లాభాల్లో ఉండడం, డాలర్‌తో రూపాయి మారకం నష్టాల్లోంచి లాభాల్లోకి మరలడం, సానుకూల ప్రభావం చూపించాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ మళ్లీ 34,000 పాయింట్లు, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా 10,300 పాయింట్ల పైకి ఎగబాకాయి. ఇటీవలి కాలంలో లిక్విడిటీ సమస్యలతో కుదేలైన నాన్‌ బ్యాంకింగ్‌ ముఖ్యంగా హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేర్లు రికవరీ కావడం కూడా సానుకూల ప్రభావం చూపించింది. సెన్సెక్స్‌ 551 పాయింట్ల లాభంతో 34,442 పాయింట్ల వద్ద, నిఫ్టీ 188 పాయింట్లు పెరిగి 10,387 పాయింట్ల వద్ద ముగిశాయి. ఐటీ, వాహన, ఫార్మా, బ్యాంక్, ఆర్థిక, వినియోగ, మౌలిక రంగ షేర్లు లాభపడ్డాయి. ఒక్క లోహ సూచీ మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు లాభాల్లోనే ముగిశాయి.  

876 పాయింట్ల రేంజ్‌లో సెన్సెక్స్‌ 
ఆసియా మార్కెట్ల లాభాల దన్నుతో సెన్సెక్స్‌ లాభాల్లోనే ఆరంభమైంది.  మొండి బకాయిలు, లిక్విడిటీ తదితర విషయాలపై గత కొన్ని రోజులుగా ఆర్‌బీఐ, కేంద్రం మధ్య విభేదాలు రాజుకున్నాయి. ఈ నేప థ్యంలో తన గవర్నర్‌ గిరీకి ఆర్‌బీఐ గవర్నర్‌ ఊర్జిత్‌ పటేల్‌ రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారన్న వార్తలు వచ్చాయి. దీంతో లోహ, పీఎస్‌యూ బ్యాంక్, ఎఫ్‌ఎమ్‌సీజీ, కొన్ని వాహన షేర్లలో లాభాల స్వీకరణ జరిగింది. పలితంగా సెన్సెక్స్, నిఫ్టీలు నష్టాల్లోకి జారిపోయాయి. సెన్సెక్స్‌ 304 పాయింట్ల నష్టంతో 33,587 పాయింట్ల వద్ద ఇంట్రాడే కనిష్ట స్థాయిని తాకింది. అయితే ఆర్‌బీఐ స్వయం ప్రతిపత్తిని గౌరవిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన చేసింది. ఈ ప్రకటన ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు జోష్‌నిచ్చింది. మరోవైపు డాలర్‌తో రూపాయి మారకం ఆరంభంలో 74 మార్క్‌ను దాటినప్పటికీ,(ఇంట్రాడేలో 74.14కు పడిపోయింది) ఆ తర్వాత రికవరీ కావడం కూడా కలసివచ్చింది. ఫలితంగా సెన్సెక్స్‌  572 పాయింట్ల లాభంతో 34,463 పాయింట్ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. మొత్తం మీద రోజంతా 876 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. ఇక నిఫ్టీ ఒక దశలో 93 పాయింట్లు నష్టపోగా, మరో దశలో 198 పాయింట్లు లాభపడింది.  

రూ. 2 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద 
సెన్సెక్స్‌ భారీగా లాభపడటంతో ఇన్వెస్టర్ల సంపద దాదాపు రూ. 2 లక్షల కోట్లు పెరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్‌ క్యాప్‌ రూ.1,92,961 కోట్లు పెరిగి రూ.1,38,45,109 కోట్లకు ఎగసింది.  

>
మరిన్ని వార్తలు