బ్యాంక్‌ షేర్లు బేర్‌

17 Jan, 2018 01:16 IST|Sakshi

72 పాయింట్ల నష్టంతో 34,771కు సెన్సెక్స్‌ 

41 పాయింట్ల పతనంతో 10,700కు నిఫ్టీ   

 

వరుసగా మూడు ట్రేడింగ్‌ సెషన్లలో రికార్డ్‌ స్థాయిలో ముగిసిన స్టాక్‌ సూచీలు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. వాణిజ్య లోటు మూడేళ్ల గరిష్ట స్థాయికి చేరడం, రూపాయి మూడు వారాల కనిష్టానికి బలహీనపడడం, ప్రభుత్వ రంగ బ్యాంక్‌లపై ప్రతికూల ప్రభావం చూపేలా ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ వ్యాఖ్యలు చేయడం మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఇక వీటికి తోడు బాండ్‌ ఈల్డ్స్‌ పెరగడంతో బ్యాంక్‌ షేర్లు కుదేలయ్యాయి.

 ముడిచమురు ధరలు ఎగియటంతో పాటు గరిష్ట స్థాయిల్లో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో ప్రధానంగా మిడ్‌క్యాప్‌ షేర్లు నష్టపోయాయి. ఇండెక్స్‌లు చూస్తే బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 72 పాయింట్లు నష్టపోయి 34,771 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ  41 పాయింట్లు క్షీణించి 10,700 పాయింట్ల వద్ద ముగిశాయి. అయితే ఈ ఏడాది భారత ఐటీ సర్వీసులు టర్న్‌ అరౌండ్‌ కాగలవని మోర్గాన్‌ స్టాన్లీ తన తాజా నివేదికలో పేర్కొనడంతో ఐటీ షేర్లు–విప్రో, ఇన్ఫోసిస్, టీసీఎస్‌ షేర్లు 5 శాతం వరకూ పెరిగాయి. 

ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల వడ్డీరేట్ల నిర్వహణ అధ్వానంగా ఉందని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ విరాళ్‌ అచార్య వ్యాఖ్యానించారు. బ్యాంక్‌లకు ఈ క్యూ3లో రూ.15,000–25,000 కోట్ల రేంజ్‌లో ట్రెజరీ నష్టాలు రావచ్చన్న అంచనాలు కూడా జత కావడంతో ప్రభుత్వ రంగ బ్యాంక్‌ షేర్లు 5 శాతం వరకూ నష్టపోయాయి.

>
మరిన్ని వార్తలు