11,000 పైకి నిఫ్టీ..

21 Jul, 2020 04:45 IST|Sakshi

పెరుగుతున్న కరోనా కేసులు  

పట్టించుకోని మార్కెట్‌ 

అంచనాలను మించుతున్నక్యూ1 ఫలితాలు

బలపడిన రూపాయి... నాలుగో రోజూ ఎగసిన సూచీలు

ముంబై : మార్కెట్‌ జోరు కొనసాగుతోంది. కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతుండటంతో ప్రపంచ మార్కెట్లు అంతంతమాత్రంగానే  ఉన్నా, బ్యాంక్, ఐటీ రంగ షేర్ల దన్నుతో మన స్టాక్‌ సూచీలు దూసుకుపోయాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కీలకమైన 11,000 పాయింట్లపైకి ఎగబాకింది. 121 పాయింట్ల లాభంతో 11,022 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ 399 పాయింట్లు పెరిగి 37,419 పాయింట్ల వద్దకు చేరింది. ఈ రెండు సూచీలు వరుసగా నాలుగో రోజూ లాభపడ్డాయి. ఈ 4 రోజుల్లో సెన్సెక్స్‌ 1,386 పాయింట్లు, నిఫ్టీ 415 పాయింట్లు పెరిగాయి.  

రోజంతా లాభాలు...
ఆసియా మార్కెట్లు బలహీనంగా ఉన్నా, మన మార్కెట్‌ లాభాల్లోనే ఆరంభమైంది. రోజంతా లాభాలు కొనసాగాయి. కంపెనీలు ముఖ్యంగా  ఐటీ, బ్యాంక్‌ల క్యూ1 ఫలితాలు అంచనాలను మించుతుండటం, డాలర్‌తో రూపాయి మారకం విలువ 11 పైసలు పుంజుకొని 74.91కు చేరడం సానుకూల ప్రభావం చూపించాయి. మార్కెట్లో ఇదే జోరు కొనసాగుతుందని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఎనలిస్ట్‌ వినోద్‌ నాయర్‌ అంచనా వేస్తున్నారు. షేర్‌ వారీ కదలికలే అధికంగా ఉంటాయని, ఫలితాల సందర్భంగా కంపెనీలు వెల్లడించే  భవిష్యత్తు అంచనాలపై ఇన్వెస్టర్లు దృష్టి సారించాలని సూచించారు. ఆసియా, యూరప్‌  మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి.  
 బజాజ్‌ ఫైనాన్స్‌ 4% లాభంతో రూ.3,441 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా పెరిగిన షేర్‌ ఇదే.  
దాదాపు వందకు పైగా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలను తాకాయి. బ్రిటానియా ఇండస్ట్రీస్, ఇన్ఫో ఎడ్జ్, ఆర్తి డ్రగ్స్, గ్రాన్యూల్స్, క్యాడిలా హెల్త్‌కేర్‌  తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.  
ఈ క్యూ1లో నికర లాభం 20  శాతం పెరగడంతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్‌ 3 శాతం లాభంతో రూ.1,133 వద్ద ముగిసింది.  
1: 1 నిష్పత్తిలో రైట్స్‌ ఇష్యూని ప్రకటించడంతో మహీంద్రా ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ షేర్‌ 10% లాభంతో రూ.230 వద్ద ముగిసింది.

క్యామ్స్‌ ఐపీఓకు సెబీ ఆమోదం  
న్యూఢిల్లీ : కంప్యూటర్‌ ఏజ్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌(క్యామ్స్‌)  ఐపీఓకు నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం తెలిపింది. వార్‌బర్గ్‌ పింకస్‌ ఎల్‌ఎల్‌సీ,ఎన్‌ఎస్‌ఈలు ఈ కంపెనీలో ప్రధాన వాటాదారులుగా ఉన్నాయి. ఈ ఐపీఓ సైజు రూ.1,500–1,600 కోట్ల రేంజ్‌లో ఉంటుందని అంచనా.  ఐపీఓలో భాగంగా కంపెనీ వాటాదారులు 1.22 కోట్ల ఈక్విటీ షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) మార్గంలో విక్రయిస్తారు. 

మరిన్ని వార్తలు