నాలుగో రోజూ నష్టాలే

13 Feb, 2019 05:14 IST|Sakshi

పటిష్టంగానే ప్రపంచ మార్కెట్లు 

మన మార్కెట్లో చివర్లో అమ్మకాలు 

241 పాయింట్లు పతనమై 36,154కు సెన్సెక్స్‌

57 పాయింట్లు క్షీణించి 10,831కు నిఫ్టీ

ట్రేడింగ్‌ చివర్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో మంగళవారం స్టాక్‌ మార్కెట్‌ నష్టాల్లో ముగిసింది. జనవరి నెల ద్రవ్యోల్బణ, డిసెంబర్‌ నెల పారిశ్రామికోత్పత్తి గణాంకాలు వెల్లడి కానుండటం(మార్కెట్‌ ముగిసిన తర్వాత ఈ గణాంకాలు వచ్చాయి)తో మార్కెట్లో అప్రమత్త వాతావారణం నెలకొన్నది.  అంతర్జాతీయ సంకేతాలు పటిష్టంగానే ఉన్నప్పటికీ, మన స్టాక్‌ సూచీలు క్షీణించాయి.  బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 241 పాయింట్లు పతనమై 36,154 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 57 పాయింట్లు క్షీణించి 10,831 పాయింట్ల వద్ద ముగిశాయి. 

వరుసగా నాలుగో రోజూ స్టాక్‌సూచీలు నష్టపోయాయి. ఈ నాలుగు రోజుల్లో సెన్సెక్స్‌ మొత్తం   821 పాయింట్లు నష్టపోయింది. రియల్టీ, ఐటీ, ఎఫ్‌ఎమ్‌సీజీ, బ్యాంక్, వాహన, వినియోగ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. లోహ, ఫార్మా, మౌలిక రంగ షేర్లు లాభపడ్డాయి.  సెన్సెక్స్‌ ఒక దశలో 70 పాయింట్లు పెరగ్గా, మరో దశలో 281 పాయింట్లు నష్టపోయింది. ఇంట్రాడే గరిష్టం నుంచి చూస్తే, సెన్సెక్స్‌ 300కు పైగా పాయింట్లు నష్టపోయింది. మొత్తం మీద రోజంతా   351 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. ఇక నిఫ్టీ ఒక దశలో 22 పాయింట్లు పెరగ్గా, మరో దశలో 65 పాయింట్లు నష్టపోయింది.

‘యాక్సిస్‌’ ఓఎఫ్‌ఎస్‌కు రూ.8,000 కోట్ల బిడ్‌లు  
యాక్సిస్‌ బ్యాంక్‌ ఆఫర్‌ ఫర్‌ సేల్‌(ఓఎఫ్‌ఎస్‌)కు సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన లభించింది. వీరికి కేటాయించిన వాటా 2.56 రెట్లు ఓవర్‌ సబ్‌ స్క్రైబయింది. ఇందులో భాగంగా సంస్థాగత ఇన్వెస్టర్లకు 4.56 కోట్ల ఈక్విటీ షేర్లు రిజర్వ్‌ చేయగా, 11.69 కోట్ల షేర్లకు బిడ్‌లు వచ్చాయి. విలువ  రూ.8,000 కోట్లుగా ఉంది.

నియోజెన్‌ కెమికల్స్‌ ఐపీఓకు ఓకే
స్పెషాల్టీ కెమికల్స్‌ తయారు చేసే కంపెనీ నియోజెన్‌ కెమికల్స్‌ ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌)కు మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ ఆమోదం తెలిపింది. ఈ ఐపీఓలో భాగంగా రూ.70 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీ చేస్తారు. అంతే కాకుండా ఆఫర్‌ ఫర్‌ సేల్‌(ఓఎఫ్‌ఎస్‌)విధానంలో కంపెనీ ప్రమోటర్లు 29 లక్షల  షేర్లను విక్రయిస్తారు. ఈ ఐపీఓ నిధులను రుణ భారం తగ్గించుకోవడానికి వినియోగిస్తారు.
 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు