సెన్సెక్స్‌ 244 పాయింట్లు జంప్‌

19 Jul, 2017 16:19 IST|Sakshi
ముంబై: ఐటీసీ దెబ్బకు మంగళవారం భారీగా కుదేలైన స్టాక్‌ మార్కెట్లు, బుధవారం సెషన్‌లో కోలుకున్నాయి. కొనుగోళ్ల మద్దతుతో మార్కెట్లు పాజిటివ్‌గా ముగిశాయి. సెన్సెక్స్‌ 244 పాయింట్లు జంప్‌ చేసి 31,955.35 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 74.75 పాయింట్ల లాభంలో 9901.90 వద్ద ముగిసింది. నేటి సెషన్‌లో కోల్‌ ఇండియా, భారతీ ఎయిర్‌టెల్‌, అరబిందో ఫార్మా, ఐడియా కంపెనీల షేర్లు ఎక్కువగా లాభపడగా.. ఇన్ఫోసిస్‌, హీరో మోటార్‌కార్ప్‌, ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఏసీసీ టాప్‌ లూజర్లుగా నష్టాలు గడించాయి.
 
అమెరికా హెల్త్‌ రెగ్యులేటరీ నుంచి కొన్ని డ్రగ్స్‌కు అనుమతి లభించడంతో లుపిన్‌, సన్‌ఫార్మా, అరబిందో ఫార్మా, కాడిలా హెల్త్‌కేర్‌లు మంచి లాభాలను పండించాయి. అరబిందో 8 నెలల గరిష్టంలో 8.2 శాతం లాభపడగా.. కాడిలా హెల్త్‌కేర్‌ లిమిటెడ్‌ 3.1 శాతం లాభాలు పండించింది. ఇక లుపిన్‌, సన్‌ఫార్మాలు ఇంట్రాడేలో 1.8 శాతం మేర లాభపడ్డాయి. బయోకాన్‌ కంపెనీ కూడా 6.25 శాతం ఎగిసి, జీవిత కాల గరిష్టాలను నమోదుచేసింది. టెలికాం కంపెనీల యూనివర్సల్‌ సర్వీసెస్‌ ఆబ్లిగేషన్‌ అండ్‌ లెవీని(యూఎస్‌వోఎఫ్‌)ను భారీగా తగ్గించడం లేదా రద్దు చేయనున్న నేపథ్యంలో టెలికాం షేర్లు లాభాలు పండించాయి.
 
అలాగే టెలికాం ఆపరేటర్లు ప్రతిపాదించిన లైసెన్స్‌ ఫీజును 8 శాతం నుంచి 6 శాతానికి తగ్గించనుందని సమాచారం. దీంతో ఐడియా సెల్యులార్‌ ఏకంగా10 శాతం లాభపడగా, మార్కెట్‌ లీడర్‌ భారతి ఎయిర్‌ టెల్‌ 3 శాతం, ఆర్‌కాం 4 శాతం లాభాల్లో నడిచాయి. మంగళవారం ట్రేడింగ్‌లో భారీ మొత్తంలో పతనాన్ని నమోదుచేసిన సిగరెట్‌ ఉత్పత్తుల అగ్రగామి సంస్థ ఐటీసీ షేర్లు, నేటి మార్కెట్‌లో 2.6 శాతం లాభపడ్డాయి. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ ఒక పైసా లాభంలో 64.33 వద్ద ఉంది. ఎంసీఎక్స్‌ మార్కెట్‌లో బంగారం ధరలు 59 రూపాయల నష్టంతో 28,194 రూపాయలకు చేరాయి. 
 
మరిన్ని వార్తలు