సంక్రాంతి వేళ : సరికొత్త రికార్డులు

15 Jan, 2018 15:52 IST|Sakshi

ముంబై : సంక్రాంతి పర్వదినం స్టాక్‌ మార్కెట్లు సరికొత్త రికార్డులను సృష్టించాయి. ప్రారంభంలోనే భారీ లాభాలతో ఎంట్రీ ఇచ్చిన స్టాక్‌ మార్కెట్లు, ట్రేడింగ్‌ అంతా కళకళలాడించాయి. చివరికి కూడా సెన్సెక్స్‌, నిఫ్టీ రికార్డుల మోత మోగించాయి. నిఫ్టీ తొలిసారి 10,700కి పైన 60 పాయింట్ల లాభంలో 10,741 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ కూడా 251 పాయింట్ల లాభంలో 35వేల మైలురాయికి చేరువలో 34,843 వద్ద క్లోజైంది. ముఖ్యంగా ఫైనాన్సియల్‌ సర్వీసుల కౌంటర్‌ జోరుగా ట్రేడవడంతో, మార్కెట్లు లాభాల పరుగు తీశాయి. రెండు సూచీల్లోనూ హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకు టాప్‌ గెయినర్లుగా లాభాల పంట పండించాయి. 

వీటితో పాటు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, కొటక్‌ బ్యాకు, పవర్‌ గ్రిడ్‌, టాటా స్టీల్‌, యాక్సిస్‌ బ్యాంకు కూడా లాభాల్లో నడిచాయి. అయితే హీరో మోటోకార్ప్‌, గెయిల్‌, ఐషర్‌ మోటార్స్‌, టాటా మోటార్స్‌, డీవీఆర్‌ ఎక్కువగా నష్టపోయాయి. మరో రెండు వారాల్లో  కేంద్ర ప్రభుత్వం సార్వత్రిక బడ్జెట్‌ను ప్రకటించనున్న నేపథ్యంలో దేశీయ స్టాక్‌ మార్కెట్లు ర్యాలీ కొనసాగిస్తున్నాయని విశ్లేషకులు చెప్పారు. ఇన్వెస్టర్లు కూడా అన్ని రంగాల్లోనూ కొనుగోళ్లకు తెరతీయడంతో మార్కెట్లు సరికొత్త రికార్డు గరిష్టాలను చేరుకుంటున్నట్టు పేర్కొన్నారు. కాగ, నిఫ్టీ ఇంట్రాడేలో 99 పాయింట్లు జంప్‌ చేసి 10,700కి పైన 10,780 మార్కును తాకింది. సెన్సెక్స్‌ కూడా 34,954 మార్కును చేరుకుంది.  

మరిన్ని వార్తలు