లాభాలన్నీ గల్లంతు: 9800 కిందకి నిఫ్టీ

29 Sep, 2017 16:03 IST|Sakshi

ముంబై : పండుగ జోష్‌తో ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి కళకళలాడిన మార్కెట్లు, చివరికి ఆ కళ తప్పాయి. చివరి పావు గంటల్లో జరిగిన ట్రేడ్‌లో లాభాలన్నీ కోల్పోయాయి. అక్టోబర్‌ సిరీస్‌ ప్రారంభం రోజున నిఫ్టీ, సెన్సెక్స్‌ రెండూ ఎక్కడివక్కడే అన్నట్లుగా ముగిశాయి. డబుల్‌ సెంచరీని అధిగమించి ట్రేడైన సెన్సెక్స్‌, చివరికి ఫ్లాట్‌గా 1.24 పాయింట్ల లాభంలో 31,283.72 వద్ద క్లోజైంది. నిఫ్టీ 9,800 కిందకి 19.65 పాయింట్ల లాభంలో 9788.60 వద్ద స్థిరపడింది. తొలి నుంచీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో చివరి వరకూ మార్కెట్లు మంచి లాభాల్లో కొనసాగాయి.

కానీ చివరి పావుగంటలో అమ్మకాలు ఊపందుకుని లాభాలను కోల్పోయాయి. నేటి ట్రేడింగ్‌లో బజాజ్‌ ఆటో, అదానీ పోర్ట్స్‌, గెయిల్‌, ఐషర్‌ మోటార్స్‌ రెండు సూచీల్లోనూ లాభాలు పండించగా... హెచ్‌యూఎల్‌, విప్రోలు టాప్‌ లూజర్లుగా నిలిచాయి. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 21 పైసలు బలపడి 65.30గా ఉంది. ఎంసీఎక్స్‌ మార్కెట్‌లో బంగారం ధరలు 29,600 రూపాయలుగా ఉన్నాయి. 

మరిన్ని వార్తలు