భారీగా పతనమైన సెన్సెక్స్‌

17 Sep, 2018 10:24 IST|Sakshi
స్టాక్‌ మార్కెట్లు (ప్రతీకాత్మక చిత్రం)

ముంబై : దేశీయ స్టాక్‌ మార్కెట్లు ట్రేడింగ్ ప్రారంభంలోనే భారీగా నష్టపోయాయి. ఈ నష్టాలు ట్రేడింగ్‌ కొనసాగే కొద్ది మరింత పెరుగుతూ పోతున్నాయి. తొలి అర్థగంట ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 350 పాయింట్ల మేర పతనమైంది. నిఫ్టీ సైతం 11,450 మార్కు కిందకి దిగొచ్చింది. ఓ వైపు ఆసియన్‌ మార్కెట్ల నుంచి వస్తున్న బలహీనమైన సంకేతాలు, మరోవైపు రూపాయి అంతకంతకు క్షీణించడం మార్కెట్లను దెబ్బకొడుతోంది. రూపాయి ఒత్తిడితో మార్కెట్‌లో అమ్మకాల తాకిడి మరింత పెరుగుతూ వెళ్తోంది. ప్రస్తుతం సెన్సెక్స్‌ 343 పాయింట్ల నష్టంలో 37,747 వద్ద, నిఫ్టీ 98 పాయింట్ల నష్టంలో 11,417 వద్ద ట్రేడవుతోంది. రూపాయి బలపడేందుకు ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన సమావేశంలో కొన్ని చర్యలు ప్రకటించినప్పటికీ, అవి ఇన్వెస్టర్లను సంతృప్తి పరచలేదు. 

మసాలా బాండ్లపై పన్ను తొలగించడం, ఫారిన్‌ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లకు మినహాయింపులు ఇవ్వడం, అవసరం లేని దిగుమతులపై ఆంక్షలు వంటి చర్యలు ప్రకటించినప్పటికీ, రూపీ విలువను బలపరచడానికి అవేమీ సహకరించడం లేదు. డాలర్‌ మారకంలో రూపాయి విలువ నేడు భారీగా క్షీణిస్తూ.. 72.67 వద్ద నమోదవుతోంది. రూపాయి క్షీణత కొనసాగుతుండటంతో, ఐటీ స్టాక్స్‌ లాభాల్లో ట్రేడవుతున్నాయి. మైండ్‌ట్రి, విప్రో, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌ వంటి కంపెనీ షేర్లు 1 శాతం నుంచి 2 శాతం లాభాలు పండిస్తున్నాయి. విప్రో, సన్‌ఫార్మా, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ టాప్‌ గెయినర్లుగా ఉండగా.. యాక్సిస్‌ బ్యాంక్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, టైటాన్‌, ఇండియాబుల్స్‌ ఎక్కువగా నష్టాలు పాలవుతున్నాయి. 
 

మరిన్ని వార్తలు