200 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్‌ ప్రారంభం

17 Jun, 2020 09:23 IST|Sakshi

53 పాయింట్ల నష్టంతో మొదలైన నిఫ్టీ

మిశ్రమంగా అంతర్జాతీయ సంకేతాలు

భారత్‌-చైనాల మధ్య నెలకొన్న సరిహద్దు వివాదం నేపథ్యంలో బుధవారం భారత స్టాక్‌ మార్కెట్‌ నష్టంతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 205 పాయింట్లను కోల్పోయి 33399 వద్ద, నిఫ్టీ 53 పాయింట్లు నష్టపోయి 9860 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. బ్యాంకులు, ఫైనాన్స్‌, అటో, ఎఫ్‌ఎంసీజీ, రియాల్టీ రంగ షేర్లలో అమ్మకాలు నెలకొగా, ఐటీ మీడియా, ఫార్మా షేర్లకు స్వల్పంగా కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 1.25శాతం నష్టంతో 20,045.65    వద్ద ట్రేడ్‌ అవుతోంది. 


లద్ధాఖ్‌లోని గాల్వన్ ప్రాంతంలో భారత్‌-చైనాల బలగాల మధ్య  జూన్ 15, 16వ తేదీల్లో జరిగిన హింసాత్మక ఘర్షణల్లో మొత్తం 20 మంది భారత సైనికులు మరణించారని ఇండియన్ ఆర్మీ మంగళవారం రాత్రి అధికారికంగా ప్రకటించింది. ఈ హింసాత్మక ఘర్షణలో 43 మంది చైనా సైనికులూ మరణించినట్లు భారత సైనిక వర్గాలు వెల్లడించాయి. ఇరు దేశాల మధ్య ఏర్పడిన సరిహద్దు ఉద్రిక్తతలతో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ అమ్మకాల తెరలేపారు. ఇంద్రప్రస్థగ్యాస్‌, జేకే సిమెంట్స్‌, పిడిలైట్‌ ఇండస్ట్రీట్‌తో సుమారు 46కంపెనీలు నేడు తమ ఆర్థిక సంవత్సరపు మార్చి త్రైమాసిక ఫలితాలను విడుదల చేయనున్నాయి. 

మిశ్రమంగా అంతర్జాతీయ సంకేతాలు:
ప్రపంచ ఈక్విటీ మార్కెట్లో మిశ్రమ వైఖరి నెలకొంది. నేడు ఆసియాలో ఒక్క హాంగ్‌కాంగ్‌ తప్ప మిగిలిన దేశాలకు చెందిన ఇండెక్స్‌ నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. అత్యధికంగా జపాన్‌ ఇండెక్స్‌ 1శాతం పతనమైంది. యూరప్‌ మార్కెట్లు మంగళవారం 3.50శాతం లాభంతో ముగిసాయి. అమెరికాలో మే నెల రిటైల్‌ అమ్మకాలు పెరగడంతో నిన్నరాత్రి ఈ దేశ స్టాక్‌ సూచీలు 2 శాతం లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడాయిల్‌ ధర 1.50శాతం నష్టపోయి 40.30డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. 

నిఫ్టీ-50 ఇండెక్స్‌లో ..... ఇన్ఫ్రాటెల్‌, జేఎస్‌డబ్ల్యూస్టీల్‌, పవర్‌గ్రిడ్‌, కోటక్‌బ్యాంక్‌ ఎస్‌బీఐ షేర్లు 3.50శాతం నుంచి 2శాతం నష్టపోయాయి. మారుతి, ఇన్ఫోసిస్‌, విప్రో, కోల్‌ ఇండియా, బీపీసీఎల్‌ షేర్లు 1శాతం లాభడ్డాయి.

మరిన్ని వార్తలు