ఆఖరి గంటలో అమ్మకాలు  

4 May, 2019 01:10 IST|Sakshi

మార్కెట్‌ అక్కడక్కడే

18 పాయింట్లు పతనమై 38,963కు సెన్సెక్స్‌  

13 పాయింట్ల నష్టంతో 11,712కు నిఫ్టీ  

ఐటీ బ్లూ చిప్‌ షేర్లలో అమ్మకాల కారణంగా స్టాక్‌ మార్కెట్‌ శుక్రవారం నష్టాల్లో ముగిసింది. ఆరంభ లాభాలు చివరి గంటలో ఆవిరయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 18 పాయింట్లు నష్టపోయి 38,963 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 13 పాయింట్లు తగ్గి 11,712 పాయింట్ల వద్ద ముగిశాయి. ఐటీ, ఎఫ్‌ఎమ్‌సీజీ  షేర్లు పతనం కాగా, ఆర్థిక రంగ షేర్లు ఆదుకున్నాయి. వారం పరంగా చూస్తే, సెన్సెక్స్, నిఫ్టీలు నష్టాల్లో ముగిశాయి. రెండు రోజుల సెలవుల కారణంగా మూడు రోజుల పాటే జరిగిన ఈ వారంలో సెన్సెక్స్‌ 105 పాయింట్లు, నిఫ్టీ 42 పాయింట్లు చొప్పున నష్టపోయాయి.  

252 పాయింట్ల రేంజ్‌లో సెన్సెక్స్‌... 
ముడి చమురు ధరలు దిగిరావడం, రూపాయి బలపడటంతో స్టాక్‌ మార్కెట్‌ లాభాలతోనే ఆరంభమైంది. అంతర్జాతీయ సంకేతాలు అంతంతమాత్రంగానే ఉండటం, చివరి గంటలో అమ్మకాలు సాగడంతో  ఈ లాభాలన్నీ ఆవిరయ్యాయి.  సెన్సెక్స్‌ ఒక దశలో 191 పాయింట్లు పెరగ్గా, మరో దశలో 61 పాయింట్లు నష్టపోయింది. మొత్తం మీద రోజంతా 252  పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా, యూరప్‌ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి.  

ఐటీ షేర్లకు కాగ్నిజంట్‌ షాక్‌... 
ఐటీ దిగ్గజం కాగ్నిజంట్‌ పూర్తి ఏడాది ఆదాయ అంచనాలను దాదాపు సగానికి తగ్గించడం, డాలర్‌తో రూపాయి మారకం బలపడటం వంటి కారణాల వల్ల ఐటీ షేర్లు కుదేలయ్యాయి. టీసీఎస్‌ 3.7 శాతం నష్టంతో రూ.2,132  వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్‌ ఇదే.  హెక్సావేర్‌ టెక్నాలజీస్‌ 2.7 శాతం నష్టపోయింది.  సోమవారం ఫలితాలు వెలువడనుండటంతో ఐసీఐసీఐ బ్యాంక్‌ 1.8 శాతం లాభంతో రూ.402 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్‌ ఇదే.  గత మూడు ట్రేడింగ్‌ సెషన్ల నష్టాల కారణంగా రూ.1.5 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్‌ క్యాప్‌ రూ.1.46 లక్షల కోట్లు తగ్గి రూ.1,51,62,013 కోట్లకు పడిపోయింది.   

మరిన్ని వార్తలు