సంవత్ 2072కు లాభాలతో వీడ్కోలు

29 Oct, 2016 01:03 IST|Sakshi
సంవత్ 2072కు లాభాలతో వీడ్కోలు

ఏడాదిలో సెన్సెక్స్ 2,198 పాయింట్ల లాభం
854 పాయింట్లు లాభపడిన నిఫ్టీ
30న ముహరత్ ట్రేడింగ్... 31న మార్కెట్లకు సెలవు

ముంబై: సంవత్ 2072 ఇన్వెస్టర్లకు లాభాలను పంచిపెట్టింది. చివరి రోజైన శుక్రవారం సెన్సెక్స్ 26 పాయింట్ల లాభంతో 2072కు వీడ్కోలు చెప్పింది. గత దీపావళి నుంచి సెన్సెక్స్ మొత్తం మీద 2,198 పాయింట్ల లాభంతో 8.53 శాతం లాభపడగా, నిఫ్టీ సైతం 854 పాయింట్ల లాభంతో 10.98 శాతం పెరిగింది. ఈ వారాంతంలో సెన్సెక్స్ లాభపడినప్పటికీ... వారం మొత్తం మీద 135 పాయింట్ల మేర నష్టపోయింది. నిఫ్టీ 55 పాయింట్లు కోల్పోయింది.

తక్కువ ధరల వద్ద టాటా గ్రూపు కంపెనీల స్టాక్స్‌కు కొనుగోళ్ల మద్దతు లభించడం మార్కెట్లకు స్వల్ప లాభాలను తెచ్చిపెట్టింది. దీంతో సెన్సెక్స్ 25.61 పాయింట్లు లాభపడి 27,941.51 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 22.75 పాయింట్ల లాభంతో 8,638 వద్ద క్లోజ్ అయింది. పండగ సమయంతోపాటు, టాటా గ్రూపు స్టాక్స్‌లో వేల్యూ బయింగ్ సూచీలు లాభాల్లోకి రావడానికి సాయపడినట్టు జియోజిత్ బీఎన్‌పీ పారిబా రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు.

 టాటా స్టాక్స్‌లో కొనుగోళ్లు
వరుసగా మూడు రోజుల పాటు నష్టాలపాలైన టాటా గ్రూపు కంపెనీల షేర్లకు తక్కువ స్థాయిల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించింది. దీంతో టాటా స్టీల్ 1.81 శాతం, టాటా మోటార్స్ 2.89 శాతం, టాటా పవర్ 1.75 శాతం, టాటా మెటాలిక్స్ 5.57 శాతం, టాటా ఎలెక్సీ 4.95 శాతం, టాటా కెమికల్స్ 1.78 శాతం, టాటా గ్లోబల్ బెవరేజెస్ 2.42 శాతం చొప్పున లాభపడ్డాయి. బజాజ్ ఆటో షేరు 3.35 శాతం పెరిగింది. టెక్ మహీంద్రా లాభం సెప్టెంబర్ త్రైమాసికంలో 17 శాతం తగ్గినప్పటికీ ఆ కంపెనీ షేరు 5 శాతం లాభపడడం గమనార్హం.

దీపావళి సందర్భంగా ప్రత్యేక ట్రేడింగ్
దీపావళి (సంవత్ 2073)ని పురస్కరించుకుని ఆదివారం స్టాక్ మార్కెట్లలో ప్రత్యేక ట్రేడింగ్ జరగనుంది. సాయంత్రం 6.30 గంటల నుంచి 7.30 గంటల వరకు ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలలో ట్రేడింగ్ జరుగుతుంది. దీపావళి బలిప్రతిపాద సందర్భంగా స్టాక్ మార్కెట్లు సోమవారం పనిచేయవు.

మరిన్ని వార్తలు