మళ్లీ సుంకాల సెగ!

19 Sep, 2018 00:05 IST|Sakshi

వాణిజ్య పోరు మరింత తీవ్రం

కొనసాగుతున్న రూపాయి పతనం

ముడి చమురు ధరలు భగ్గు

11,300 పాయింట్ల దిగువకు నిఫ్టీ

99 పాయింట్ల నష్టంతో 11,279 వద్ద ముగింపు

295 పాయింట్ల పతనంతో 37,291కు సెన్సెక్స్‌

మంగళవారం మధ్యాహ్నం దాకా పరిమిత శ్రేణిలో కదలాడిన స్టాక్‌ మార్కెట్, ఆ తర్వాత భారీగా నష్టపోయింది. అమెరికా–చైనాల మధ్య సుంకాల యుద్ధం మళ్లీ రాజుకోవడం, రూపాయి పతనం కొనసాగడం, ముడి చమురు ధరలు ఎగబాకడం, బాండ్ల రాబడులు 8 శాతానికి పైగా పెరగడం దీనికి ప్రధాన కారణాలు.  నిఫ్టీ కీలకమైన 11,300  పాయింట్ల దిగువకు పతనమైంది. వరుసగా రెండు రోజుల పాటు స్టాక్‌ సూచీలు నష్టపోయాయి.  బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 295 పాయింట్లు నష్టపోయి 37,291 పాయింట్ల వద్ద, నిఫ్టీ 99 పాయింట్లు నష్టపోయి 11,279 పాయింట్ల వద్ద ముగిశాయి. స్టాక్‌ సూచీలు నెల కనిష్టానికి పడిపోయాయి. అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే ముగిశాయి.

503 పాయింట్ల రేంజ్‌లో సెన్సెక్స్‌
సెన్సెక్స్‌ స్వల్ప లాభాలతో ఆరంభమైంది. ఆరంభ కొనుగోళ్ల జోరుతో 160 పాయింట్ల లాభంతో ఇంట్రాడేలో 37,745 పాయింట్ల వద్ద గరిష్ట స్థాయిని తాకింది. మధ్యాహ్నం దాకా పరిమిత శ్రేణిలోనే కదలాడింది. అయితే చివరి గంటలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఒక దశలో 343 పాయింట్ల నష్టంతో 37,243 పాయింట్ల వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. మొత్తం రోజంతా 503 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. సోమవారం సెన్సెక్స్‌ 505 పాయింట్లు నష్టపోయిన విషయం తెలిసిందే.

ఇక నిఫ్టీ ఇంట్రాడేలో 34 పాయింట్ల లాభంతో 11,411 పాయింట్ల వద్ద గరిష్ట స్థాయిని తాకినప్పటికీ, ఆ లాభాలను నిలుపుకోలేకపోయింది. 109 పాయింట్ల నష్టంతో 11,269 పాయింట్ల వద్ద ఇంట్రాడే కనిష్ట స్థాయిని తాకింది. ముడిచమురు ధరల పెరుగుదల కారణంగా స్టాక్‌ మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి పెరిగిందని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ తెలిపారు. అమెరికా, చైనాల మధ్య సుంకాల పోరు మరింతగా ముదరడం, రూపాయి బలహీనత కొనసాగడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయని వివరించారు.

ఒడిదుడుకులు కొనసాగుతాయ్‌...
.సమీప భవిష్యత్తులో మార్కెట్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. అంతర్జాతీయ సంకేతాలు అనిశ్చితిగా ఉంటాయని, ముడి చమురు ధరలు ఎగబాకుతున్నాయని, రూపాయి పతనం కొనసాగుతుందని,.. ఇన్ని ప్రతికూలతల మధ్య స్టాక్‌ మార్కెట్‌ తీవ్రమైన ఒడిదుడుకులకు గురవుతుందని వారంటున్నారు. నిఫ్టీ కీలకమైన 11,300 పాయింట్ల దిగువకు పడిపోయిందని, తదుపరి మద్దతు 11,100 పాయింట్లని నిపుణులంటున్నారు.

మరిన్ని విశేషాలు...
ఎస్‌బీఐ 4 శాతం నష్టపోయి రూ.274 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్‌ ఇదే.
ఇంగ్లాండ్‌లో జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ ఉత్పత్తిలో కోత విధిస్తున్నట్లు ప్రకటించడంతో టాటా మోటార్స్‌ షేర్‌ 3.3 శాతం నష్టంతో రూ.251 కు చేరింది.
31 సెన్సెక్స్‌ షేర్లలో ఏడు మాత్రమే– హిందుస్తాన్‌ యూనిలివర్, యస్‌ బ్యాంక్, విప్రో, ఓఎన్‌జీసీ, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, మహీంద్రా  మాత్రమే లాభపడ్డాయి. మిగిలిన 24 షేర్లు నష్టపోయాయి.
గత ఐదు రోజుల్లో 70 శాతం వరకూ పెరిగిన కొన్ని పంచదార షేర్లలో లాభాల స్వీకరణ జరిగింది. శ్రీ రేణుక, బలరామ్‌ పూర్‌ చిని, థమ్‌పూర్‌ షుగర్, త్రివేణి ఇంజినీరింగ్,  మవానా షుగర్స్, ఉగార్‌ షుగర్‌ వర్క్స్, పొన్ని షుగర్స్‌ షేర్లు ఇంట్రాడేలో 10 శాతం వరకూ పతనమయ్యాయి.


రెండు రోజుల్లో రూ.2.72 లక్షల కోట్లు ఆవిరి
గత రెండు రోజుల్లో సెన్సెక్స్‌ 800 పాయింట్ల మేర పతనం కావడంతో ఇన్వెస్టర్ల సంపద రూ.2.72 లక్షల కోట్లు ఆవిరైంది. ఈ రెండు రోజుల నష్టాల కారణంగా ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.2,72,549 కోట్లు తగ్గి రూ.1,53,64,470 కోట్లకు దిగజారింది.


పతనానికి  కారణాలు..
సుంకాల పోరు మరో స్థాయికి....
ముందుగా ప్రకటించినట్లుగానే 20,000 కోట్ల డాలర్ల చైనా దిగుమతులపై అమెరికా 10 శాతం మేర సుంకాలు విధించింది. దీంతో ప్రపంచ మార్కెట్లు నష్టపోయాయి. ఈ సుంకాలు ఈ నెల 24 నుంచి అమల్లోకి వస్తాయని, వచ్చే ఏడాది జనవరి నుంచి 25 శాతానికి పెరిగే అవకాశాలున్నాయని అమెరికా పేర్కొంది. దీనికి ప్రతిగా చైనా కూడా సుంకాలు విధిస్తే, మరిన్ని చైనా దిగుమతులపై సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ హెచ్చరించారు.  

రూపాయి పతనం...
సోమవారం 74 పైసలు పతనమైన రూపాయి మంగళవారం మరో 46 పైసలు క్షీణించింది. డాలర్‌తో రూపాయి మారకం జీవిత కాల కనిష్ట స్థాయి,  72.97  వద్ద ముగిసింది. ఈ ఏడాది రూపాయి ఇప్పటివరకూ 14 శాతం నష్టపోయింది.

చమురు ధరలు భగ్గు
మన దేశం చమురు అవసరాలకు 80% కి పైగా దిగుమతులపైనే అధారపడుతోంది. క్రూడ్‌ ధరలు పెరుగుతుండటం, రూపాయి పతనం కారణంగా కరెంట్‌ అకౌంట్‌ లోటు పెరుగుతుందనే ఆందోళన నెలకొన్నది. మంగళవారం బ్యారెల్‌ ముడి చమురు ధర 1 శాతం పెరిగి 79 డాలర్లకు చేరింది.

బ్యాంక్, హెవీ వెయిట్స్‌ బేర్‌..
సెన్సెక్స్‌ సూచీలో అధిక వెయిటేజీ ఉన్న ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్‌ బ్యాంక్, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు 1–4 శాతం రేంజ్‌లో నష్టపోయాయి. సెన్సెక్స్‌ మొత్తం 295 పాయింట్ల నష్టంలో ఈ ఐదు షేర్ల వాటానే 189 పాయింట్ల వరకూ ఉంది.


బ్యాంక్‌ షేర్లు బేర్‌...
విజయ, దేనా బ్యాంక్‌లను బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో విలీనం చేయనున్నట్లు ప్రభుత్వం చేసిన ప్రకటన.. ప్రభుత్వ రంగ బ్యాంక్‌ షేర్ల నష్టాలకు కారణమైంది. నిప్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ సూచీ 5.4% పతనమైంది. కాగా ఈ ప్రతిపాదన వల్ల ప్రయోజనం పొందగలదన్న అంచనాలున్న దేనా బ్యాంక్‌ 20% అప్పర్‌ సర్క్యూట్‌తో రూ.19.10ను చేరింది. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా చివరకు 16 శాతం నష్టంతో రూ.113 వద్ద ముగిసింది.

మూడేళ్లలో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాకి ఇది అత్యధిక పతనం. విజయ బ్యాంక్‌ 6% నష్టంతో రూ.56.40 వద్ద ముగిసింది. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా మార్కెట్‌ క్యాప్‌ రూ.5,727 కోట్లు ఆవిరై రూ.30,013 కోట్లకు, విజయ బ్యాంక్‌ మార్కెట్‌ క్యాప్‌ రూ.443 కోట్లు హరించుకుపోయి రూ.7,355 కోట్లకు తగ్గాయి. ఇండియన్‌ బ్యాంక్, కెనరా బ్యాంక్, యూనియన్‌ బ్యాంక్, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, సిండికేట్‌ బ్యాంక్, పీఎన్‌బీ, ఆంద్రా బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్, ఎస్‌బీఐ, ఓబీసీలు 3–9% రేంజ్‌లో నష్టపోయాయి.

మరిన్ని వార్తలు