భారీగా కుదేలైన స్టాక్‌మార్కెట్లు

2 Feb, 2018 09:37 IST|Sakshi
మార్కెట్లు భారీ పతనం

ముంబై : ఇన్వెస్టర్లకు కేంద్ర బడ్జెట్‌ ఇచ్చిన షాక్‌తో, దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీగా కుదేలవుతున్నాయి. ప్రారంభంలోనే సెన్సెక్స్‌ 300 పాయింట్ల మేర కిందకి పడిపోయిన సెన్సెక్స్‌, మరింత పతనమవుతూ దాదాపు 600 పాయింట్ల మేర ఢమాలమంది. నిఫ్టీ సైతం 200 పాయింట్ల మేర దిగజారింది. ప్రస్తుతం సెన్సెక్స్‌ భారీగా 574 పాయింట్ల నష్టంలో 35,333 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 182 పాయింట్ల నష్టంలో 11 వేల దిగువన 10,834 వద్ద కొనసాగుతోంది. దాదాపు అన్ని రంగాల షేర్లు తీవ్రంగా నష్టపోతున్నాయి. నిఫ్టీ రియాల్టీ భారీగా 6.5 శాతం పతనమైంది.

రియాల్టీతో పాటు బ్యాంకు, ఆటో, మెటల్‌కు కూడా 2 శాతం క్షీణించింది. కేవలం ఐటీ స్టాక్స్‌ మాత్రమే లాభాల్లో ఉన్నాయి. బడ్జెట్‌లో ఈక్విటీలపై దీర్ఘకాలిక పన్ను విధింపు, గ్రామీణ ప్రాంతాలకే అధిక ప్రాధాన్యమివ్వడం వంటి అంశాల కారణంగా అమ్మకాలు ఊపందుకున్నాయి. దీంతో మార్కెట్లు తీవ్రంగా నష్టపోతున్నాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే యాక్సిస్‌ బ్యాంకు, యస్‌ బ్యాంకు, ఎస్‌బీఐ, ఇండియాబుల్స్‌ హౌజింగ్‌ ఫైనాన్స్‌, అదానీ పోర్ట్స్‌, ఐసీఐసీఐ బ్యాంకు, కొటక్‌ మహింద్రా బ్యాంకు, సన్‌ఫార్మా, టాటా స్టీల్‌, యూపీఎల్‌ ఎక్కువగా నష్టపోయాయి. హిందాల్కో, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, బజాజ్‌ ఆటో, ఐటీసీలు మాత్రమే లాభాలు పొందాయి. ఈక్విటీలపై దీర్ఘకాలిక పన్ను విధింపు అటు డాలర్‌తో రూపాయి మారకం విలువను దెబ్బకొడుతోంది. 14 పైసలు బలహీనపడి 64.16 వద్ద ట్రేడవుతోంది. అటు ఈక్విటీ మార్కెట్లు నష్టాలు పాలవడం, అటు దిగుమతిదారుల నుంచి అమెరికా కరెన్సీకి డిమాండ్‌ పెరగడం రూపాయిపై ప్రభావం చూపుతోంది.

>
మరిన్ని వార్తలు