మార్కెట్‌కు ఇరాక్ దెబ్బ

19 Jun, 2014 01:27 IST|Sakshi
మార్కెట్‌కు ఇరాక్ దెబ్బ
  •  275 పాయింట్లు పతనం
  •  25,246 వద్దకు సెన్సెక్స్
  •  గరిష్టం 25,609- కనిష్టం 25,114
  •  ఒక దశలో 400 పాయింట్లు డౌన్
  •  అన్ని రంగాలకూ నష్టాలే
  • ఇరాక్ అంతర్యుద్ధం శృతిమించడంతో ఉన్నట్టుండి ఇన్వెస్టర్లలో ఆందోళనలు చెలరేగాయి. దీంతో ముందురోజుకి పూర్తి విరుద్ధమైన రీతిలో మిడ్ సెషన్‌నుంచీ అమ్మకాలు వెల్లువెత్తాయి. వెరసి మార్కెట్లు లాభాల నుంచి నష్టాలలోకి మళ్లాయి. ఉదయం సెషన్‌లో 25,609 పాయింట్ల గరిష్టస్థాయిని తాకిన సెన్సెక్స్ మిడ్ సెషన్‌లో కనిష్టంగా 25,114ను చవిచూసింది. అంటే గరిష్ట స్థాయి నుంచి దాదాపు 500 పాయింట్ల పతనం! క్రితం ముగింపునుంచి చూస్తే 400 పాయింట్ల నష్టం! ఆపై కొంతమేర కోలుకున్నప్పటికీ చివరికి 275 పాయింట్ల నష్టంతో 25,246 వద్ద స్థిరపడింది. నిఫ్టీ కూడా ఇదే విధంగా కదిలి ట్రేడింగ్ ముగిసేసరికి 74 పాయింట్లు పోగొట్టుకుంది.
     
    7,558 వద్ద నిలిచింది. బీఎస్‌ఈలో దాదాపు అన్ని రంగాలూ నష్టపోగా... రియల్టీ, పవర్, ఆయిల్, బ్యాంకింగ్, ఆటో, ఐటీ 2-1% మధ్య తిరోగమించాయి. ఇరాక్‌లో యుద్ధ భయాలు ముదరడంతో ఆయిల్ ధరలు మరోసారి పెకైగశాయి. ఇరాక్ బైజీలోని ప్రధాన ఆయిల్ రిఫైనరీను మిలటెంట్లు ఆక్రమించినట్లు వార్తలు వెలువడటంతో ఒక్కసారిగా సెంటిమెంట్ దిగజారిందని విశ్లేషకులు పేర్కొన్నారు. బ్రెంట్ క్రూడ్ బ్యారల్ ధర 114 డాలర్లకు చేరగా, నెమైక్స్ చమురు 107 డాలర్లకు చేరువైంది. ఇక మరోవైపు డాలరుతో మారకంలో రూపాయి కూడా 0.6% బలహీనపడి 60.40కు పతనమైంది. ఇది కూడా అమ్మకాలకు కారణమైనట్లు నిపుణులు తెలిపారు.
     
    ఆరు షేర్లు మాత్రమే
    సెన్సెక్స్‌లో ఆరు షేర్లు మాత్రమే లాభపడగా... సిప్లా, హిందాల్కో, గెయిల్ 3-1.5% మధ్య పుంజుకున్నాయి. అయితే మరోవైపు భెల్, టీసీఎస్, ఎన్‌టీపీసీ, ఆర్‌ఐఎల్, సన్ ఫార్మా, ఐసీఐసీఐ, టాటా స్టీల్, ఎంఅండ్‌ఎం, హీరోమోటో, హెచ్‌యూఎల్, కోల్ ఇండియా, టాటా మోటార్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 2.5-1.5% మధ్య తిరోగమించాయి. ఇక బీఎస్‌ఈ-500 సూచీలో ఆమ్టెక్ ఇండియా, ప్రెస్టేజ్ ఎస్టేట్స్, జీలెర్న్, బీజీఆర్ ఎనర్జీ, ఇండియా సిమెంట్స్, ఎరా ఇన్‌ఫ్రా, జేపీ అసోసియేట్స్, జేఎం ఫైనాన్షియల్, హెచ్‌పీసీఎల్, అలహాబాద్ బ్యాంక్, బజాజ్ హిందుస్తాన్ 7.5-4.5% మధ్య పతనమయ్యాయి. మొత్తం ట్రేడైన షేర్లలో 1,631 నష్టపోగా, 1,400 బలపడ్డాయి.

>
మరిన్ని వార్తలు