ఐటీసీ దెబ్బ: సెన్సెక్స్‌ అతిపెద్ద పతనం

18 Jul, 2017 20:25 IST|Sakshi
ఐటీసీ దెబ్బ: సెన్సెక్స్‌ అతిపెద్ద పతనం
ముంబై : ఆల్‌టై హైలతో రికార్డుల వర్షం కురిపించిన స్టాక్‌ మార్కెట్లకు బ్రేక్‌ పడింది.మంగళవారం మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. మార్కెట్‌లో హెవీ వెయిటేజీగా ఉన్న ఐటీసీ లిమిటెడ్‌ షేర్లు 1992 నాటి కనిష్టస్థాయిలను నమోదుచేసి, అతిపెద్ద పతనాన్ని ఎదుర్కొనడంతో, స్టాక్‌ సూచీలు కూడా తీవ్ర నష్టాలు పాలయ్యాయి. ఐటీసీ దెబ్బకు ట్రేడింగ్‌ ప్రారంభంలోనే నష్టాలోకి వెళ్లిన మార్కెట్లు, చివరికి మరింత నష్టాలను నమోదుచేశాయి. ముగింపు ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 363.79 పాయింట్లు క్రాష్‌ అయింది. దీంతో సెన్సెక్స్‌ 31,710 వద్ద సెటిలైంది. నిఫ్టీ కూడా 88.80 పాయింట్ల నష్టంలో 9,827 వద్ద ముగిసింది. ఈ ఏడాదిలో సెన్సెక్స్‌ ఇంత భారీ మొత్తంలో నష్టపోవడం ఇదే మొదటిసారి. ఐటీసీ దెబ్బకు ఎఫ్‌ఎంసీజీ ఇండెక్స్‌ 7 శాతం నష్టపోయింది. నిఫ్టీ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ కూడా సగం శాతం పైగా నష్టాలు గడించింది.  
 
మంగళవారం ట్రేడింగ్‌లో ఐటీసీ, రిలయన్స్‌, గెయిల్‌ ఎక్కువగా నష్టపోగా, ఏసియన్‌ పేయింట్స్‌, బీహెచ్‌ఈఎల్‌, ఐషర్‌ మోటార్స్‌ లాభపడ్డాయి. ఐటీసీ టాప్‌ లూజర్‌గా 12.44 శాతం నష్టాలను గడించడానికి ప్రధాన కారణం సోమవారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్‌ భేటీలో సిగరెట్‌ ఉత్పత్తులపై 28 శాతం జీఎస్టీతో పాటు అదనంగా 5 శాతం సెస్‌ను విధిస్తున్నట్టు ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ వెల్లడించడమే. దీని ప్రభావంతో నేడు ట్రేడింగ్‌ ప్రారంభమైనప్పటి నుంచి ఐటీసీ తీవ్ర నష్టాలను ఎదుర్కొంది. ఇంట్రాడేలో 15 శాతం మేర నష్టపోయింది. మరో సిగరెట్‌ ఉత్పత్తుల తయారీ సంస్థ గాడ్‌ఫ్రే ఫిలిప్స్‌ ఇండియా లిమిటెడ్‌ కూడా 10 శాతం మేర నష్టపోయింది. ఐటీసీ దెబ్బకు దానిలో పెట్టుబడులు పెట్టిన సంస్థలు కూడా భారీగా తమ మొత్తాలను కోల్పోయారు. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 3 పైసలు బలపడి 64.33 వద్ద ఉంది. ఎంసీఎక్స్‌ మార్కెట్‌లో బంగారం ధరలు 32 రూపాయల లాభంలో 28,152 రూపాయలుగా ఉన్నాయి.