మార్కెట్లకు స్వల్ప నష్టాలు

28 Mar, 2020 06:34 IST|Sakshi

నిలిచిపోయిన రిలీఫ్‌ ర్యాలీ

ఇంట్రాడే హై నుంచి 1,310 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్‌

చివరకు 131 పాయింట్ల   నష్టంతో 29,815 వద్ద ముగింపు

19 పాయింట్ల లాభంతో   8,660 వద్ద ముగిసిన నిఫ్టీ

ముంబై: వరుసగా మూడు రోజుల పాటు లాభాలను నమోదుచేసిన దేశీ ప్రధాన స్టాక్‌ సూచీలు వారాంతాన నీరసించిపోయాయి. శుక్రవారం ఉదయం ఏకంగా 4 శాతం వరకు ర్యాలీ చేసిన సెన్సెక్స్‌ చివరకు 131 పాయింట్లు (0.44 శాతం) నష్టంతో 29,815 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 31,126 పాయింట్ల గరిష్టస్థాయికి చేరిన సెన్సెక్స్‌.. ఈ స్థాయి నుంచి చూస్తే 1,310 పాయింట్లను కోల్పోయింది. భారత జీడీపీ 2020లో కేవలం 2.5 శాతానికే పరిమితం అవుతుందని అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థ మూడీస్‌ తన అంచనాను సవరించడం, అంతర్జాతీయంగా కోవిడ్‌–19 (కరోనా) వైరస్‌ మరణాలు పెరగడం వంటి ప్రతికూల అంశాల నేపథ్యంలో ఒక దశలో 29,347 పాయింట్లకు పడిపోయింది. ఇంట్రాడేలో 8,522 పాయింట్లకు పడిపోయిన నిఫ్టీ ముగింపు సమయానికి కోలుకుని 19 పాయింట్ల లాభంతో 8,660 వద్ద క్లోజయింది. ఉదయం సెషన్లో ఈ సూచీ 8,949 గరిష్ట స్థాయికి చేరింది. వైరస్‌ వ్యాప్తి కారణంగా కుంగిపోయిన భారత ఆర్థిక వ్యవస్థను గాడిలోకి తెచ్చేందుకు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ పలు కీలక నిర్ణయాలను ప్రకటించినప్పటికీ.. ఇవేవీ మార్కెట్‌ను నిలబెట్టలేకపోయాయి. రెపో రేటు 4.4 శాతానికి దిగిరావడం బుల్స్‌కు శక్తిని ఇవ్వకపోగా, బేర్స్‌కు పట్టు పెంచింది. దీంతో వరుసగా 6వ వారంలోనూ సూచీలు నష్టాలనే నమోదు చేశాయి.  

20,000 పాయింట్ల దిగువన బ్యాంక్‌ నిఫ్టీ
టర్మ్‌లోన్ల ఈఎంఐలపై మూడు నెలల మారటోరియం ప్రకటన వెలువడిన అనంతం బ్యాంక్‌ నిఫ్టీ 19,580 పాయింట్ల కనిష్టస్థాయికి పడిపోయింది. ఉదయం సెషన్లో 21,462 పాయింట్లకు చేరిన ఈ సూచీ చివరకు 1.81 శాతం లాభపడి 19,969 వద్ద ముగిసింది.  బంధన్‌ బ్యాంక్‌ అత్యధికంగా 17% వరకు లాభపడగా.. ఫెడరల్‌ బ్యాంక్, యాక్సిస్‌ బ్యాంకులు 6.5% శాతం లాభపడ్డాయి.

వాటాల విక్రయంతో కేంద్రానికి 13,883 కోట్లు
టీహెచ్‌డీసీ ఇండియా, నార్త్‌ ఈస్ట్రన్‌ ఎలక్ట్రిక్‌ పవర్‌ కార్పొరేషన్‌ (ఎన్‌ఈఈపీసీ) కంపెనీల్లో వాటాలను విక్రయించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ. 11,500 కోట్లను సమకూర్చుకుంది. టీహెచ్‌డీసీలో 74.49 శాతం వాటాను (విలువ రూ. 7,500 కోట్లు), ఎన్‌ఈఈపీసీలో 100 శాతం వాటాను (రూ. 4,000 కోట్లు) మరో ప్రభుత్వరంగ సంస్థ ఎన్‌టీపీసీకి విక్రయించింది. మరోవైపు, కామరాజర్‌ పోర్ట్‌లో 66.67 శాతం వాటాను  కూడా కేంద్రం చెన్నై పోర్ట్‌ ట్రస్టుకు విక్రయించింది. ఈ వాటా అమ్మకం విలువ రూ. 2,383 కోట్లు.

మరిన్ని వార్తలు