మార్కెట్లపై సరిహద్దు ఉద్రిక్తతల ప్రభావం

1 Mar, 2019 04:51 IST|Sakshi

స్వల్ప నష్టాలతో ముగింపు

జీడీపీ గణాంకాల నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తత

సెన్సెక్స్‌ 38 పాయింట్లు, నిఫ్టీ 15 పాయింట్లు డౌన్‌

ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా మూడో రోజు నష్టాల్లో ముగిశాయి. ఫిబ్రవరి నెల ఎఫ్‌అండ్‌వో సిరీస్‌ గడువు ముగిసే రోజు కావడం, భారత్‌–పాక్‌ మధ్య ఉద్రిక్తతల ప్రభావం మార్కెట్లపై చూపించింది. దీంతో ఉదయం ఆశాజనకంగా ప్రారంభమై లాభాల్లో ట్రేడ్‌ అయిన సూచీలు ఆ తర్వాత నష్టాల్లోకి జారుకున్నాయి. రోజంతా లాభ, నష్టాల మధ్య స్వల్ప శ్రేణి పరిధిలో కదలాడుతూ... చివరికి బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 38 పాయింట్ల నష్టంతో 35,829 వద్ద క్లోజ్‌ అవగా, అటు నిఫ్టీ 15 పాయింట్లకు పైగా నష్టపోయి 10,792 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో నిఫ్టీ 10,865–10,785 మధ్య ట్రేడ్‌ అయింది. ఆసియా మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు, యూరోప్‌ మార్కెట్లు బలహీనంగా ప్రారంభం కావడం కూడా మార్కెట్ల నష్టాలకు కారణమయ్యాయి.

‘‘ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌ ఎక్స్‌పైరీ కారణంగా మార్కెట్‌ ఓ శ్రేణికి పరిమితమైంది. మిడ్‌ క్యాప్, స్మాల్‌క్యాప్‌ షేర్లు మంచి పనితనాన్ని ప్రదర్శించాయి. సరిహద్దు ఉద్రిక్తతలు ఎక్కువ రోజుల పాటు కొనసాగవని ఇన్వెస్టర్లు భావించారు’’ అని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ తెలిపారు. దీనికి అదనంగా ఆర్థిక గణాంకాలు, ఎన్నికల ముందుస్తు ర్యాలీ, ఎఫ్‌ఐఐల నిధుల రాక పెరగడం, రూపాయి బలోపేతం వంటి వాటిపైకి దృష్టి మళ్లిందన్నారు. భారత్, పాక్‌ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఇన్వెస్టర్లు మార్చి సిరీస్‌కు పొజిషన్లను క్యారీ ఫార్వార్డ్‌ చేసుకోకుండా, వాటిని క్లోజ్‌ చేసేందుకు మొగ్గు చూపించినట్టు బ్రోకర్లు తెలిపారు. మూడో త్రైమాసికం జీడీపీ గణాంకాలు, ద్రవ్యలోటు గణాంకాల విడుదలకు ముందు ఇన్వెస్టర్లు అప్రమత్త ధోరణితో వ్యవహరించినట్టు వినోద్‌ నాయర్‌  చెప్పారు.

ఆర్‌ఈసీ రూ.11 మధ్యంతర డివిడెండ్‌
ప్రభుత్వరంగ సంస్థ ఆర్‌ఈసీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేరుకు 11 రూపాయలను మధ్యంతర డివిడెండ్‌గా ప్రకటించింది. అలాగే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రుణాల సమీకరణ పరిమితిని రూ.60,000 కోట్ల నుంచి రూ.85,000 కోట్లకు పెంచుతూ బోర్డు నిర్ణయం తీసుకుంది.

నిబంధనలకు విరుద్ధంగా ‘కిరణ్‌’ ఇన్ఫోసిస్‌ షేర్ల అమ్మకం...
ఇన్ఫోసిస్‌లో ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌గా ఉన్న కిరణ్‌  మంజుందార్‌ షా నిబంధనలకు విరుద్ధంగా ఆ సంస్థకు సంబంధించి 1,600 షేర్లను విక్రయించిన విషయం వెలుగు చూసింది. బయోకాన్‌ చైర్‌పర్సన్‌ అయిన కిరణ్‌ మజుందార్‌ షా ఇన్ఫోసిస్‌ కంపెనీ బోర్డులో లీడ్‌ ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌గానూ ఉన్నారు. తన పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్‌ సేవల ద్వారా ఆమె షేర్లను ముందస్తు అనుమతి లేకుండా అనుకోకుండా విక్రయించినట్టు ఇన్ఫోసిస్‌ ప్రకటించింది.

‘‘కంపెనీ బోర్డు ఆఫ్‌ డైరెక్టర్ల ఆడిట్‌ కమిటీ సమీక్ష అనంతరం ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ పాలసీ, ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ నిషేధ నిబంధనల ఉల్లంఘన జరిగినట్టు గుర్తించాం. కిరణ్‌ మజుందార్‌ షాపై రూ.9.5 లక్షల పెనాల్టీని విధించడం జరిగింది. కిరణ్‌ మజుందార్‌ షా ముందస్తు అనుమతి లేకుండా తన పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ ద్వారా 1,600 షేర్లను విక్రయించినట్టు ఇన్ఫోసిస్‌ కాంప్లియన్స్‌ ఆఫీసర్‌ దృష్టికి ఫిబ్రవరి 13న వచ్చింది’’ అని పేర్కొంది. పోర్ట్‌ఫోలియో మేనేజర్‌ షాకు తెలియకుండానే ఈ పనిచేసినట్టు వివరణ ఇచ్చింది. 

మరిన్ని వార్తలు