వెలుగులో మెటల్, బ్యాంకింగ్ షేర్లు

29 Sep, 2016 01:29 IST|Sakshi
వెలుగులో మెటల్, బ్యాంకింగ్ షేర్లు

సెన్సెక్స్ 69 పాయింట్ల రికవరీ   
నిఫ్టీ 39 అప్

 బ్యాంకింగ్, మెటల్, ఆటో షేర్లు పెరగడంతో మూడురోజుల మార్కెట్ పతనానికి బుధవారం బ్రేక్‌పడింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 69 పాయింట్లు కోలుకుని, 28,293 పాయింట్ల వద్ద ముగిసింది. గత మూడు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ దాదాపు 550 పాయింట్లు నష్టపోయింది. తాజాగా నిఫ్టీ 39 పాయింట్లు ర్యాలీ జరిపి 8,745 పాయింట్ల వద్ద క్లోజయ్యింది.

సెప్టెంబర్ డెరివేటివ్ కాంట్రాక్టులు గురువారం ముగియనున్న నేపథ్యంలో షార్ట్ కవరింగ్ జరగడంతో సూచీలు కోలుకున్నాయని విశ్లేషకులు చెప్పారు. అయితే వచ్చేవారం కొత్త ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలో ద్రవ్య పరపతి విధాన సమీక్ష జరగనున్నందున, ఇన్వెస్టర్లు తాజా పెట్టుబడులపై ఆచితూచి వ్యవహరిస్తున్నారని, దాంతో మార్కెట్ రికవరీ పరిమితంగా వుందని విశ్లేషకులు వివరించారు. సెన్సెక్స్-30 షేర్లలో అధికంగా టాటా స్టీల్ 3.25 శాతం పెరిగి రూ. 380 వద్ద ముగిసింది.

ఎంఆర్‌ఎఫ్ @ 50,000 -భారత్‌లో అత్యధిక ధర ఉన్న షేర్
ముంబై: టైర్లు తయారు చేసే ఎంఆర్‌ఎఫ్ కంపెనీ షేర్ ధర బీఎస్‌ఈలో బుధవారం నాటి ట్రేడింగ్‌లో ఏడాది గరిష్ట స్థాయి, రూ.50,000ను తాకింది. చివరకు 6.7 శాతం లాభంతో రూ.49,734 వద్ద ముగిసింది. ఇక ఎన్‌ఎస్‌ఈలో ఈ షేర్ ఇంట్రాడేలో 7.79 శాతం వృద్ధితో రూ.50,190ను తాకింది. చివరకు 6.85 శాతం లాభంతో రూ.49,753 వద్ద ముగిసింది. భారత్‌లో అత్యధిక ధర ఉన్న షేర్ ఇదే.  ఈ ర్యాలీ కారణంగా కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,330 కోట్లు పెరిగి రూ.21,093 కోట్లకు ఎగసింది.

>
మరిన్ని వార్తలు