మళ్లీ నష్టాల్లోకి సెన్సెక్స్

12 Dec, 2015 02:33 IST|Sakshi
మళ్లీ నష్టాల్లోకి సెన్సెక్స్
  • వాహన, బ్యాంక్ షేర్లు బేర్
  • 208 పాయింట్ల నష్టంతో 25,044కు సెన్సెక్స్
  • 73 పాయింట్ల నష్టంతో 7,610కు నిఫ్టీ
  •  స్టాక్ మార్కెట్ లాభాలు ఒక్కరోజులోనే ఆవిరయ్యాయి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ (ఎన్‌జీటీ) వ్యాఖ్యల కారణంగా వాహన షేర్లు, ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ వ్యాఖ్యల కారణంగా బ్యాంక్ షేర్లు కుదేలయ్యాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు, జీఎస్‌టీ బిల్లు ఆమోదంపై అనుమాన మేఘాలు తొలగకపోవడం వంటి అంశాలూ ప్రభావం చూపడంతో శుక్రవారం స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 208పాయింట్లు (0.82 శాతం)నష్టపోయి 25,044 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 73 పాయింట్లు (0.95 శాతం)నష్టపోయి 7,610 పాయింట్ల వద్ద ముగిశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్  25వేల పాయింట్ల దిగువకు(24,930), నిఫ్టీ 7,600 పాయింట్ల దిగువకు(7,575 పాయింట్లు) పడిపోయాయి.   స్టాక్ మార్కెట్ వరుసగా రెండో వారమూ నష్టాల్లోనే ముగిసింది. ఈ వారంలో సెన్సెక్స్ 594 పాయింట్లు, (2.31 శాతం), నిఫ్టీ 171 పాయింట్లు(2.20 శాతం)చొప్పున తగ్గాయి.

     వాహన, బ్యాంక్ షేర్లు విలవిల: ప్రభుత్వ విభాగాల వినియోగం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డీజిల్ కార్లను కొనుగోలు చేయవద్దని నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ ఆదేశాలు జారీ చేయడం, ఢిల్లీలో డీజిల్ వాహనాల రిజిష్ట్రేషన్లు వద్దని చెప్పడంతో వాహన షేర్లు ముఖ్యంగా డీజిల్ వాహనాల్ని తయారు చేసే కంపెనీల షేర్లు  పడిపోయాయి. టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతీ సుజుకీ, అశోక్ లేలాండ్, ఐషర్ మోటార్స్ కంపెనీల షేర్లు 3 శాతం వరకూ పతనమయ్యాయి. మొండి బకాయిల సమస్యను నివారించడానికి బ్యాంకులు కేటాయింపులను ఎలా వినియోగిసాయోనన్న విషయాన్ని తనిఖీ చేయనున్నామని రఘురామ్ రాజన్ వ్యాఖ్యానించడంతో బ్యాంక్ షేర్లు బాగా పతనమయ్యాయి. ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు 3.6 శాతం వరకూ నష్టపోయాయి. ట్రెండ్‌కు విరుద్ధంగా లోహ షేర్లు లాభాల్లో ముగిశాయి. టాటా స్టీల్ 3.41 శాతం, హిందాల్కో 0.7 శాతం, వేదాంత 0.3 శాతం చొప్పున లాభపడ్డాయి.

     సంపద సృష్టిలో టీసీఎస్ టాప్
     గత ఐదేళ్ల కాలంలో (2010-2015) సంపద సృష్టి అధికంగా జరిగిన కంపెనీల జాబితాలో ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సంస్థ (టీసీఎస్) అగ్రస్థానంలో నిలిచింది. ఇన్వెస్టర్లు ఎక్కువగా నష్టపోయిన కంపెనీల్లో ఎంఎంటీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ టాప్‌లో ఉన్నాయి. ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ మోతీలాల్ ఓస్వాల్ నిర్వహించిన సర్వే ప్రకారం.. గత ఐదేళ్లలో టీసీఎస్ కంపెనీలో అత్యధికంగా రూ.3,45,800 కోట్ల సంపద సృష్టి జరిగింది. ఇక దీని తర్వాతి స్థానాల్లో ఐటీసీ  హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు,  సన్‌ఫార్మా,  హెచ్‌యూఎల్  నిలిచాయి.


     

మరిన్ని వార్తలు