షాక్‌ మార్కెట్‌

22 Sep, 2018 00:23 IST|Sakshi

రోలర్‌కోస్టర్‌లా సూచీలు

యస్‌ బ్యాంక్‌ భారీ పతనంతో బ్యాంక్‌ షేర్ల కుదుపు

లిక్విడిటీ వదంతులతో 60% కుదేలైన డీహెచ్‌ఎఫ్‌ఎల్‌

హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేర్లలో అమ్మకాల సునామీ

ఇంట్రాడేలో 1,128 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్‌; నిమిషాల్లోనే రికవరీ 

1,496 పాయింట్ల రేంజ్‌లో కదలిన సూచీ 

280 పాయింట్ల నష్టంతో 36,842వద్ద ముగింపు 

ఇంట్రాడేలో 11,000 పాయింట్ల దిగుకు నిఫ్టీ   

91 పాయింట్లు పతనమై 11,143 వద్ద ముగింపు    

దేశీ స్టాక్‌ మార్కెట్లో అమ్మకాల సునామీ పోటెత్తింది. బేర్‌ పంజాతో ఈ ఏడాది ఎన్నడూ లేనంత తీవ్రమైన కుదుపులకు గురైంది. దీంతో స్టాక్‌ సూచీలు వరుసగా నాలుగో రోజూ నష్టపోయాయి. మొహర్రం(గురువారం) సెలవు సందర్భంగా ఒక రోజు విరామం తర్వాత ఆరంభమైన స్టాక్‌ సూచీలు మొదట్లో లాభాలతో మురిపించాయి. ఆ తర్వాత హౌసింగ్‌ ఫైనాన్స్, బ్యాంకేతర ఆర్థిక సంస్థలు భారీగా నష్టపోవడం  ప్రతికూల ప్రభావం చూపగా, ఇతర రంగాల షేర్లన్నీ కుదేలయ్యాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ ఒక్కసారిగా 1,128 పాయింట్లు నష్టపోయి 36,000 పాయింట్ల దిగువకు పడిపోయింది. ఆ తర్వాత నిమిషాల్లోనే రికవరీ అయింది.

సెన్సెక్స్‌ కీలకమైన 37,000 పాయింట్లు, నిఫ్టీ 11,200 పాయింట్ల దిగువకు పడిపోయాయి.   సెన్సెక్స్‌ చివరకు 280 పాయింట్ల నష్టంతో 36,842 పాయింట్ల వద్ద ముగిసింది.  ఇక ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 91 పాయింట్లు నష్టపోయి 11,143 పాయింట్ల వద్ద ముగిసింది. ఒక్క రోజులోనే  ఇన్వెస్టర్ల సంపద రూ.2 లక్షల కోట్ల మేర హరించుకుపోయింది. ఇక వారం పరంగా చూస్తే, స్టాక్‌సూచీలు వరుసగా మూడో వారమూ నష్టాల్లోనే ముగిశాయి. ఈ వారంలో సెన్సెక్స్‌ 1,249 పాయింట్లు(3.28 శాతం), నిఫ్టీ 372 పాయింట్లు (3.23 శాతం) చొప్పున నష్టపోయాయి. ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీ మాత్రమే లాభపడింది. మిగిలిన అన్ని రంగాల సూచీలు నష్టపోయాయి.

లాభాల్లోంచి నష్టాల్లోకి...
అమెరికా–చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు అంచ నా వేసినంత తీవ్రంగా ఉండవనే అంచనాలతో అమెరికా స్టాక్‌ సూచీలు గురువారం లాభపడ్డాయి. ఈ జోష్‌తో శుక్రవారం ఆసియా మార్కెట్లు లాభాల్లోనే ఆరంభమయ్యాయి. దీనికి డాలర్‌తో రూపాయి మారకం లాభాలతో ప్రారంభం కావడంతో మన స్టాక్‌ మార్కెట్‌ మంచి లాభాలతో మొదలైంది. ఆరంభ కొనుగోళ్ల జోరుతో 368 పాయింట్ల లాభంతో 37,489 పాయింట్ల వద్ద ఇంట్రాడేలో గరిష్ట స్థాయిని తాకింది.

యస్‌బ్యాంక్, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌తో పాటు ఇతర హౌసింగ్, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ షేర్లలో అమ్మకాల సునామీ చెలరేగడంతో నష్టాల్లోకి జారిపోయింది. మధ్యాహ్నం ఒక్కసారిగా 1,128 పాయింట్లు పతనమై 35,994 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది.  నిమిషాల్లోనే రికవరీ అయినప్పటికీ, ఆ తర్వాత 300–600 పాయింట్ల రేంజ్‌ నష్టాల్లో ట్రేడైంది. మొత్తం మీద సెన్సెక్స్‌ 1,496 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. నిఫ్టీ ఒక దశలో 112 పాయింట్లు లాభపడగా, తర్వాత 368 పాయింట్లు నష్టపోయింది. 

యస్‌బ్యాంక్, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌లకు సంబంధించిన వార్తలు మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపించాయని ఎమ్‌కే గ్లోబల్‌ ఫైనాన్షియల్‌ ఎనలిస్ట్‌ జోసెఫ్‌  థామస్‌ పేర్కొన్నారు. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ రుణ పత్రాలను ఒక మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థ అమ్మిందన్న వార్త... అమ్మకాలకు ప్రధాన కారణమని పైకి కన్పిస్తోందని వివరించారు. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ కంపెనీ రుణ పత్రాలనే కాకుండా ఇతర కంపెనీల రుణ పత్రాలు కూడా విక్రయమై ఉండొచ్చని, అందుకే ఈ భారీ పతనం సంభవించి ఉండొచ్చని ఆయన అంచనా వేస్తున్నారు.

మరిన్ని విశేషాలు....
ఓఎన్‌జీసీ 2% లాభంతో రూ. 180 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా పెరిగిన షేర్‌ ఇదే. విప్రో 1.3%, ఐటీసీ 1.3%, టీసీఎస్‌ 1.3%, ఏషియన్‌ పెయింట్స్‌ 1%, మహీంద్రా 1% లాభపడ్డాయి.  
    దాదాపు 400కు పైగా షేర్లు తాజా ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. యస్‌ బ్యాంక్, డీహెచ్‌ఎఫ్‌ఎల్, అదానీ పోర్ట్స్, జెట్‌ ఎయిర్‌వేస్‌(ఇండియా), అపోలో టైర్స్, జేకే టైర్‌ అండ్‌ ఇండస్ట్రీస్, ఇన్ఫీబీమ్‌ అవెన్యూ, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.  
   సూచీలు తీవ్రమైన ఒడిదుడుకులకు గురైనా కొన్ని షేర్లు తాజా ఏడాది  గరిష్ట స్థాయిలను తాకాయి. డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, విప్రో వంటి 15 షేర్లు  ఈ జాబితాలో ఉన్నాయి.  
   బీఎస్‌ఈ స్మాల్‌ క్యాప్‌ సూచీ 3 శాతం,మిడ్‌–క్యాప్‌సూచీలు 1.7 శాతం చొప్పున కుదేలయ్యాయి.

రూ.5.6 లక్షల కోట్ల సంపద ఆవిరి
నాలుగు రోజుల సెన్సెక్స్‌ పతనం కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.5.6 లక్షల కోట్లు ఆవిరైంది. ఈ నాలుగు రోజుల్లో సెన్సెక్స్‌  మొత్తం రూ.1,249 పాయింట్లు పతనమైంది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.5,66,187 కోట్లు తగ్గి రూ.1.50,70,832 కోట్ల కు పడిపోయింది.

పతనానికి ప్రధాన కారణాలు
యస్‌ బ్యాంక్‌ 29 శాతం డౌన్‌...
సీఈఓ రాణాకపూర్‌ పదవీ కాలాన్ని వచ్చే ఏడాది జనవరికే పరిమితం చేయడంతో యస్‌ బ్యాంక్‌ భారీగా కుదేలైంది. రాణా కపూర్‌ పదవీ కాలాన్ని కుదించడంతో పలు బ్రోకరేజ్‌ సంస్థలు,  ఈ షేర్‌ రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేశాయి, టార్గెట్‌ ధరలను తగ్గించాయి. దీంతో ఇంట్రాడేలో 50% వరకూ కుదేలైన ఈ షేర్‌ చివరకు 29% నష్టంతో రూ. 227 వద్ద ముగిసింది. స్టాక్‌ మార్కెట్లో లిస్టైన తర్వాత ఈ షేర్‌కు ఇదే అత్యంత ఘోర పతనం. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్‌ ఇదే. మొత్తం సెన్సెక్స్‌ 280 పాయింట్ల నష్టంతో యస్‌ బ్యాంక్‌ షేర్‌ నష్టమే సగానికి పైగా (169 పాయింట్లు) ఉంది.  

హౌసింగ్, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ షేర్లలో అమ్మకాల సునామీ...
ఇటీవలనే ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ కంపెనీ రుణ చెల్లింపుల్లో విఫలమైన విషయం తెలిసిందే. ఈ గ్రూప్‌ కన్సాలిడేటెడ్‌ రుణ భారం రూ.91,000 కోట్లుగా ఉంటుందని అంచనా. ఇలాంటి పరిస్థితే ఇతర ఎన్‌బీఎఫ్‌సీలకు తలెత్తే అవకాశాలున్నాయన్న అందోళనలు వ్యక్తమయ్యాయి మరోవైపు నిధుల కటకట కారణంగా డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ఇబ్బందులు పడుతుందన్న వదంతులు మార్కెట్లో వ్యాపించడంతో ఈ షేర్‌ ఇంట్రాడేలో జీవిత కాల కనిష్ట స్థాయి, రూ.246కు పతనమైంద. ఇవన్నీ వదంతులేన ని, కంపెనీ పటిష్టంగా ఉందని యాజమాన్యం వెల్లడించడంతో ఒకింత రికవరీ అయింది. ఇదే లిక్విడిటీ సమస్య ఇతర హౌసింగ్, న్యాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలకు కూడా ఉండొచ్చన్న ఆందోళనతో ఈ రెండు రంగాల షేర్లు భారీగా పతనమయ్యాయి.

పెరుగుతున్న బాండ్ల రాబడులు
రూపాయి పతనం, కరంట్‌ అకౌంట్‌ లోటు విస్తరిస్తుండటంతో బాండ్ల రాబడులు పెరుగుతున్నాయి. బాండ్ల రాబడులు పెరగడం గృహ, నాన్‌ బ్యాంకింగ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల మార్జిన్లపై తీవ్రంగానే ప్రభావం చూపించనున్నది. ఈ కారణంగా ఈ రెండు రంగాల షేర్లలో భారీగా అమ్మకాలు జరిగాయి.  

మళ్లీ 72కు రూపాయి...
ఆరంభంలో డాలర్‌తో రూపాయి మారకం లాభాల్లో ఉన్నప్పటికీ, ఇంట్రాడేలో మళ్లీ 72 మార్క్‌ను దాటేయడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.  

సాంకేతిక అంశాలు...
నిఫ్టీ సూచీ 100 రోజుల మూవింగ్‌ యావరేజ్, 100 రోజల ఎక్స్‌పోనెన్షియల్‌ మూవింగ్‌ యావరేజ్‌ దిగువకు పడిపోయింది. అంతే కాకుండా కీలకమైన మద్దతు స్థాయి, 11,171 దిగువకు క్షీణించింది. దీంతో అన్ని రంగాల్లో అమ్మకాలు పోటెత్తాయి. నిఫ్టీ 11,333 పాయింట్లపైకి రాగలిగితేనే ముందుకు పోగలదని, లేకపోతే 11,000 పాయింట్ల దిగువకు పడిపోయే అవకాశాలున్నాయని ఎనలిస్ట్‌లు అంటున్నారు.

మరిన్ని వార్తలు