నామమాత్ర నష్టాలు

31 May, 2014 01:36 IST|Sakshi
నామమాత్ర నష్టాలు

 ఇటీవల కన్సాలిడేషన్ దిశలో కదులుతున్న మార్కెట్లు మరోసారి రోజు మొత్తం ఒడిదుడుకులకు లోనయ్యాయి. చివరికి స్వల్ప నష్టాలతో ముగిశాయి. దాదాపు 200 పాయింట్ల స్థాయిలో పలుమార్లు హెచ్చుతగ్గులను చవిచూసిన సెన్సెక్స్ ట్రేడింగ్ ముగిసేసరికి 17 పాయింట్లు నష్టపోయింది. 24,217 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ 6 పాయింట్లు క్షీణించి 7,230 వద్ద నిలిచింది. ప్రధానంగా బ్యాంకింగ్, వినియోగ వస్తు రంగాలు 1.5% చొప్పున నీరసించగా, హెల్త్‌కేర్, రియల్టీ రంగాలు 2%పైగా బలపడ్డాయి.

 కొద్ది రోజులుగా ఎఫ్‌ఐఐలు నికర అమ్మకందారులుగా నిలుస్తుండటంతో సెంటిమెంట్ బలహీనపడిందని విశ్లేషకులు పేర్కొన్నారు. ఇన్వెస్టర్లు జీడీపీ గణాంకాలు, రిజర్వ్ బ్యాంక్ పాలసీ తదితర అంశాలపై దృష్టిపెట్టారని, దీంతో ఆచితూచి వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఈ వారంలో సెన్సెక్స్ 476 పాయింట్లను కోల్పోవడం గమనార్హం. ఇంతక్రితం జనవరి 31న ముగిసిన వారంలో మాత్రమే సెన్సెక్స్ 620 పాయింట్లు నష్టపోయింది.

 హెచ్‌యూఎల్ జోరు
 బ్లూచిప్స్‌లో హెచ్‌యూఎల్ 8% జంప్‌చేయగా, ఎన్‌టీపీసీ, ఎంఅండ్‌ఎం, సన్ ఫార్మా, సిప్లా, డాక్టర్ రెడ్డీస్, టాటా పవర్ 5-3% మధ్య పుంజుకున్నాయి. అయితే మరోవైపు ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్, ఐసీఐసీఐ 2-1% మధ్య నష్టపోగా, టాటా మోటార్స్, మారుతీ సైతం 2% స్థాయిలో తిరోగమించాయి. కాగా, ఇటీవల అమ్మకాలకే కట్టుబడుతున్న ఎఫ్‌ఐఐలు వారాంతంలో రూ. 2,978 కోట్లను నికరంగా ఇన్వెస్ట్ చేశారు. దేశీయ ఫండ్స్ మాత్రం రూ. 458 కోట్ల అమ్మకాలు చేపట్టాయి.

 జేఅండ్‌కే బ్యాంక్ బోర్లా
 మిడ్ క్యాప్స్‌లో జేఅండ్‌కే బ్యాంక్ దాదాపు 20% పతనమైంది. రూ. 2,500 కోట్లమేర మొండిబకాయిలుగా మారిన రుణాలను ఖాతాలలో చూపించడం లేదన్న వార్తలు ఇందుకు కారణమయ్యాయి. మిగిలిన మిడ్‌క్యాప్స్‌లో చోళమండలం ఫైనాన్స్, మోనెట్ ఇస్పాత్, గ్రాఫైట్, కాక్స్‌అండ్‌కింగ్స్, పీసీ జ్యువెలర్, చంబల్ ఫెర్టిలైజర్స్, బజాజ్ ఎలక్ట్రికల్స్, ఓరియంట్ సిమెంట్  9-5% మధ్య నష్టపోయాయి.

మరిన్ని వార్తలు