ఐదోరోజూ లాభాలే...

23 Nov, 2017 00:39 IST|Sakshi

83 పాయింట్ల లాభంతో 33,562కు సెన్సెక్స్‌

15 పాయింట్లు పెరిగి 10,342కు నిఫ్టీ 

ఫ్యూచర్‌ గ్రూప్‌ షేర్ల జోరు

ముంబై: ఆసియా మార్కెట్ల జోరుకు, దేశీయ అంశాలు కూడా కలసిరావడంతో  మన స్టాక్‌ మార్కెట్‌ బుధవారం లాభాల్లో ముగిసింది. స్టాక్‌ సూచీల లాభాలు వరుసగా ఐదో ట్రేడింగ్‌ సెషన్‌లోనూ కొనసాగాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 83 పాయింట్ల లాభంతో 33,562 పాయింట్ట వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 15 పాయింట్ల లాభంతో 10,342 పాయింట్ల వద్ద ముగిశాయి. ఈ ఐదు రోజుల్లో సెన్సెక్స్‌ 801 పాయింట్లు లాభపడింది.  

మంగళవారం అమెరికా మార్కెట్‌ రికార్డ్‌ స్థాయిల్లో ముగియడం, మొండి బకాయిల పరిష్కారానికి మరిన్ని చర్యలు వేగంగా ఉంటాయన్న అంచనాలు, ఎఫ్‌ఎంసీజీ వస్తువులపై జీఎస్‌టీ రేట్లను మరింతగా తగ్గించే అవకాశాలున్నాయన్న వార్తలు, దివాలా చట్ట సవరణలకు కేబినెట్‌ ఆమోదం, దేశీయ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు కొనసాగతుండటం, దివాలా చట్ట సవరణలకు కేబినెట్‌ ఆమోదం... సానుకూల ప్రభావం చూపించాయి. మరోవైపు అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ మినిట్స్‌ వెల్లడి కానుండటంతో ఇన్వెస్టర్లు ఆచి,తూచి వ్యవహరించారు. టెలికం, లోహ, ఫార్మా షేర్లు నష్టపోయినప్పటికీ, ఇన్‌ఫ్రా, పీఎస్‌యూ, వాహన షేర్లు లాభపడటంతో సెన్సెక్స్‌ రెండు వారాల గరిష్టానికి ఎగసింది. ఇంట్రాడేలో 176 పాయింట్ల లాభంతో 33,655 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకిన సెన్సెక్స్‌ మరో దశలో 13 పాయింట్లు నష్టపోయింది.

ఫ్యూచర్‌ రిటైల్‌ 12 శాతం అప్‌..
సభ్యులకు మాత్రమే పరిమితమయ్యే పదివేల వరకూ స్టోర్స్‌ను 2022 కల్లా ప్రారంభించనున్నామని, ప్రస్తుతం 750గా ఉన్న ఈజీ డే స్టోర్స్‌ను వచ్చే ఏడాది మార్చికల్లా 1,100కు పెంచనున్నామని ఫ్యూచర్‌ గ్రూప్‌ వెల్లడించడంతో ప్యూచర్‌ రిటైల్‌ షేర్‌ 12 శాతం ఎగసి రూ. 574 వద్ద ముగిసింది. ఇతర ఫ్యూచర్‌ గ్రూప్‌ షేర్లు ఫ్యూచర్‌ కన్సూమర్, ఫ్యూచర్‌ లైఫ్‌ స్టైల్, ఫ్యూచర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ షేర్లు 3–7 శాతం రేంజ్‌లో పెరిగాయి. లెదర్, ఫుట్‌వేర్‌ రంగానికి రూ.2,600 కోట్ల ప్యాకేజీ ఇవ్వనున్నారన్న వార్తల నేపథ్యంలో రిలాక్సో ఫుట్‌వేర్, మీర్జా ఇంటర్నేషనల్, మయూర్‌ లెదర్, లిబర్టీ షూస్, బాటా ఇండియా, ఖదీమ్‌ ఇండియా వంటి ఫుట్‌వేర్‌ షేర్లు 2–9 శాతం రేంజ్‌లో లాభపడ్డాయి. ఇంట్రాడేలో రెండు వాహన షేర్లు–మారుతీ సుజుకీ (రూ.8,532) బజాజ్‌ ఆటో (రూ.3,344)షేర్లు ఆల్‌టైమ్‌ హైని తాకాయి.

మరిన్ని వార్తలు