సెన్సెక్స్‌ @ 35,000

18 Jan, 2018 00:01 IST|Sakshi

కొత్త శిఖరాలకు స్టాక్‌ సూచీలు

 ఒక్క రోజు వ్యవధి తర్వాత మళ్లీ రికార్డ్‌లు

 ఇంట్రాడేలోనూ, ముగింపులోనూ ఆల్‌టైమ్‌ హై

 బ్యాంకింగ్‌ షేర్ల దూకుడు...

 తొలిసారిగా 35,000 పైకి సెన్సెక్స్‌

 311 పాయింట్ల లాభంతో 35,082 వద్ద ముగింపు 

 ఇంట్రాడేలో 10,800 పాయింట్లపైకి నిఫ్టీ 

 82 పాయింట్లు పెరిగి 10,789 వద్ద ముగింపు  

ఒక రోజు వ్యవధి తర్వాత స్టాక్‌ సూచీలు మళ్లీ రికార్డు్డలు సృష్టించాయి. ఇంట్రాడేలోనూ, ముగింపులోనూ కొత్త శిఖరాలకు చేరాయి. సెన్సెక్స్‌ తొలిసారిగా కీలకమైన 35 వేల పాయింట్లపైకి, నిఫ్టీ 10,800 పాయింట్లపైకి ఎగిశాయి. అంతర్జాతీయ సంకేతాలు బలహీనంగా ఉన్నప్పటికీ, అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్ల సునామీ కొనసాగింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 311 పాయింట్ల లాభంతో 35,082 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 88 పాయింట్ల లాభంతో 10,789 పాయింట్ల వద్ద ముగిశాయి.  

కేవలం 17 ట్రేడింగ్‌ సెషన్లలోనే సెన్సెక్స్‌ 34,000 పాయింట్ల నుంచి 35,000 పాయింట్లకు పెరిగింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 35,119 పాయింట్లు, నిఫ్టీ 10,803 పాయింట్ల గరిష్ట స్థాయిలను తాకాయి. ఇవి ఆయా సూచీలకు జీవిత కాల గరిష్ట స్థాయిలు. నిఫ్టీ మీడియా మినహా అన్ని రంగాల సూచీలు లాభాల్లోనే ముగిశాయి. టెక్నాలజీ, ఫార్మా, లోహ షేర్లు ర్యాలీలో పాల్గొన్నాయి.  బ్యాంక్‌ నిఫ్టీ కూడా కొత్త శిఖరాలకు చేరింది. 345 పాయింట్ల లాభంతో 26,320 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 26,336 పాయింట్ల ఆల్‌టైమ్‌ హైని తాకింది. రెగ్జిట్‌ (ఆర్‌బీఐ గవర్నర్‌గా రఘురామ్‌ రాజన్‌ నిష్క్రమణ), బ్రెగ్జిట్, పెద్ద కరెన్సీ నోట్ల రద్దు, జీఎస్‌టీ అమలు ఇలా అన్ని ప్రతికూలతలను అధిగమిస్తూ స్టాక్‌ సూచీలు కొత్త శిఖరాలను అధిరోహిస్తూ వస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు.

యాక్సిస్‌ బ్యాంక్‌ 5 శాతం లాభంతో రూ.585 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ షేర్లలో బాగా లాభపడిన షేర్‌ ఇదే. ఐసీఐసీఐ బ్యాంక్, యస్‌ బ్యాంక్, అదానీ పోర్ట్స్, ఎల్‌ అండ్‌ టీ, ఐటీసీ, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్, టాటా స్టీల్, సన్‌ ఫార్మా, పవర్‌ గ్రిడ్, బజాజ్‌ ఆటో, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌డీఎఫ్‌సీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్, ఎన్‌టీపీసీ షేర్లు 3 శాతం వరకూ పెరిగాయి. ఇన్ఫోసిస్, టీసీఎస్‌ వంటి ఐటీ షేర్లలో కొనుగోళ్లు కొనసాగాయి. 
స్టాక్‌ సూచీలతో పాటు దాదాపు 70కు పైగా షేర్లు కూడా జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకాయి. టీసీఎస్, ఎల్‌ అండ్‌ టీ, హిందుస్తాన్‌ యూనిలివర్, గృహ్‌ ఫైనాన్స్, టీటీకే ప్రెస్టీజ్, టాటా స్పాంజ్‌ ఐరన్, జుబిలంట్‌ లైఫ్‌ సైన్సెస్, సుప్రీం ఇండస్ట్రీస్‌ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.

తస్మాత్‌.. జాగ్రత్త !
స్టాక్‌ మార్కెట్‌ రికార్డ్‌ స్థాయిలకు  చేరడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. ద్రవ్యోల్బణం పెరుగుతోందని, ముడి చమురు ధరలు కూడా పెరుగుతున్నాయని, అంచనాలకు అనుగుణంగా క్యూ3 ఫలితాలు లేకపోతే మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపించవచ్చని వారు హెచ్చరిస్తున్నారు. 

లాభాలు ఎందుకంటే..
ద్రవ్యలోటు భయాలకు బ్రేక్‌..బ్యాంక్‌ షేర్ల జోరు బాండ్ల మార్కెట్‌ ద్వారా సమీకరించే అదనపు రుణాలను తగ్గించుకుంటామని ప్రభుత్వం ప్రకటించడంతో ద్రవ్యలోటు పెరుగుతుందేమోనన్న భయాలకు బ్రేక్‌ పడింది. గతంలో అంచనా వేసినట్లుగా రూ.50,000 కోట్ల మేర కాకుండా రూ.20,000 కోట్ల మేర మాత్రమే అదనపు రుణాలు సమీకరిస్తామని ప్రభుత్వం పేర్కొంది. దీంతో బాండ్‌ ఈల్డ్స్, ద్రవ్యలోటులపై ఒత్తిడి ఉపశమించింది. దీనికి మొండి బకాయిల సమస్య నివారణకు ప్రభుత్వం సత్వరంగా చర్యలు తీసుకోనున్నదన్న వార్తలు కూడా జతకావడంతో  బ్యాంక్‌ షేర్లలో  కొనుగోళ్లు జోరుగా సాగాయి. 

క్యూ3 ఫలితాలపై ఆశావహ అంచనాలు...
ఇటీవల వెలువడిన కంపెనీల క్యూ3 ఫలితాలు అంచనాలకు అనుగుణంగానే ఉండటం, కొన్ని అంచనాలను మించడంతో క్యూ3 ఫలితాలపై ఆశావహ అంచనాలు నెలకొన్నాయి. గత క్యూ3లో పెద్ద కరెన్సీ నోట్ల ప్రభావం ఉన్న కారణంగా ఈ క్యూ3లో ఫలితాలు బాగా ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు. 

బడ్జెట్‌పై ఆశలు..
మరో రెండు వారాల్లో బడ్జెట్‌ రానున్నది. ఎన్నికలకు ముందు వచ్చే ఈ బడ్జెట్‌ వినియోగం పెంపు ప్రోత్సహించేలా ఉండొచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. 

రూపాయి బలం..
డాలర్‌తో రూపాయి మారకం 15 పైసలు బలపడటం సానుకూల ప్రభావం చూపించింది.

70 వస్తువులపై జీఎస్‌టీ సవరణ...
గురువారం జరిగే జీఎస్‌టీ మండలి సమావేశంలో  70 ఐటెమ్స్‌కు (వీటిల్లో 40కు పైగా సేవలకు సంబంధించినవే) సంబంధించిన పన్ను రేట్లలో మార్పులు, చేర్పులు చేయవచ్చన్న వార్తలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు జోష్‌నిచ్చాయి. 

గణాంకాల ఉత్సాహం...
ఇటీవల వెలువడిన గత నెల వాహన విక్రయాలు, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు ప్రోత్సాహకరంగా ఉండటం, వివిధ అంతర్జాతీయ సంస్థలు ఆశావహ వృద్ధి అంచనాలను వెలువరించడం కలసివచ్చాయి. 

వచ్చే ఏడాది మార్చి కల్లా 11,800కు నిఫ్టీ 
వచ్చే ఆర్థిక సంవత్సరం కల్లా నిఫ్టీ 11,800 పాయింట్లకు చేరుతుందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ అంచనా వేస్తోంది. గత రెండు క్వార్టర్లలో కంపెనీల ఆదాయాలు పెరుగుతున్నాయని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇది 21.5 శాతంగా ఉండగలదని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ధీరజ్‌ రెల్లి పేర్కొన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 7.3 శాతానికి, జీవీఏ 7.1 శాతానికి పెరుగుతాయని ఆయన అంచనా వేస్తున్నారు.  

                             
స్టాక్‌ మార్కెట్‌ డేటా      టర్నోవర్‌ (రూ. కోట్లలో)

 బీఎస్‌ఈ                          6,289
ఎన్‌ఎస్‌ఈ (ఈక్విటీ)           38,740
ఎన్‌ఎస్‌ఈ (డెరివేటివ్స్‌)       9,10,681

ఎఫ్‌ఐఐ     625
డీఐఐ       169

>
మరిన్ని వార్తలు