తొలుత 37,000- చివర్లో 36,694కు

13 Jul, 2020 15:56 IST|Sakshi

ఆటుపోట్ల మధ్య మార్కెట్లు ప్లస్‌

సెన్సెక్స్‌ 99 పాయింట్లు అప్‌

36,694 వద్ద ముగింపు

మిడ్‌సెషన్‌లో నష్టాలలోకి

35 పాయింట్లు బలపడ్డ నిఫ్టీ

బ్యాంకింగ్‌, రియల్టీ బోర్లా

ప్రపంచ మార్కెట్ల ప్రోత్సాహంతో హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు చివరికి ఓమాదిరి లాభాలతో సరిపెట్టుకున్నాయి. సెన్సెక్స్‌ 99 పాయింట్లు బలపడి 36,694 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 35 పాయింట్లు పుంజుకుని 10,803 వద్ద నిలిచింది. తొలుత ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో సెన్సెక్స్‌ 425 పాయింట్లు జంప్‌చేసింది. 37,000 పాయింట్ల కీలకమార్క్‌ను అధిగమించింది. మిడ్‌సెషన్‌కల్లా కొనుగోళ్ల స్థానే అమ్మకాలు పెరగడంతో లాభాలు పోగొట్టుకుని నష్టాలలోకి ప్రవేశించింది. 36,534 దిగువకు చేరింది. చివర్లో తిరిగి కోలుకుంది. ఈ బాటలో నిఫ్టీ 10,894 వద్ద గరిష్టాన్ని తాకి, తదుపరి 10,756 వద్ద కనిష్టాన్నీ చవిచూసింది. 

మెటల్‌, ఐటీ, ఎఫ్‌ఎంసీజీ ఓకే
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా మెటల్‌, ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, ఆటో రంగాలు 1.5-0.7 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే బ్యాంకింగ్‌, రియల్టీ 1.5 శాతం స్థాయిలో నీరసించాయి. నిఫ్టీ దిగ్గజాలలో టెక్‌ మహీంద్రా, హిందాల్కో, హెచ్‌సీఎల్‌ టెక్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఆర్‌ఐఎల్‌, విప్రో, ఎయిర్‌టెల్‌, జీ, బ్రిటానియా, వేదాంతా 5.5-2 శాతం మధ్య ఎగశాయి. ఇతర బ్లూచిప్స్‌లో పవర్‌గ్రిడ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, ఎస్‌బీఐ, గెయిల్‌, కొటక్‌ మహీంద్రా, ఎన్‌టీపీసీ, అదానీ పోర్ట్స్‌ 2.2-0.7 శాతం మధ్య బలహీనపడ్డాయి.

ఎఫ్‌అండ్‌వో ఇలా
డెరివేటివ్‌ కౌంటర్లలో బాష్‌, భారత్‌ ఫోర్జ్‌, రామ్‌కో సిమెంట్‌, బీహెచ్‌ఈఎల్‌, కాల్గేట్‌ పామోలివ్‌ 4.3-3 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. డీఎల్‌ఎఫ్‌, గ్లెన్‌మార్క్‌, సెయిల్‌, ఈక్విటాస్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, ఎన్‌సీసీ, బీవోబీ, యూబీఎల్‌ 3.3-2.2 శాతం మధ్య వెనకడుగు వేశాయి. బీఎస్‌ఈలో స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ స్వల్పంగా 0.15 శాతం వెనకడుగు వేసింది. ట్రేడైన మొత్తం షేర్లలో 1567 నష్టపోగా.. 1127 లాభపడ్డాయి.

అమ్మకాల జోరు
నగదు విభాగంలో వారాంతాన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1031 కోట్లు, దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 431 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. గురువారం ఎఫ్‌పీఐలు రూ. 213 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. డీఐఐలు రూ. 803 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించిన విషయం విదితమే. 

మరిన్ని వార్తలు