సెన్సెక్స్‌ తక్షణ మద్దతు 41,700

20 Jan, 2020 04:12 IST|Sakshi

మార్కెట్‌ పంచాంగం

అంతర్జాతీయంగా అనూహ్య పరిణామాలేవీ సంభవించకపోతే, ఇకనుంచి మన మార్కెట్లో బడ్జెట్‌ అంచనాలు, కార్పొరేట్‌  ఫలితాలకు అనుగుణంగా ఆయా రంగాలకు చెందిన షేర్లు పెరిగే అవకాశం వుంది. ముఖ్యంగా స్టాక్‌ సూచీలను ప్రభావితం చేసే టాప్‌ హెవీవెయిట్‌ షేర్లు, మార్కెట్‌క్యాప్‌లో తొలి రెండు స్థానాల్లో వున్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్, టీసీఎస్‌లు గత శుక్రవారం మార్కెట్‌ ముగిసిన వెల్లడించిన ఫలితాలకు స్పందనగా ఈ వారం ప్రధమార్థంలో సూచీల కదలిక వుంటుంది. అలాగే టెలికాం కంపెనీలు... సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఏజీఆర్‌ బకాయిల్ని జనవరి 23న చెల్లించాల్సిన నేపథ్యంలో ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వ స్పందన కూడా సమీప భవిష్యత్తులో మన మార్కెట్‌ను ప్రభావితం చేయవచ్చు.  ఇక  స్వల్పకాలిక సాంకేతికాలు ఇలా ఉన్నాయి.

సెన్సెక్స్‌ సాంకేతికాంశాలు... 

జనవరి 17తో ముగిసిన వారంలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 42,063 పాయింట్ల వద్ద కొత్త రికార్డును నెలకొల్పిన అనంతరం, చివరకు  అంతక్రితం వారం ముగింపుతో పోలిస్తే 395 పాయింట్ల లాభంతో 41,945 పాయింట్ల వద్ద ముగిసింది. వరుసగా రెండువారాలపాటు గట్టిగా నిరోధించిన 41,700–41,800 శ్రేణే,  ఈ వారం తక్షణ మద్దతును అందించవచ్చు. ఈ వారం సెన్సెక్స్‌ 41,700 మద్దతుస్థాయి దిగువన ముగిస్తే స్వల్ప కరెక్షన్‌కు లోనై 41,450 పాయింట్ల స్థాయికి తగ్గవచ్చు. ఈ లోపున 41,170 పాయింట్ల వరకూ క్షీణత కొనసాగవచ్చు. ఈ వారం మార్కెట్‌  పెరిగితే 42,250 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. ఆపైన క్రమేపీ 42,480 పాయింట్ల వరకూ పెరగవచ్చు. అటుపైన 42,600 పాయింట్ల స్థాయిని అందుకునే ఛాన్స్‌ వుంటుంది.

నిఫ్టీ తక్షణ మద్దతు 12,275...

గత వారం 12,389 పాయింట్ల కొత్త రికార్డుస్థాయిని చేరిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ చివరకు  అంతక్రితం వారంతో పోలిస్తే 95 పాయింట్ల లాభంతో 12,352 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం మార్కెట్‌ హెచ్చుతగ్గులకు లోనైతే నిఫ్టీకి 12,275 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభిస్తుండగా, 12,450 పాయింట్ల సమీపంలో తొలి అవరోధం కలగవచ్చు. 12,450 పాయింట్లపైన 12,490 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. అటుపై క్రమేపీ 12,540 పాయింట్ల వద్దకు చేరవచ్చు. ఈ వారం నిఫ్టీ 12,275 పాయింట్ల తక్షణ మద్దతును కోల్పోతే 12,210 పాయింట్ల స్థాయికి పడిపోవొచ్చు.  ఈ  లోపున 12,185– 12,130 శ్రేణిని పరీక్షించవచ్చు.

మరిన్ని వార్తలు