మార్కెట్లు.. బుల్‌ దూకుడు

27 May, 2020 15:52 IST|Sakshi

1000 పాయింట్ల హైజంప్‌

ఇంట్రాడేలో 31660కు సెన్సెక్స్‌

నిఫ్టీ లాభాల ట్రిపుల్‌ సెంచరీ

బ్యాంక్‌ నిఫ్టీ 7.3 శాతం జూమ్‌

నేలచూపులతో మొదలై పరుగు

ఒక్క రోజులో మే నెల డెరివేటివ్‌ సిరీస్‌ ముగియనుండగా దేశీ స్టాక్‌ మార్కెట్లు ఉన్నట్టుండి జోరందుకున్నాయి. బుల్‌ ఆపరేటర్లు కదం తొక్కడంతో సెన్సెక్స్‌ ఏకంగా 1,000 పాయింట్లు జంప్‌చేసింది. ఇక నిఫ్టీ సైతం దాదాపు ట్రిపుల్‌ సెంచరీ చేసింది. తొలుత బలహీనంగా ప్రారంభమైనప్పటికీ సమయం గడిచేకొద్దీ మార్కెట్లు పరుగందుకున్నాయి. చివరికి సెన్సెక్స్‌ 996 పాయింట్లు జమ చేసుకుని 31,605 వద్ద నిలవగా.. నిఫ్టీ 286 పాయింట్లు ఎగసి 9,315 వద్ద ముగిసింది. ఇది దాదాపు రెండు వారాల గరిష్టంకాగా.. సెన్సెక్స్‌ తొలుత 30,526 దిగువన ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. తదుపరి జోరందుకుని 31,660ను అధిగమించింది. ఇది 1050 పాయింట్ల వృద్ధికిగా.. నిఫ్టీ సైతం ఒక దశలో 9334 వద్ద గరిష్టాన్ని చేరుకోగా, 9004 వద్ద కనిష్టాన్నీ చవిచూసింది. ప్రధానంగా బ్యాంకింగ్‌ స్టాక్స్‌ లాభాల దుమ్మురేపాయి. దీంతో మార్కెట్లకు బలమొచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. గురువారం(28న) డెరివేటివ్‌ కాంట్రాక్టుల గడువు ముగియనున్న కారణంగా బ్యాంకింగ్‌ కౌంటర్లలో ట్రేడర్లు భారీ షార్ట్‌ కవరింగ్‌ చేపట్టినట్లు తెలియజేశారు.

ఐటీ, రియల్టీ జోరు
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా ప్రయివేట్‌ బ్యాంక్స్‌ 7.5 శాతం, పీఎస్‌యూ బ్యాంక్స్‌ 3.4 శాతం చొప్పున జంప్‌చేయగా.. ఐటీ దాదాపు 3 శాతం ఎగసింది. ఈ బాటలో రియల్టీ 2 శాతం పుంజుకోగా.. ఫార్మా స్వల్పంగా 0.2 శాతం నీరసించింది. నిఫ్టీ దిగ్గజాలలో యాక్సిస్‌ బ్యాంక్‌ 14 శాతంపైగా దూసుకెళ్లగా.. ఐసీఐసీఐ, విప్రో, గ్రాసిమ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌, యూపీఎల్‌, కొటక్‌ మహీంద్రా, బీపీసీఎల్‌ 9-5 శాతం మధ్య జంప్‌చేశాయి.అయితే సన్‌ ఫార్మా, అల్ట్రాటెక్‌, జీ, టైటన్‌, ఏషియన్‌ పెయింట్స్‌, శ్రీసిమెంట్‌, మారుతీ 2-0.5 శాతం మధ్య నీరసించాయి. 

చోళమండలం అప్‌
డెరివేటివ్స్‌లో చోళమండలం, బంధన్‌ బ్యాంక్‌, ఆర్‌బీఎల్‌, ఫెడరల్‌ బ్యాంక్‌, ఐబీ హౌసింగ్‌, కెనరా బ్యాంక్‌ 10-6 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోపక్క టొరంట్‌ ఫార్మా, ఎక్సైడ్‌ ఇండస్ట్రీస్‌, ఐజీఎల్‌, బయోకాన్‌, టొరంట్‌ పవర్‌, ఎస్‌బీఐ లైఫ్‌, లుపిన్‌, హెచ్డీఎఫ్‌సీ లైఫ్‌, టాటా కన్జూమర్‌ 7-1.5 శాతం మధ్య పతనమయ్యాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.5-0.3 శాతం చొప్పున బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1380 లాభపడగా.. 946 నష్టపోయాయి.

కొనుగోళ్లవైపు..
నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 4716 కోట్లు, దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 2841 కోట్లు చొప్పున ఇన్వెస్ట్‌ చేశాయి. సోమవారం మార్కెట్లకు సెలవుకాగా.. శుక్రవారం ఎఫ్‌పీఐలు రూ. 1354 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. డీఐఐలు సైతం రూ. 344 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించిన విషయం విదితమే.

మరిన్ని వార్తలు