సెన్సెక్స్‌ 155 పాయింట్లు అప్‌

8 Jan, 2019 01:20 IST|Sakshi

ఆరంభమైన అమెరికా–చైనా చర్చలు

మన దగ్గర తగ్గిన లిక్విడిటీ సమస్యలు

దీంతో పెరిగిన సూచీలు

మధ్యాహ్నం తర్వాత లాభాల స్వీకరణ

దాదాపు సగం తగ్గిన లాభాలు

155 పాయింట్లు పెరిగి 35,850కు సెన్సెక్స్‌

44 పాయింట్లు ఎగసి 10,772కు నిఫ్టీ  

సానుకూల అంతర్జాతీయ సంకేతాల కారణంగా సోమవారం స్టాక్‌ మార్కెట్‌ లాభాల్లో ముగిసింది. అమెరికా–చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతల నివారణకు చర్చలు ఆరంభం కావడం, రేట్ల పెంపుపై ఫెడరల్‌ రిజర్వ్‌ చైర్మన్‌ ఒకింత సరళమైన వ్యాఖ్యలు చేయడంతో  ప్రపంచ మార్కెట్లు లాభపడ్డాయి. మన మార్కెట్లో లిక్విడిటీ సమస్యలు తగ్గుముఖం పట్టటం, ఈ వారం నుంచి ఆరంభం కానున్న మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు బాగా ఉంటాయనే అంచనాలు లాభాల జోరుకు దోహదం చేశాయి. ముడి చమురు ధరలు పెరిగినా, రూపాయి బలపడటం కలసివచ్చింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 155 పాయింట్లు పెరిగి 35,850 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 44 పాయింట్లు పెరిగి 10,772 పాయింట్ల వద్ద ముగిశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 36,000 పాయింట్లు, నిఫ్టీ 10,800 పాయింట్ల పైకి ఎగసినప్పటికీ, ట్రేడింగ్‌ చివర్లో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో ఆ స్థాయిల్లో  నిలుదొక్కుకోలేకపోయాయి.  రియల్టీ, టెక్నాలజీ, ఐటీ, విద్యుత్తు, కన్సూమర్‌ డ్యూరబుల్స్, బ్యాంకింగ్, అయిల్, గ్యాస్‌ షేర్లు లాభపడ్డాయి.

ఆరోగ్య సంరక్షణ, లోహ, వాహన షేర్లు నష్టపోయాయి. ఈ నెల 10న టీసీఎస్, 11న ఇన్ఫోసిస్‌ కంపెనీల తమ క్యూ3 ఫలితాలను వెల్లడించనున్నాయి. ఈ క్యూ3లో కంపెనీలు మంచి ఫలితాలనే వెల్లడిస్తాయనే అంచనాలు సర్వత్రా నెలకొన్నాయి. మరోవైపు బ్యాంక్‌ నిల్వలను 1 శాతం మేర తగ్గించాలన్న చైనా కేంద్ర బ్యాంక్‌ నిర్ణయం మన మార్కెట్‌లో జోష్‌ను నింపింది. ఈ నిర్ణయం వల్ల చైనా ఆర్థిక వ్యవస్థలోకి 11,600 కోట్ల డాలర్ల అదనపు నిధుల అందుబాటులోకి వస్తాయి. ఈ సానుకూల వాతవరణంలో స్టాక్‌ సూచీలు భారీ లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. సెన్సెక్స్‌  276 పాయింట్లు, నిఫ్టీ 78 పాయింట్ల లాభంతో ఆరంభమయ్యాయి. కొనుగోళ్ల జోరుతో ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 382 పాయింట్లు, నిఫ్టీ 107 పాయింట్ల వరకూ పెరిగాయి. మధ్యాహ్నం తర్వాత మన మార్కెట్లో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. దీంతో సగం వరకూ లాభాలు హరించుకు పోయాయి. ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగియగా, యూరప్‌ మార్కట్లు నష్టాల్లో ఆరంభమై ఫ్లాట్‌గా ముగిశాయి.  

►ఐషర్‌ మోటార్స్‌ షేర్‌ రూ.20,000 మార్క్‌ దిగువకు పడిపోయింది. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ వాహన విక్రయాలు తగ్గడంతో గత నాలుగు ట్రేడింగ్‌ సెషన్లలో ఈ షేర్‌ నష్టపోతూనే ఉంది. ఇంట్రాడేలో తాజా ఏడాది కనిష్టానికి, రూ.19,751కు  పడిపోయిన ఈ షేర్‌ చివరకు 1.5 శాతం నష్టంతో రూ.19,823 వద్ద ముగిసింది. ఈ షేర్‌తో పాటు పలు షేర్లు ఇంట్రాడేలో ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. అశోక్‌ లేలాండ్, దేనా బ్యాంక్, ఆమ్‌టెక్‌ ఆటో, భారత్‌ ఫోర్జ్, ఫ్యూచర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ డీవీఆర్, మెక్‌లాయిడ్‌ రస్సెల్, నారాయణ హృదయాలయ, రెలిగేర్‌ ఎంటర్‌ప్రైజెస్, రోల్టా ఇండియా తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.  
►నిర్మాణంలో ఉన్న రియల్టీ ప్రాజెక్ట్‌లపై జీఎస్‌టీ 5 శాతానికి తగ్గనున్నదన్న అంచనాల నేపథ్యంలో రియల్టీ షేర్లు  3–20 శాతం రేంజ్‌లో పెరిగాయి.  
► బంధన్‌ బ్యాంక్‌లో గృహ్‌ ఫైనాన్స్‌ కంపెనీ విలీనం కానున్నదన్న వార్తల నేపథ్యంలో ఈ రెండు షేర్లు నష్టపోయాయి. బంధన్‌ బ్యాంక్‌ 5 శాతం నష్టంతో రూ.501 వద్ద, గృహ్‌ ఫైనాన్స్‌ షేర్‌ 3.8 శాతం నష్టంతో రూ.306 వద్ద ముగిశాయి.  
►యాక్సిస్‌ బ్యాంక్‌ 2.8% లాభంతో సెన్సెక్స్‌లో భారీగా పెరిగి, రూ. 637 వద్దకు చేరింది.  

మరిన్ని వార్తలు